ప్రాణం తీసిన ఫేస్‌బుక్ వ్యసనం
* ఇద్దరు యువతుల హత్య
* ప్రాణం తీసిన ఫేస్‌బుక్ వ్యసనం
* చెన్నైలో వెలుగుచూసిన దారుణాలు
ప్రేమించిన యువకులే ఆ యువతులను కడతేర్చారు. ప్రియుల ప్రేమోన్మాదం ఆ ఇద్దరు యువతుల జీవితాన్ని నిలువునా హరించివేసింది. ఉన్నత విద్యావంతులైన ఆ అమ్మాయిలను కాటికి పంపారు. చెన్నై నగరంలో స్వల్ప వ్యవధిలో చోటుచేసుకున్న రెండు హత్యోదంతాలు తల్లిదండ్రులనేగాక ప్రజలను హతాశులను చేశాయి. అత్యాచారానికి యత్నించగా, ప్రతిఘటించిన ందుకు ఒక యువతిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో సంఘటనలో ఫేస్ బుక్ చాటింగ్ వద్దన్నా వినకపోవడంతో యువతిని ప్రియుడు హత్య చేశాడు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : తలమైసెయిలగ కాలనీ వీజీ అపార్టుమెంటులో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి కన్నప్పన్ అనారోగ్యంపాలై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భార్య జమున భర్తకు తోడుగా ఉంటోంది. ఈ దంపతులకు కుమార్తెలు ఉమా, అశ్వని, కుమారుడు దినేష్ (25) ఉన్నారు. చూలైకి చెందిన అరుణ బీకాం పూర్తిచేసి ఆడిటర్ శిక్షణ తీసుకుంటోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడూ చుడీదార్‌తో ఆఫీసుకు వెళ్లే అరుణ (20) సోమవారం చీరతో వెళ్లింది. ఇంట్లోవారు ఇదేమని ప్రశ్నించగా దేవతలా తిరిగి వస్తానని చమత్కారంతో బదులిచ్చింది. తండ్రితోపాటూ ఆస్పత్రిలో అమ్మ, సోదరి ఉండడంతో ఇంటిలో ఒంటరిగా ఉన్నానంటూ దినేష్ ప్రియురాలు అరుణను సాయంత్రం ఇంటికి రప్పించుకున్నాడు.
రాత్రి 10.30 గంటల సమయంలో ఒక పరుపు, దుప్పటిలో అరుణ మృతదేహాన్ని చుట్టి తమ కారు డిక్కీలో ఎక్కించే ప్రయత్నంలో బరువును ఎత్తలేకపోయాడు. పక్కనున్న అపార్టుమెంటు సెక్యూరిటీ గార్డును పిలిచి ఆస్పత్రిలో ఉన్న తండ్రి కోసం వీటిని తీసుకెళుతున్నాను సహకరించాల్సిందిగా కోరాడు. అరుణను ఉంచిన మూటను ఇద్దరు కలిసి ఎత్తి కారులోకి చేరవేస్తున్న దశలో చేయి బయట పడింది. దీంతో ఉలిక్కిపడిన సెక్యూరిటీ గార్డు బిగ్గరగా కేకలు వేయడంతో దినేష్ పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ ప్రియురాలి నుంచి స్వాధీనం చేసుకున్న ఆమె హ్యాండ్ బ్యాగ్, నగలతో సహా అరుణ ఇంటి వద్ద గిరాటు వేసి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగూ వచ్చి పరుపు మూటను విప్పిచూడగా దారుణంగా పొడిచి చంపిన తీరులో అరుణ మృతదేహం ఉంది.
ఆఫీసుకు వెళ్లిన అరుణ రాత్రి పొద్దుపోతున్నా ఇంటికి చేరుకోకపోవడం, సెల్‌ఫోన్ ఎత్తకపోవడంతో భయపడిన అరుణ తల్లిదండ్రులు కుముద, శ్రీనివాసన్ వెతుకులాటకు బయలుదేరారు. ఇంటి బయట కుమార్తె హ్యాండ్‌బ్యాగ్, నగలు దొరకడంతో మరింతగా భయపడిన ఆయన రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కీల్‌పాక్ వద్ద ఒక యువతి హత్యకు గురైంది, మీ అమ్మాయేమో చూసుకోండని సరిగ్గా అదే సమయంలో పోలీసులు శ్రీనివాసన్‌కు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉన్న అరుణ మృతదేహాన్ని చూసి తల్లి అముద స్ఫృహ తప్పిపోగా, తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయాన్ని అవకాశంగా తీసుకుని అరుణపై అత్యాచారం చేయబోతే ప్రతిఘటించడం వల్ల హతమార్చాడా లేక అత్యాచారం చేసి హత్య చేశాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారైన నిందితుడు దినేష్ కోసం మంగళవారం తెల్లవారేవరకు రోడ్లన్నీ దిగ్బంధించి, గాలించినా దొరక్క పోవడంతో అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలిస్తున్నారు.
ప్రాణంతీసిన ఫేస్‌బుక్
బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ప్రియురాలిపై అనుమానం పెంచుకుని ఆమె ప్రాణాలనే హరించిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వడపళనికి చెందిన అంతోని కుమార్తె గ్రేసీ షాలినీ (21) (ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ విద్యార్థిని) కోడంబాకానికి చెందిన అబ్దుల్ రజాక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల సెల్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా బాయ్‌ఫ్రెండ్స్‌తో గంటల కొద్దీ చాటింగ్ చేస్తున్నట్లు రజాక్ అనుమానించాడు. అంతేగాక ఇటీవల తనకు దూరంగా మెలుగుతున్నట్లు భావించాడు. బాయ్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్ మానుకోవాలని అనేకసార్లు మందలించినా ఆమె పట్టించుకోలేదు. తాంబరం సమీపం పట్టిపై ఆరంబాకంలో కాపురం ఉంటున్న నత్తంబీవీ అనే మహిళ ఊరికెళుతూ తన ఇంటి తాళాలను రజాక్ వద్ద ఇచ్చి వెళ్లింది.
ఈనెల 7వ తేదీన కాలేజీకి వెళ్లిన షాలినీని నత్తంబీవీ ఇంటికి పిలిపించుకున్నాడు. చాటింగ్ వ్యవహారాలు మానుకోవాలని మళ్లీ మందలించా డు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా అగ్రహం పట్టలేని రజాక్ పక్కనే ఉన్న పశువులు కట్టే తాడుతో ఆమెకు ఉరిబిగించి హతమార్చాడు. శవాన్ని ఇంటిలోనే వదిలి ఏమీ తెలియనట్లుగా తాళం వేసుకుని కోడంబాకంలోని ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం నత్తం బీవీ ఇంటికి చేరుకోగా దారుణంగా కుళ్లిపోయిన స్థితిలో షాలిని మృతదేహం పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి రజాక్‌ను అరెస్ట్ చేశారు.