
భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం
● మద్దులపల్లిలో ఘటన
కాటారం: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మద్దులపల్లికి చెందిన పిట్టల శంకర్‌కు, మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లికి చెందిన పిట్టల రజిత(25)కు ఏడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి శంకర్.. తల్లి లింగమ్మ, అన్న కిష్టస్వామి, అక్క లక్ష్మి చెప్పినట్లు వింటూ భార్య రజితపై అనుమానం పెంచుకున్నాడు. వివాహేతర సంబంధాలు అంటగడుతూ నిత్యం మద్యం తాగొచ్చి రజితను కొడుతున్నాడు. దీనిపై రజిత కుటుంబీకులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా శంకర్‌లో మార్పు రాలేదు. రజిత తండ్రి మారయ్య ఆరోగ్యం బాగోలేదని ఇటీవల తమ్ముడు రఘుపతిని పంపించినప్పటికీ ఆమెను పుట్టింటికి పంపించకపోగా రజిత, ఆమె తమ్ముడిపై శంకర్ దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త అనుమానం, వేధింపులతో మనస్తాపానికి గురైన రజిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై–2 శ్రీనివాస్ తెలిపారు.
ట్రేడింగ్ కంపెనీలో చోరీ..
● రూ.9.60లక్షల అపహరణ
కేసముద్రం: ఓ ట్రేడింగ్ కంపెనీలో చోరీ జరిగింది. రూ.9.60 లక్షలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ రోడ్‌లో గల మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ వ్యాపారి గార్లపాటి ప్రమోద్ మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తన క్యాష్ కౌంటర్‌కు తాళం వేశాడు. అనంతరం వెనుక ఉన్న షెట్టర్ మూసి తాళం వేయకుండా భవనంపైనున్న తన ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ దుండగుడు షెట్టర్‌ను పైకి లేపి దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్‌లోని రూ.9.60ల క్షలు తీసుకుని పరారయ్యాడు. ఉదయం షాపుకు వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదుకాగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం