మామిడి రైతన్నా.. జాగ్రత్త
మహబూబాబాద్ రూరల్ : అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామంలో గల జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరి శోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు వివరించారు. ప్రస్తుతం మామిడి పండ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అకాల వర్షాలు కురిసినప్పుడు, కురిసిన తర్వాత రైతులు మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలియజేశారు.
● వర్షం వచ్చిపోయాక 24 గంటలలోపు నీటిని బయటకు పంపాలి. నీరు నిల్వకుండా ఎత్తయిన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.
● గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బోర్డో పేస్ట్ పూయాలి.
● తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉండే పడిపోయిన పండ్లను సేకరించి దూరంగా నాశనం చేయాలి.
● వర్షం కారణంగా పక్షి కన్ను తెగులుతోపాటుగా బాక్టీరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, అవసరాన్ని బట్టి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ 6 గ్రాముల మందు 60 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నియంత్రించొచ్చు.
● అధిక వర్షపాతం వల్ల అన్ని రకాల రసం పీల్చే (పిండినల్లి, తేనెమంచు పురుగులు) తెగుళ్ల బారినపడే అవకాశం ఉంది. వర్షం ఆగిపోయిన తర్వాత ఇమిడా క్లోప్రిడ్ 1 మిల్లీ లీటరు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా 2 మిల్లీ లీటర్లు క్లోరోపైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పురుగు మందులను పిచికారీ చేయాలి.
● మామిడిలో తామరపురుగులు వర్షాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● తడి, తేమ కారణంగా, పండ్ల ఈగలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తోటల్లో పండ్ల ఈగ (ఎర) ఉచ్చులను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని పర్యవేక్షించొచ్చు. (ఎకరానికి 10 నుంచి 20 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి).
● తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు, అధిక పగటి ఉష్ణోగ్రతలు ఉద్యాన పంటలపై బూజు తెగులుకి కారణం అవుతాయి. లీటర్ నీటికి హెక్సాకోనజోల్ మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఉపశమనం ఉంటుంది.
● వడగండ్ల వాన నుంచి పండ్ల నష్టాన్ని నివారించడానికి పండ్లను పండ్ల సంచులతో కప్పాలి.
● వడగండ్ల వాన ప్రభావిత ప్రాంతంలో వర్షాల అనంతరం పొటాషియం నైట్రేట్ 10 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వాతావరణంలో మార్పులు
ఈదురుగాలులు, వడగండ్ల వానలు
వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజంతా ఎండ కొట్టి.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతోపాటు ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుతం వీస్తున్న ఈదురుగాలులతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వర్షం కురిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను మల్యాల జేవీఆర్ హెచ్‌ఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు రైతులకు వివరిస్తున్నారు.
మామిడి రైతన్నా.. జాగ్రత్త
మామిడి రైతన్నా.. జాగ్రత్త


