రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో ఈ నెల 8వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 7వ యూత్ అండర్–19 మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పి.రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 01, 2007 నుంచి డిసెంబర్ 31, 2008 మధ్యలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. అర్హత గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, స్టడీ బోనోఫైడ్ సర్టిఫికెట్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, రూ.300 ప్రవేశ రుసుం తీసుకుని రావాలని చెప్పారు. క్రీడాకారులు 8న ఉదయం 7గంటలకు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్ వద్ద హాజరైతే వెయింగ్ తీసుకుంటామన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 11, 12వ తేదీల్లో సికింద్రాబాద్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9959711609 నంబర్‌లో సంప్రదించాలని రాజేందర్ పేర్కొన్నారు.
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 చదరంగ పోటీలు సాయంత్రం ముగిశాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల హాజరైన 40మంది క్రీడాకారుల మధ్య పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. ముగింపు వేడుకలకు టీటీడీ మండప మేనేజర్ రఘువీర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో రిత్విక్ గండు ప్రథమ స్థానం, సాయిజోషిత్ బొల్లం ద్వితీయ స్థానం, అక్షయ్‌కుమార్ తృతీయ స్థానం, చకిలం చరణ్‌రాజ్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో తోట జాన్వీ, దీపిక బొమ్మిడిని, వర్శిత పటూరి, కై రంకొండ సహస్ర, కోమలి వరుస స్థానాల్లో విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. విజేతలు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు శ్రీని వాస్, ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రైలు పట్టాలపై వ్యక్తి
మృతదేహం లభ్యం
ఖిలా వరంగల్ : వరంగల్ – కాజీపేట మధ్య శాయంపేట రైల్వే గేట్ సమీపాన రైలు నుంచి జారి పడి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్‌కానిస్టేబు ల్ రాజు ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తు తెలియని 35 నుంచి 40 ఏళ్ల వయసు గల వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ చెక్స్ పుల్ షర్ట్‌ఽ, పారగాన్ చప్పల్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఆదివారం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే 9441557232,8712658585 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందజేయాలని రాజు కోరారు.
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు


