
అంకితభావంతో ఆర్టీసీ డ్రైవర్ల విధులు
హన్మకొండ: ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కొనియాడారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో జరిగిన కార్యక్రమంలో రీజియన్‌లో 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం విజయ భాను ముఖ్య అతిథిగా పాల్గొని రీజియన్‌లోని 9 డిపోలలో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు జ్ఞాపిక, ప్రశంస పత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీలోనూ ఆర్టీసీ ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఉత్తమ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు పోటీ పడాలన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. మరింత ఆదాయం తీసుకురావాలన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం విజయభాను