Sardar Singh
-
జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్, సర్దార్
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ సింగ్, ‘టాప్స్’ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు. -
సర్దార్ ఇక హాకీ సెలక్టర్...
న్యూఢిల్లీ: ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్‌సింగ్ ఇక సెలక్టర్ పాత్ర పోషించనున్నాడు. 13 మంది సభ్యుల భారత హాకీ సెలక్షన్ కమిటీలో సర్దార్కు చోటు దక్కింది. ఈ విషయాన్ని సర్దార్ సింగ్ ధ్రువీకరించాడు. ‘భారత హాకీకి ఆటగాడిగానే కాకుండా ఏ రకంగా సేవచేసేందుకైనా నేను సిద్ధం. అందుకే సెలక్టర్ పాత్రను పోషించేందుకు కూడా సిద్ధమయ్యాను. సెలక్టర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా హాకీ పరిస్థితుల్ని దగ్గరుండి చూశా. జట్టుకు ఏది ముఖ్యమో అర్థం చేసుకున్నా. అనుభవజ్ఞులు, యువతతో కూడిన సమతూకమైన జట్టుకే నేను మద్దతిస్తా’ అని సర్దార్ సింగ్ పేర్కొన్నాడు. సర్దార్తో పాటు హర్బీందర్ సింగ్, సయ్యద్ అలీ, సుబ్బయ్య, ఆర్పీ సింగ్, రజనీశ్ మిశ్రా, జోయ్‌దీప్ కౌర్, సురేందర్కౌర్, అసుంత లాక్రా, హై పర్ఫామెన్స్ డైరైక్టర్ డేవిడ్ జాన్, భారత సీనియర్ పురుషుల, మహిళల జట్ల కోచ్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి 1975 హాకీ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన బీపీ గోవింద సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
సచిన్‌తో మాట్లాడా... గాడిన పడ్డా: సర్దార్
న్యూఢిల్లీ: ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలకు జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన సందర్భంలో... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాల కోసం ఫోన్ చేసినట్లు గత వారం రిటైరైన భారత హాకీ స్టార్ సర్దార్ సింగ్ వెల్లడించాడు. ‘సచిన్ నాకు ఆదర్శం. కఠినంగా సాగిన గత మూడు నెలల కాలంలో ఆయన చాలా సాయపడ్డారు. విమర్శలు మర్చిపోయి ఆటపై దృష్టిపెట్టమని సూచించారు. నా పాత వీడియోలను చూసి పొరపాట్లు దిద్దుకుంటూ, సహజమైన ఆట కొనసాగించమని పేర్కొన్నారు. ఆ సూచనలతో గాడినపడ్డా’ అని సర్దార్ వివరించాడు. -
హాకీకి సర్దార్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత హాకీలో మరో స్టార్ ప్లేయర్ శకం ముగిసింది. 12 ఏళ్లుగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్దార్ సింగ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కొత్త కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏళ్ల ఈ హరియాణా ప్లేయర్ వివరించాడు. హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సర్దార్ 2006లో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 307 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ... ఆటను నియంత్రిస్తూ... ఫార్వర్డ్ ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు సృష్టిస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను మధ్యలోనే తుంచేస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2008 నుంచి 2016 వరకు భారత్‌కు కెప్టెన్ వ్యవహరించాడు. ‘ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ హాకీ ఆడుతున్నా. ఇప్పుడు సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికి... కుర్రాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నా. కుటుంబ సభ్యులు, హాకీ ఇండియా, మిత్రులతో చర్చించాకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నా’ అని సర్దార్ వివరించాడు. ‘నా నిర్ణయానికి ఫిట్నెస్ సమస్య కాదు. మరో మూడేళ్లు ఆడే ఫిట్నెస్ నాలో ఉంది. ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది కదా. హాకీకి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని భావించా’ అని సర్దార్ వివరించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన సర్దార్కు 2012లో ‘అర్జున’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడతానని... 2010, 2018 ఏషియాడ్‌లో కాంస్యం, 2014 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడైన సర్దార్ వివరించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్
సాక్షి, న్యూఢిల్లీ : భారత స్టార్ హాకీ ఆటగాడు, మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. తాను శాస్వతంగా ఆట నుంచి వైదొలుగుతున్నానని బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. భారీ ఆశల నడుమ ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరకపోవటం సర్దార్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో హాకీని ఎంతో ఆస్వాధించానని.. జట్టు నుంచి వైదొలగడానికి తనకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. 32 ఏళ్ల సర్దార్ సింగ్ భారత్‌కు 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2008-16 మధ్యలో ఎనిమిదేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు. ఇతని నాయకత్వంలోనే 2008లో సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత హాకీ జట్టుకు సర్ధార్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డులతో గౌరవించింది. అంతే కాకుండా సర్దార్ నాయకత్వంలోనే భారత్ రెండు సార్లు ఒలంపిక్స్‌లో పాల్గొంది. -
సర్దార్ సింగ్‌కు పిలుపు
