
అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘపూర్ స్థానిక బస్టాండ్ సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌యూ కంగన్‌హాల్, గార్మెంట్స్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కంగన్‌హాల్‌ను ప్రారంభించి షాపు యజమాని కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగుతుండగా షాపు ఎదుట బాణాసంచా కాల్చారు. నిప్పురవ్వలు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌పై పడటంతో అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పోలీసు సిబ్బంది టెంట్‌ను కిందికి లాగడంతో పాటు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. అయితే.. షాపులోకి మంటలు వ్యాపించకుండా ముందు షెట్టర్‌ను మూసివేసి కొద్దిసమయం తర్వాత తెరిచారు. అప్పటి వరకూ ఎమ్మెల్యే షాపు లోపలే ఉన్నారు. ఆయన క్షేమంగా వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో టెంట్, షాపు ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, షాపు బోర్డు పాక్షికంగా కాలిపోయాయి. కార్యక్రమంలో షాపు యజమాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకుడు నీల వీరస్వామి, ఏఎంసీ డైరెక్టర్ నీల వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.