
రైతులపై విత్తన భారం
మహబూబాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై భారం పడనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ.901గా నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది. సాగులో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తాము పెరిగిన విత్తనాల ధరతో మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వానాకాలంలో 79,689 మంది రైతులు 83,358 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఈ ఏడాది అంతకుమించి సాగు చేస్తారని అంచనా.
రైతులపైనే భారం..
కేంద్ర ప్రభుత్వం ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.37పెంచింది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా.. ప్రస్తుతం రూ.901కు చేరింది. ఈమేరకు రైతులపై లక్షలాది రూపాయల భారం పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ లేకపోవడంతో ప్రైవేటు డీలర్ల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏకంగా రూ.37 పెంచడంతో కేంద్ర నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తన ధరల పెంపుతో చిన్న రైతులు కష్టాల్లో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి తాము నష్టపోకుండా చూడాలని, భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణమే ధరలను తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులపై ఆర్థిక భారం
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులు, ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.37పెంచడం అన్యాయం. రైతులపై ఆర్థికభారం పడుతుంది.
– బానోత్ బాలోజీ, రైతు, సిరిరాజ్య తండా
ఏటేటా పెరుగుతున్న పత్తి విత్తనాల ధరలు
475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.901
గతేడాదితో పోలిస్తే రూ.37అదనం
పత్తి విత్తనాల ధరల పెరుగుదల ఇలా
సంవత్సరం ధర
(రూ.లో)
2021 767
2022 810
2023 853
2024 864
2025 901

రైతులపై విత్తన భారం

రైతులపై విత్తన భారం