బీఆర్‌ఎస్ రజతోత్సవ సభాస్థలి పరిశీలన
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారు, చింతలపల్లి గ్రామ సమీపంలోని సుమారు 1200 ఎకరాల్లో ఈనెల 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు వేర్వేరుగా సభా స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలి ప్రాంగణంలో అక్కడడక్కడ కొంత వరిపంట కోతదశలో ఉన్నందున ఆ పాంత్రాన్ని బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు. మిగతా స్థల ప్రాంగణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో సభా స్థలం పనులు పూర్తి కానున్నాయని అంచనా వేశారు. నాయకులు పిట్టల మహేందర్, కడారి రాజు, తంగెడ నగేశ్, డుకిరె రాజేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
దూరవిద్య ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలోని దూరవిద్య కేంద్రం ఎమ్మెస్సీ సైకాలజీ ఫైనలియర్ విద్యార్థులు, ఎక్స్ అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్స్, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పరీక్షలు ఈనెల 24 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలు వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
కూర మాడిపోతుందన్న ఆతృతలో..
● రేకులపై ఉన్న మసిగుడ్డ తీసే క్రమంలో విద్యుదాఘాతం
● అక్కడికక్కడే వివాహిత మృతి
● రాంచంద్రుతండాలో ఘటన
చిన్నగూడూరు: కూర మాడిపోతుందన్న ఆతృతలో రేకులపై ఉన్న మసిగుడ్డ తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రం శివారు రాంచంద్రుతండాలో జరిగింది. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం..తండాకు చెందిన బాదావత్ అఖిల(25) సోమవారం రాత్రి తన ఇంటిలో వంట చేస్తోంది. ఈ క్రమంలో పొయ్యి మీద కూర మాడిపోతుందన్న ఆతృతలో ఇంటి ఎదుట రేకులపై ఉన్న మసిగుడ్డను తీసే సమయంలో రేకులకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ తగలడంతో కిందపడింది. గమనించిన స్థానికులు రేకులకు విద్యుత్ సరఫరా అవుతున్న వైర్ తొలగించారు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు (రిత్విక్ రెండు సంవత్సరాలు, రిద్వాన్ నాలుగు సంవత్సరాలు), భర్త నరేశ్ ఉన్నారు. తల్లి మృతితో గుక్కిపెట్టి ఏడుస్తున్న చిన్నారులను చూసి తండావాసులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభాస్థలి పరిశీలన
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభాస్థలి పరిశీలన


