
పాఠశాలల స్థలాలు కబ్జా
● ప్రహరీలు లేకపోవడంతో ఆక్రమణకు గురవుతున్న జాగాలు
● పాఠశాల ఆవరణ నుంచే
వాహనాల రాకపోకలు
● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, సిబ్బంది
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో పాఠశాలల స్థలాల ను ఆక్రమిస్తున్నారు. ప్రహరీలు లేకపోవడంతో పా ఠశాలల చుట్టూ నివాసం ఉంటున్న వారు కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్‌ఎస్ స్థలాన్ని చుట్టుపక్కల వారు ఆక్రమించారని పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ప్రహరీలు లేక..
జిల్లాలో 121 ప్రాథమిక పాఠశాలలు, 678 ప్రాథమికోన్నత, 102 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. ఇందులో 441 పాఠశాలలకు ప్రహరీలు లేక నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మానుకోట మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లి జెడ్పీహెచ్‌ఎస్, శనిగపురం పాఠశాలలకు ప్రహరీలు లేవు. దీంతో పాఠశాలల ఆవరణల్లో పశువులు, పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. అదేవిధంగా పలు వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. ఈమేరకు కంకరబోడ్ హైస్కూ ల్‌లో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. రహదారి బంద్ చేశామని బోర్డులు, అడ్డుగా పైపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వాహనాల రాకపోలు ఆగకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలోకి విష సర్పాలు వస్తుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పాఠశాలలు అసాంఘిక కార్యకలాపాలను అడ్డాగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
జిల్లా కేంద్రం నడిబొడ్డున..
జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న కంకరబోడ్ స్కూల్ స్థలం కబ్జాకు గురవుతుందని ఆ పాఠశాల హెచ్‌ఎం, విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనకు దిగి డీఈఓ, కలెక్టర్‌కు వినతి పత్రాలు కూడా అందజేశా రు. 4ఎకరాల 3 గుంటల స్థలం ఉండాలి. ప్రస్తుతం 2ఎకరాల 13 గుంటలు మాత్రమే ఉంది. అందులో కూడా పాఠశాల అనుమతి లేకుండానే మిషన్ భగీరథ వాటర్ ట్యాక్ నిర్మించారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలలకు ప్రహరీలు మంజూరు అయ్యేలా కృషి చేయాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు.

పాఠశాలల స్థలాలు కబ్జా