స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ !
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు చేస్తోంది. దీనిలో భాగంగా స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించింది. త్వరలోనే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కూడా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ చాలా మంది మాన్యువల్‌గా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సం మార్చి నెలలో మానుకోట రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లతో పాటు మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
జిల్లాలో 27,610 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు..
జిల్లాలోని మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరి పెడ మున్సిపాలిటీల్లో మొత్త 27,610 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా..వాటిలో 18,467 ఆమోదించా రు. ఇందులో 4,749 దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించారు. 2022 ఆగస్టు 26లోపు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారి కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టారు. కాగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించడానికి మార్చి 31వరకు ఇచ్చిన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులు గత నెల 12నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
కాస్త ఊరట..
ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నాటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సందడి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ఊపువచ్చి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెల సుమారు 15 రోజుల్లోనే 150 ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు అయినట్లు సిబ్బంది పేర్కొన్నారు.
స్లాట్ బుకింగ్‌తోనే..
ప్రస్తుతం స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా మాన్యువల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లాట్ బుకింగ్ చేసుకుని వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. కాగా ప్రభుత్వం ప్రతీ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్లాన్ చేస్తోంది. త్వరలో మానుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆ విధానం అమలు కానుంది. కాగా స్లాట్ బుకింగ్ వల్ల సమస్యలు ఉన్నాయని, ఆవిధానం వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.
త్వరలో మరో కార్యాలయం..
జిల్లాలోని మరిపెడ, తొర్రూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తొర్రూరులో ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరిపెడలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా రెండు మంజూరు చేస్తారా.. లేదా ఒకటే అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. దాదాపు ఈనెలలోనే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
త్వరలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు
ప్రస్తుతం మాన్యువల్‌తో పాటు
స్లాట్‌బుకింగ్ రిజిస్ట్రేషన్లు
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియతో
ఆఫీస్‌లో సందడి
పెరిగిన మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు
జిల్లాలో మరో సబ్ రిజిస్ట్రార్
కార్యాలయం