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్ జట్టులో చోటు దక్కని సర్దార్ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు. జట్టు: గోల్‌కీపర్స్: శ్రీజేశ్ (కెప్టెన్), బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సన సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్. ఫార్వర్డ్స్: సునీల్ విఠలాచార్య, రమణ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, సుమిత్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. -
సర్దార్‌పై వేటు
న్యూఢిల్లీ: అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా జట్టు వైఫల్యంలో భాగంగా నిలిచిన సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్‌పై హాకీ ఇండియా (హెచ్ఐ) నమ్మకం కోల్పోయింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి సర్దార్‌ను తప్పించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 7 నుంచి జరిగే ఈ పోటీల కోసం మంగళవారం జట్టును ప్రకటించారు. సర్దార్తో పాటు మరో సీనియర్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్‌ను కూడా ఎంపిక చేయలేదు. 18 మంది సభ్యుల జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... చింగ్లెన్సనా సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మన్‌ప్రీత్ సారథ్యంలోనే ఆసియా కప్ గెలుచుకున్న భారత్, హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కూడా కాంస్యం సాధించింది. గాయం నుంచి కోలుకున్న మరో సీనియర్ ఆటగాడు, మేటి గోల్‌కీపర్ శ్రీజేశ్కు జట్టులో చోటు లభించింది. ఇటీవల జరిగిన అజ్లాన్ షా టోర్నీలో సర్దార్ ఆట తర్వాత అతనిపై వేటు ఖాయమనే కనిపించింది. అయితే ఇదే టోర్నీలో మెరుగ్గా ఆడిన రమణ్దీప్ను కూడా తప్పించడం ఆశ్చర్యపరచింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కుర్రాళ్లు దిల్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్‌లకు కామన్వెల్త్ అవకాశం దక్కింది. ‘2017 ఆసియా కప్‌తో మొదలు పెట్టి వేర్వేరు టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని జట్టును ఎంపిక చేశాం. మా దృష్టిలో కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించగల అత్యుత్తమ జట్టు ఇది’ అని భారత కోచ్ జోయెర్డ్ మరీనే చెప్పారు. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), రూపిందర్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, గురీందర్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, సుమీత్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్‌ఫీల్డర్లు), ఆకాశ్‌దీప్ సింగ్, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్‌కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్లు). -
సర్దార్ సింగ్ పై వేటు
న్యూఢిల్లీ: సీజన్ ముగింపు టోర్నీ హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్, ఈ ఏడాది ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డీ సర్దార్ సింగ్‌పై హాకీ ఇండియా (హెచ్ఐ) వేటు వేసింది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు భువనేశ్వర్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులు గల భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత నెలలో ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 31 ఏళ్ల సర్దార్‌ను తప్పించడం ఆశ్చర్యకర పరిణామమే. 2006 నుంచి భారత జట్టు సభ్యుడిగా ఉన్న ఈ హరియాణా ప్లేయర్ ఇప్పటివరకు 191 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
♦ ‘ఖేల్‌రత్న’ అందుకున్న జజరియా, సర్దార్ సింగ్ ♦ ‘అర్జున’ స్వీకరించిన సాకేత్, జ్యోతి సురేఖ ♦ ప్రసాద్‌కు ‘ద్రోణాచార్య’ హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాలను స్వీకరిస్తున్న దేవేంద్ర జజరియా, సర్దార్ సింగ్ (ఖేల్‌రత్న), సాకేత్ మైనేని, జ్యోతి సురేఖ (అర్జున), గంగుల ప్రసాద్ (ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), హకీమ్ (ధ్యాన్‌చంద్ అవార్డు) కుడి నుంచి... న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల పురస్కార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్ త్రోయర్ జజరియా నిలిచాడు. ఇక గత కొన్నేళ్లుగా మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా... కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎస్ఎస్వీ ప్రసాద్ ‘ద్రోణాచార్య’ (లైఫ్ టైమ్ అచీవ్మెంట్)... ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్ సయ్యద్ షాహిద్ హకీమ్ ‘ధ్యాన్‌చంద్’ అవార్డులను అందుకున్నారు. రియో పారాలింపిక్స్ హైజంప్ (ఎఫ్46)లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు అర్జున స్వీకరించేందుకు వస్తున్న సమయంలో ఆహుతుల నుంచి విశేష స్పందన కనిపించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్లతో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు. ‘దివ్యాంగ అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాలి’ భారత పారా అథ్లెట్లకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని దేవేంద్ర జజరియా అభిప్రాయపడ్డాడు. ‘నాలాంటి వారు భారత్‌లో ఐదు కోట్ల మంది అథ్లెట్లు ఉన్నారు. వారికి మరింత తోడ్పాటు అవసరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగ క్రీడాకారుల కోసం చాలా చేయాల్సి ఉంది’ అని 31 ఏళ్ల జజరియా కోరాడు. అవార్డు గ్రహీతలు ఖేల్‌రత్న: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్ఎస్వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ). -
ఖేల్ రత్నకు ఇద్దరి పేర్లు సిఫారుసు!
ఢిల్లీ: మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సిఫారుసు చేశారు. సర్దార్ తో పాటు పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. ఈ మేరకు గురువారం అవార్డుల సెలక్షన్ కమిటీ పలువురు ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసింది. ఇందులో ఇద్దరి పేర్లను ఖేల్ రత్నకు సిఫారుసు చేయగా, మరో 17 మందిని అర్జున అవార్డుల జాబితాలో చోటు కల్పించారు. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ లు ఉన్నారు. -
సర్దార్ సింగ్‌పై పోలీసుల విచారణ
♦ భారత హాకీ జట్టుకు ముందస్తు సమాచారం ఇవ్వని ఇంగ్లండ్ పోలీసులు లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఇంగ్లండ్ పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌పై గతేడాది నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా యార్క్‌షైర్ పోలీసులు అతడిని విచారణకు రావాలని ఆదేశించారు. అయితే టోర్నీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు ఇలాంటి చర్యకు దిగడం టీమ్ మేనేజ్మెంట్ను ఇబ్బందికి గురి చేసింది. ఇంగ్లండ్‌లో నివసించే భారత సంతతి హాకీ క్రీడాకారిణి, అతడి మాజీ ప్రియురాలు ఆశ్పాల్ భోగల్.. సర్దార్ సింగ్‌పై కేసు వేసింది. తనపై భారత్, ఇంగ్లండ్‌లో సర్దార్ సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ‘జట్టంతా లండన్‌లో ఉన్న సమయంలో సర్దార్‌ను విచారణ కోసం లీడ్స్‌కు రమ్మన్నారు. ఇది కొత్త కేసా? పాతదేనా? అనే విషయం కూడా మాకు తెలీదు. సర్దార్ దొంగచాటుగా ఇక్కడ ఉండటం లేదు. మంగళవారం నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్ ఉన్న తరుణంలో దాదాపు 12 గంటల ప్రయాణం దూరంలో ఉన్న నగరానికి పిలిపించడం ఏమిటి?’ అని జట్టు అధికారి ఒకరు ప్రశ్నించారు. అక్రమార్కులకు నిలయం... మరోవైపు భారత్‌లో అక్రమాలు చేసిన వారంతా తెలివిగా ఇంగ్లండ్‌కు వెళ్లి నివసిస్తుంటారని, ఆ దేశం అలాంటి వారిని చక్కగా ఆదరిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు నరీందర్ బాత్రా విమర్శించారు. ‘ఒకవేళ ఇంగ్లండ్ ఆటగాడిని భారత్‌లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు ప్రపంచ మీడియా స్పందన ఏమిటో చూడాలనుంది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంగ్లండ్‌లోని భారత హైకమిషన్ జోక్యం చేసుకునేలా భారత మీడియా ప్రయత్నించాలి’ అని హాకీ ఇండియా మాజీ అధ్యక్షుడైన బాత్రా విజ్ఞప్తి చేశారు. నేడు నెదర్లాండ్స్‌తో పోరు... వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన భారత హాకీ జట్టు నేడు (మంగళవారం) నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. స్కాట్లాండ్, కెనడా, పాక్ జట్లను చిత్తుగా ఓడిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు తమకన్నా మెరుగైన ప్రపంచ నాలుగో ర్యాంకర్ జట్టుపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. నెదర్లాండ్స్ కూడా పాక్, స్కాట్లాండ్పై నెగ్గింది. -
మళ్లీ కెప్టెన్సీ ఇస్తే..
