ఇంటి నుంచి వెళ్లి.. బావిలో శవమై కనిపించి
నెల్లికుదురు: ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యాపారి అనుమానాస్పదస్థితిలో వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటన గురువారం ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓబిలిశెట్టి కిశోర్ (40) కిరాణ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు కిశోర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కట్ల ఐలయ్య వ్యవసాయ బావివద్ద కిశోర్ వాహనం కనిపించింది. దీంతో వ్యవసాయ బావిలో చూడగా మృతి చెంది శవమై కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, కిశోర్ మృతికి కుటుంబ కలహాల లేదా.. మరే ఇతర కారణమా అనే విషయం తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో వ్యాపారి మృతి
చిన్నముప్పారంలో ఘటన


