సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాయడమంటే కార్మికులను బానిసలుగా చేయడమేనన్నారు. కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాలు సమ్మెలో భాగస్వాములు కావాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అవిశ్రాంత పోరాటాలు కొనసాగించాలన్నారు. కార్మికుల దినోత్సవం మే డే ఉత్సవాలకు కార్మికవర్గం సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో కుమ్మరికుంట్ల నాగన్న, కోటేశ్వర్‌రావు, స్నేహబిందు, ఆండాలు, వెంకన్న, రవి, బాలు, జనార్దన్, హేమా, లక్ష్మణ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు


