
పిడుగు పాటుకు పశువుల మృత్యువాత
బచ్చన్నపేట : పిడుగుపాటుకు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని కట్కూర్‌లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రికింది ఎల్లయ్య బుధవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద రెండు ఎడ్లు, ఓ పాడి గేదెను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం ఈదురుగాలులతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా మూడు పశువులు మృత్యువాత పడి కనిపించగా బోరున విలపించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, బాధిత రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.