
నకిలీ వైద్యుడిపై కేసు నమోదు
ఎంజీఎం : నగరంలోని జేపీఎన్ రోడ్డులోని డెక్కన్ ఆప్టికల్స్ యజమాని ఎం.జనార్ధన్ కంటి వైద్యుడిగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజాసంబంధాల కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు నకిలీ వైద్యుడు ఎం.జనార్ధన్‌పై కౌన్సిల్ రిజిస్ట్రార్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ కె.మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసినట్లు నరేశ్ తెలిపారు. ఆప్టోమెట్రిస్టులు, సహాయకులు రెఫ్రాక్షన్ సేవలు (కంటి డిగ్రీలు కొలవడం) మాత్రమే చేయాలన్నారు. కానీ వైద్య సలహాలు ఇవ్వడం, కంటి వ్యాధులకు మందులు సూచించడం లేదా శస్త్ర చికిత్సల పేరుతో మోసం చే యడం చట్టవిరుద్ధమని వివరించారు. ఇలా ఎలాంటి అర్హత లేకుండా వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ వైద్యుల బా రిన పడితే పోలీసులు లేదా మెడికల్ కౌన్సిల్‌కుantiquackerytmc@onlinetsnc.in మెయిల్ ద్వారా లేదా 91543 82727 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
దామెర: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండలోని పోచమ్మకుంట సగరవీధికి చెందిన వేముల మల్లేశం(46) తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మండలకేంద్రంలో ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం కూలీ పనికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో పనులు చేసుకుంటూ కళ్లు తిరుగుతున్నాయని పక్కకు వెళ్లి కూర్చొని కుప్పకూలాడు. దీంతో స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
వాగులో పడి వృద్ధుడు..
శాయంపేట: మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన సముద్రాల రాజమొగిలి(85) గురువారం వాగులో పడి మృతి చెందాడు. రాజమొగిలి మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్దే ఉంటున్నాడు. రాజమొగిలికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. గతంలో అతడి భార్య మృతి చెందగా.. రాజమొగిలి కొడుకుల వద్దే ఉంటున్నాడు. గురువారం ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆయన కుమారులు వెతకగా.. మండలంలోని గట్లకానిపర్తి శివారులోని వాగులో పడి మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు సముద్రాల గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు.

నకిలీ వైద్యుడిపై కేసు నమోదు