
మంటగలిసిన మానవత్వం
వడదెబ్బకు గురైన కన్నతల్లికి అంత్యక్రియలు చేయని కొడుకు..
చిట్యాల: కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ కొడు కు.. కుల పెద్దలు దహన సంస్కారాలు నిర్వహించగా.. పెద్ద కూతురు నిప్పు పెట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గోనెల మల్లయ్య–రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్వరూప, వసంత, కుమారుడు ఓదెలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. కాగా పదే ళ్ల క్రితమే మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందా డు. ఈ క్రమంలో కొడుకు ఒదెలు తల్లి రాధమ్మతో నిత్యం గొడవ పెట్టుకుని ఆమెను బయటకు గెంటేశాడు. దీంతో ఆ మాతృమూర్తి గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. గురువారం ఉదయం గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లిన రాధమ్మ అక్కడే అస్వస్థతకు గురైంది. విషయం తెలిసినా ఉపాధి హామీ పని చేస్తున్న కుమారుడు ఓదెలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. గ్రామస్తులు చిన్న కుమార్తెకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని తల్లిని తీసుకుని భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రాధమ్మ మృతి చెందడంతో చిన్న కూతురు ఇంటికి తీసుకువెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఓదెలు అతని భార్య, కుమార్తెను గ్రామంలో వదిలేసి అతని కుమారుడితో కలిసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అతడి ఆచూకి వెతికినా లభించకపోవడంతో స్థానిక ఎస్సై శ్రావణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మృతిరాలి కుమార్తెలతో మాట్లాడి అంత్యక్రియలకు ఒప్పించారు. అంత్యక్రియలను కులస్తుల సహకారంతో నిర్వహించగా.. పెద్ద కూతురు స్వరూప తల్లికి తలకొరివి పెట్టింది.
దహన సంస్కారాలు చేసిన కులస్తులు
తలకొరివి పెట్టిన పెద్ద కూతురు