
వల్మిడి ఆలయంలో భక్తులకు గాయాలు
● గాలి దుమారంతో కూలిన టెంటు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో అప్రశుతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా సుడి గాలి దుమారం రావడంతో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం వద్ద టెంట్లు కూలాయి. దీంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న వల్మిడికి చెందిన వృద్ధురాలు వాసూరి మారమ్మ, చెన్నూరుకు చెందిన బాలిక మారేపల్లి మనుశ్రీ, గంట్లకుంటకు చెందిన సంధ్యారాణి గాయపడ్డారు. వారికి ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ప్రథమ చికిత్స చేశారు.
మానుకోటలో సూర్యాపేట పోలీసుల విచారణ
మహబూబాబాద్ రూరల్: సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ హత్య కేసు విషయంలో అక్కడి పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆ దివారం రాత్రి విచారణ చేపట్టారు. నిందితులు సూర్యాపేటలో హత్య చేసి, వారు వాడిన ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లను మహబూబాబాద్‌లో ఉంచి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లను కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణలో ఉంచి వెళ్లగా సూర్యాపేట పోలీసులు స్వాధీనం చేసుకుని తమవెంట తీసుకెళ్లారు. హత్య కేసులో మహబూబాబాద్‌లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడి బంధువు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.