
ఎదురుచూపులు ఎన్నాళ్లు?
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యం ఇప్పుడు సన్న బియ్యం కావడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదా రులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతూ.. తమ కు కార్డు ఇప్పించాలని కోరుతున్నారు.
జిల్లాలో 2.40 లక్షల కార్డులు
రేషన్ బియ్యం, పేదరికానికి రుజువుగా కార్యాలయాలు, ఆస్పత్రుల్లో చూపించేవి తెల్ల రేషన్ కార్డులు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్డులు జిల్లాలో ఇప్పటి వరకు అంత్యోదయ కార్డులు 16,792, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 2,23,749, ఏఏపీ కార్డులు మొత్తం 2,40,543 ఉన్నాయి. ఈ కార్డుల్లోని సభ్యులు మొత్తం 7,20,427 మంది ఉండగా అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, ఇతర కార్డుల్లోని సభ్యులకు నెలకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తారు. అయితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒకసారి కార్డులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల్లో గ్రామానికి ఒకటి రెండు చొప్పున జిల్లాలో వెయ్యి కార్డులు మొక్కుబడిగా ఇచ్చారు. అయితే మిగిలిన దరఖాస్తుదారులు కొత్త కార్డులకోసం ఎదురుచూస్తున్నారు.
ప్రజాపాలనలో 1.20 లక్షల దరఖాస్తులు
సంక్షేమ పథకాల అమలుకోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం 1.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో అనర్హులు, ఇంతకుముందు కార్డులు ఉన్నవారు, ఇతర కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఇలా మొత్తం 87 వేల దరఖాస్తులను ఏరివేశారు. మిగతా 33వేల దరఖాస్తులపై విచారణ చేసి కొత్త కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. అదే విధంగా పేర్లు చేర్పులకోసం వచ్చిన దరఖాస్తుల్లో 28,274 రాగా పరిశీలించిన అధికారులు కొత్తగా 41,946 మందిని చేర్చే అవకాశం ఉందని లెక్కించారు. కానీ ఇంకా చేర్చలేదు. దీంతో ఇంట్లో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే ఇద్దరికి మాత్రమే రేషన్ వస్తుంది. అర్హులుగా పేర్కొన్న దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా తహసీల్దార్ ఫోల్డర్‌కు కొట్టి రెవెన్యూశాఖ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేయించి కొత్త కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా చేపట్టి అర్హులైన వారికి కొత్త కార్డుల మంజూరుతోపాటు, పిల్లల పేర్లు కార్డుల్లో చేర్చాలని నిరుపేదలు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం తెల్లరేషన్ కార్డులు :
2,40,543
యూనిట్లు (సభ్యులు) :
7,20,427
నెలవారీగా సరఫరా చేసే బియ్యం :
46,021 మెట్రిక్ టన్నులు
ప్రజాపాలనలో కొత్త రేషన్
కార్డులకోసం వచ్చిన
దరఖాస్తులు : 1.20 లక్షలు
అనర్హులుగా తేల్చినవి : 37 వేలు
కొత్త కార్డుల కోసం అర్హులు : 33 వేలు
రేషన్‌కార్డు లేక.. సన్నబియ్యం రాక..
కార్యాలయాల చుట్టూ
తిరుగుతున్న దరఖాస్తుదారులు
ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుండటంతో
కొత్త కార్డు కోసం పెరిగిన డిమాండ్
త్వరలో కొత్త రేషన్‌కార్డులు
ఇస్తామంటున్న అధికారులు

ఎదురుచూపులు ఎన్నాళ్లు?