
తీరుమారకుంటే ఉద్వాసన తప్పదు
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమయపాలన పాటించని, విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, సిబ్బందికి ఉద్వాసన తప్పదని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. సోమవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది వరంగల్, ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, ఇక్కడ పనిచేయడం ఇష్టంలేని వారు లెటర్ రాసి వెళ్లిపోవచ్చన్నారు. డోర్నకల్, గార్ల, గూడూరు, బయ్యారం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదన్నారు. ఆస్పత్రి వార్డుల్లో సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. అనంతరం వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి, ఉదయం 24 మంది మాత్రమే విధులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వైద్యులు, సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీజీహెచ్ వైద్యుల తీరుపై
ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం