‘ఫేస్‌బుక్’ కలిపింది ఇద్దరిని..! | Indian Hockey Team's CWG Show One of the Best in Recent Times, Feels Tirkey | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్’ కలిపింది ఇద్దరిని..!

Published Tue, Aug 12 2014 12:56 AM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM

‘ఫేస్‌బుక్’ కలిపింది ఇద్దరిని..! - Sakshi

‘ఫేస్‌బుక్’ కలిపింది ఇద్దరిని..!

 ఫేస్‌బుక్... సప్త సముద్రాల ఆవల ఉన్న వారినీ ఏకం చేస్తున్న సామాజిక నెట్‌వర్క్. దీనిద్వారా అనేకమంది చాటింగ్ మొదలుపెట్టి పెళ్లి దాకా వెళ్లారు. ఈ జాబితాలోనే చేరాడు భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్. ఇంగ్లండ్ హాకీ జట్టు యువ క్రీడాకారిణి అశ్‌పాల్ కౌర్ భోగల్‌తో రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వచ్చే ఏడాది వీరు వివాహం చేసుకోబోతున్నారు.
 
భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ ప్రేమాయణం

న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడాకారుల ప్రేమాయణాల ప్రస్తావన వస్తే ముందుగా క్రికెటర్లు, ఫుట్‌బాలర్లు, టెన్నిస్ స్టార్స్ వస్తారు. అయితే ఓ హాకీ క్రీడాకారుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అతనెవరో కాదు... మైదానంలో మెరుపు కదలికలతో సహచరులకు పాస్‌లు ఇస్తూ, గోల్స్ చేసేందుకు అవకాశాలు సృష్టించడంలో దిట్ట అయిన భారత హాకీ కెప్టెన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్. రెండేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత హాకీ జట్టు ఎలాంటి పతకం లేకుండా రిక్తహస్తాలతో తిరిగి వచ్చినా... కెప్టెన్ సర్దార్ సింగ్‌కు మాత్రం జోడి దొరికింది.

‘ఒకరోజు నా ఫేస్‌బుక్ అకౌంట్ ఇన్‌బాక్స్‌లో వచ్చిన సందేశాన్ని చూసుకున్నాను. అశ్‌పాల్ కౌర్ అనే అమ్మాయి నుంచి ఈ సందేశం వచ్చింది. తొలుత తేలిగ్గా తీసుకున్నాను. ఆ తర్వాత వరుసగా నా గురించి ఎన్నో విషయాలు రాయడంతో ఆసక్తి పెరిగింది. ఎవరీ అమ్మాయి. ఒకసారి కలిస్తే బావుంటుంది అనుకున్నాను. లండన్ ఒలింపిక్స్ (2012)లో మా మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని ఆహ్వానించాను. కానీ ఆమె రాలేదు’ అని ప్రేమ చిగురించిన క్షణాలను సర్దార్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.
 
‘లండన్ ఒలింపిక్స్ తర్వాత స్వదేశానికి వచ్చాను. కానీ మా మధ్య ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్, ఫోన్స్ కాల్స్‌తో మాటల పరంపర కొనసాగింది. అయినా ఈ మాటలు మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించలేకపోయాయి. మూడు నెలల గడిచాయి. సస్పెన్స్‌కు తెరదించాలనుకున్నాను. లండన్ వెళ్లి అశ్‌పాల్‌ను, ఆమె తల్లిదండ్రులను కలవాలని నిర్ణయించుకున్నాను. వారితో కలిశాక నా ఆనందం రెట్టింపైంది. ఈ సంబంధం గురించి నా తల్లిదండ్రులవద్ద ప్రస్తావించాను. నేను ఎలా ఫీలవుతున్నానో చెప్పాను. కానీ వారు మాత్రం ఆ అమ్మాయి ‘నామ్‌ధారి’ వర్గీయురాలేనా అని ప్రశ్నించడంతో నేను కొంచెం కంగారు పడ్డాను. కానీ అంతా మంచే జరిగింది. నామ్‌ధారి వర్గం పెద్ద.. ఠాకూర్ ఉదయ్ సింగ్ నుంచి ఆమోదం లభించాక ఇంట్లో వారూ ఈ సంబంధానికి సరే అన్నారు’ అని ప్రస్తుతం హర్యానా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరిటెండెంట్‌గా పనిచేస్తోన్న 28 ఏళ్ల సర్దార్ సింగ్ వివరించాడు.

‘ఈ ఏడాది మే 22న నెదర్లాండ్స్‌లో ప్రపంచ కప్ సమయంలో అశ్‌పాల్‌కు పెళ్లి ప్రతిపాదన చేశాను. ఆమె అంగీకరించింది. ఇప్పటికైతే నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో వాళ్లు తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. కానీ 2016 రియో ఒలింపిక్స్ వరకు ఆగితే బావుంటుందని నా అభిప్రాయం తెలిపాను. ఈ ఏడాది మా ఇద్దరికీ బిజీ షెడ్యూల్ ఉంది. నేను ఆసియా క్రీడల్లో, చాంపియన్స్ ట్రోఫీలో ఆడాలి.

అశ్‌పాల్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సేవలు అందించాల్సి ఉంది. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముంది’ అని సర్దార్ సింగ్ తెలిపాడు. వచ్చే నెలలో 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్న అశ్‌పాల్ తమ పరిచయాన్ని ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్’ అని చెబుతోంది. ఆరేళ్ల వయస్సులోనే హాకీ స్టిక్ పట్టుకున్న అశ్‌పాల్ ఇంగ్లండ్ అండర్-19 జట్టులో ఎంపికై ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సంతతి క్రీడాకారిణిగా నిలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement