
పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
మహబూబాబాద్: బలహీన వర్గాల హక్కుల కోసం, మహిళా విద్యకోసం పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయవాది పూలే నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఆయనను స్మరించుకోవడం ప్రతీ భారతీయుడి బాధ్యత అన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, కుల సంఘాల నాయకులు కామ సంజీవ రావు, కిషన్‌నాయక్, బోడ లక్ష్మణ్, యుగేంధర్, సోమన్న, సాయికుమార్, రాందాస్, శశి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్