
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
కురవి: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మండల కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడిన గుగులోత్ కిషన్‌నాయక్ ఆత్మ శాంతించాలని బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఆరుగ్యారంటీ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. హా మీలు అమలు చేయకుండా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడే పరిస్థితి ఉందన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 10వేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యాయనాయక్ మాట్లాడుతూ..కార్యకర్తలు ఐక్యంగా ఉండి విజయం సాధించాలన్నారు. బోడ బాజీ అనే వృద్ధురాలు బీఆర్‌ఎస్‌సభ కోసం తన పింఛన్ డబ్బుల నుంచి రూ.1000 మాజీ ఎంపీ కవితకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూతక్కి సాంబశివరావు, నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవినాయక్, గుడిబోయిన రాంచంద్రయ్య, గుగులోత్ నెహ్రూనాయక్, నామ సైదులు, బోడ శ్రీను, రాంలాల్, కొణతం విజయ్, కిన్నెర మల్లయ్య, చల్ల గుండ్ల గణేష్, బానోత్ గణేష్, బానోత్ రాము, సంజీవ నాయక్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు
మాలోత్ కవిత