న్యూఢిల్లీ:మరోసారి భారత పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తే ఆ పదవిని అత్యంత సంతోషంగా స్వీకరిస్తానని అంటున్నాడు మాజీ సారథి సర్ధార్ సింగ్. రియో ఒలింపిక్స్ ముందు వరకూ దాదాపు నాలుగు సంవత్సరాలు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తనకు దక్కిన అరుదైన గౌరవమన్నాడు. మరొకసారి టీమిండియా పగ్గాలు అప్పజెప్పితే సంతోషంగా స్వీకరిస్తానని మనసులో మాటను వెల్లడించాడు. జట్టు పగ్గాలను కోల్పోవడం కాస్త నిరాశ కల్గించినా, దేశానికి ఆడటం అంతకన్నాముఖ్యమన్నాడు. ఇటీవల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలపై సర్దార్ స్పందించాడు. జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి రావడం ఒక భాగమని, అదే క్రమంలో తనపై కూడా అనేక రూమర్లు వచ్చాయన్నాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓడించి టైటిల్ సాధించడంపై సర్దార్ హర్షం వ్యక్తం చేశాడు. ఏ టోర్నమెంట్‌లోనైనా పాకిస్తాన్ పోరు అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అని పేర్కొన్నాడు. లీగ్‌ల్లో పాకిస్తాన్ ఓడించిన భారత జట్టు.. అదే ఫైనల్లో కూడా పునరావృతం చేసి ఆ ట్రోఫీని మన జవాన్లకు అంకితమిచ్చిందన్నాడు. తాను ఎప్పుడూ ఫామ్‌ను పరీక్షించుకుంటూ ముందుకు వెళుతుంటానని, అదే సమయంలో యువకు ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉందన్నాడు. మరొకసారి కెప్టెన్ గా పగ్గాలు తనకు ఇచ్చినట్లైతే అత్యంత సంతోషంగా ఆ పదవిని స్వీకరిస్తానని సర్దార్ తెలిపాడు. -
పాకిస్థాన్‌తో ఓటమిని ఎప్పడూ ఊహించం
న్యూఢిల్లీ: ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్మమెంట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించడం చాలా ప్రత్యేకమైనదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాడు సర్ధార్ సింగ్ అన్నాడు. పాక్‌తో ఎప్పుడు ఆడినా చావోబతుకో లాంటి పరిస్థితి ఉంటుందని, ఒత్తిడి అధిగమించడం గురించి జూనియర్ ఆటగాళ్లకు చెప్పామని తెలిపాడు. పాకిస్థాన్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో కూడా ఓడిపోవాలని భావించమని చెప్పాడు. క్వాంటాన్ (మలేసియా)లో జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో పాక్‌ను మట్టికరిపించి ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. భారత జట్టు మంగళవారం ఢిల్లీకి వచ్చింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలవడమిది రెండోసారి. తాజా టోర్నీలో భారత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో పాక్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లోనూ పాక్‌కు షాకిచ్చింది. -
సర్దార్ సింగ్‌కు ఊరట
న్యూఢిల్లీ: మాజీ ప్రేమికురాలిపై అత్యాచారం కేసులో హాకీ ఆటగాడు సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విచారణ కోసం సిటీ ట్రయల్ కోర్టు ఆదేశించిందని, దీనిపై స్టే విధించాలని సర్దార్ హైకోర్టును ఆశ్రయించాడు. సర్దార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ అండర్-19 హాకీ పేయ్లర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించగా హైకోర్టు స్టే విధిస్తూ జనవరి 6లోగా ఈ విషయంపై సమాధానమివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులిచ్చింది. -
కెప్టెన్‌గా సర్దార్ సింగ్ ఎంపిక
ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నీ న్యూఢిల్లీ: భారత హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్ పునరాగమనంతో పాటు మరోసారి జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈనెల 27 నుంచి స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగే ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీకి విశ్రాంతి తీసుకున్న సర్దార్ సింగ్ తిరిగి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్, బీరేందర్ లక్రా రీఎంట్రీ ఇచ్చారు. అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్పెయిన్ జట్లు తలపడే ఈ టోర్నీలో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. దీంతో వీఆర్ రఘునాథ్, కొతజిత్ సింగ్, లక్రా, రూపిందర్ పాల్‌లతో డిఫెన్స్ పటిష్టంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ మాదిరిగానే ఇందులోనూ అద్భుతంగా రాణించేందుకు కృషి చేస్తామని సర్దార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
'సర్దార్ పై రేప్ కేసు నమోదు చేయాలి'
