
రజతోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పాతికేళ్ల పండుగ వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) అవతరించి 25 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఈ రజతోత్సవ వేడుకలను నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపం చింతలపల్లి శివారులో ఈ నెల 27న భారీ సభ నిర్వహిస్తోంది. పది లక్షల మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి ‘పబ్లిక్ మీటింగ్’ నిర్వహించడానికి మార్చి 28న కాజీపేట ఏసీపీకి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరగడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పోలీసుల అనుమతి కూడా లభించింది. పాతికేళ్ల పండుగ వేడుకల నిర్వహణకు ఇంకా పది రోజులే ఉండటంతో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏం జరుగుతోంది, పనులు ఎంతవరకు.. ఆరా తీస్తున్న అధినేత కేసీఆర్..
రజతోత్సవ వేడుకల సభ ఏర్పాట్లపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోజూ ఆరా తీస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సభావేదిక ఏర్పాట్ల కోసం మొదట మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా.. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఉమ్మడి జిల్లా నేతలు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఓ సారి, సాయంత్రానికోసారి సభావేదిక ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. ఎల్కతుర్తి, గోపాల్‌పూర్, బావుపేట, ఎల్లాపూర్, కొత్తపల్లి శివార్లలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాల చదును పూర్తయ్యింది. సుమారు 50 వేల వాహనాల వరకు వస్తాయని అంచనా వేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. ఆ మేరకు ఇంకా పార్కింగ్ స్థలాలను పెంచుతున్నారు. ఇదిలా ఉండగా జనసమీకరణకు ఇదివరకే ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓ వైపు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నే.. మరోవైపు జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ‘ప్రచార రథం’లు కూడా రోడ్డెక్కాయి. కాగా, సభకు మరో పది రోజులే గడువు ఉండటంతో రెండు రోజుల్లో కీలక కమిటీలు వేయడంతోపాటు శనివారం ఉమ్మడి వరంగల్ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం.
సమావేశ స్థలం కంటే పార్కింగ్‌కే అధికం..
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ వేడుకల కోసం ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్ శివార్లలో 1,159 ఎకరాల భూసేకరణ చేశారు. ఇందుకోసం రైతులు స్వచ్ఛందంగా అనుమతి పత్రాలు ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. పోలీసులకు అనుమతి కోసం చేసిన వినతిపత్రంలో సమావేశానికి 159 ఎకరాలు, పార్కింగ్ కోసం 1000 ఎకరాలు సేకరించినట్లు స్పష్టం చేశారు. వరంగల్ – కరీంనగర్, సిద్దిపేట – వరంగల్, యాదాద్రి భువనగిరి – ఆరెపల్లి (భూపాలపట్నం)... మూడు జాతీయ రహదారులకు కేంద్రంగా ఉన్న ఎల్కతుర్తి, దాని పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న చింతలపల్లి శివారులో సభావేదిక, సమావేశానికి హాజరయ్యే ప్రజల కోసం కుర్చీలు, షామీయానాలను వేసేందుకు భూమి చదును పనులు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. లక్షల్లో జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున నిఘా కోసం తగినన్ని సీసీ కెమెరాలు, పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా మ్యాపింగ్ చేస్తున్నారు.
ఎల్కతుర్తిలో భారీ సభ కోసం మొత్తం 1,159 ఎకరాలు
పార్కింగ్ స్థలాలు, సభావేదిక మైదానాల చదును
పాతికేళ్ల వేడుకల సభకు మరో పది రోజులే... రోడ్డెక్కిన ప్రచార రథాలు
ఆవిర్భావ సభ సక్సెస్‌కు
నేడో, రేపో కీలక కమిటీలు
ఏర్పాట్లపై రోజు రెండుసార్లు
అధినేత కేసీఆర్ ఆరా
ఉమ్మడి వరంగల్ నేతలతో రేపు కేసీఆర్ భేటీ...?