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ పై రేప్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా సంఘం(డీసీబ్ల్యూ) డిమాండ్ చేసింది. సర్దార్ సింగ్ కు అనుకూలంగా పంజాబ్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అతడిపై పంజాబ్, ఢిల్లీలో కేసులు పెట్టినా పట్టించుకోడం లేదని తెలిపింది. దీనిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హాకీ ఇండియాకు నోటీసు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సర్దార్ సింగ్ చిరకాల స్నేహితురాలు ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టామని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీని గురించి సర్దార్ సింగ్ ను అడగ్గా... 'ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేసింది. నేను ఎవరినీ నియంత్రించలేను. ఎవరి ఆలోచనలను మార్చలేదు. దీనిపై కామెంట్ చేయను. పంజాబ్ పోలీసులు ఆమె ఫిర్యాదును తోసిపుచ్చారు. నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఒలింపిక్స్ గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నా'ని సమాధానం ఇచ్చాడు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు హాకీ ఇండియా చైర్మన్ నరేంద్ర బాత్రా నిరాకరించారు. తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చాక మాట్లాడతానని చెప్పారు. 2014, అక్టోబర్ లో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో తనపై సర్దార్ సింగ్ అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. హోటల్ పైనుంచి తోసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. 2012లో సోషల్ మీడియాతో సింగ్ పరిచయం అయ్యాడని.. 2014, ఫిబ్రవరిలో తమద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని చెప్పింది. 2015, మేలో తనకు అబార్షన్ చేయించాడని వెల్లడించింది. దీనిపై ఈ ఏడాది జనవరి 31న పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. -
భారత కెప్టెన్ అత్యాచారయత్నం చేయలేదు..
లుధియానా: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) స్పష్టం చేసింది. సర్దార్ పై చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని లూధియానా కమిషనర్ జేఎస్ ఔలక్ తెలిపారు. ఆ యువతితో సర్దార్ ఓ రాత్రి గడిపాడంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. మహిళా ప్లేయర్ భైనీ సాహిబ్ లో ఓ రాత్రి అతడిని కలవడానికి వెళ్లగా తనపై హత్యాచారయత్నం చేశాడని లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ పూర్తయిందని ఆ వివరాలను ఆయన వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే భారత కెప్టెన్ పై ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నిజం లేదని వివరించారు. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి గతంలో వెల్లడించింది. కొన్ని నెలల కిందట భారత్ కు వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని గత ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'భారత హాకీ కెప్టెన్ సర్దార్ తనను బ్లాక్ మెయిల్ చేశాడు.. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అంటూ చాలా ఆరోపణలు చేసింది. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా అప్పటి పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. ఆ యువతితో తనకు పరిచయం ఉందని, ఆమె పేర్కొన్న వాటిలో వాస్తవాలు లేవని మొదటి నుంచి సర్దార్ చెబుతూనే ఉన్నాడు. మరోవైపు సర్దార్ పై ఫిర్యాదు చేసిన అనంతరం తనకేం పట్టనట్లుగా ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోవడం అప్పట్లో అనుమానాలకు దారితీసింది. -
భారత్ శుభారంభం
► జపాన్‌పై 2-1తో గెలుపు ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): మాజీ చాంపియన్ భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఒకదశలో 0-1తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత తేరుకొని ఎనిమిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన జపాన్ నుంచి ఆద్యంతం భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆట 17వ నిమిషంలో కెంజి కిటాజాటో గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌నే జపాన్ గోల్‌గా మలచడం విశేషం. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. 24వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కుడి వైపునకు డ్రాగ్ ఫ్లిక్ చేసి హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మొదటి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత ఆట 32వ నిమిషంలో జస్జీత్ సింగ్ అందించిన పాస్‌ను అందుకున్న సర్దార్ సింగ్ రివర్స్ షాట్‌తో జపాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగిసేలోపు భారత్‌కు మరిన్ని గోల్స్ చేసే అవకాశాలు లభించినా ఫలితం లేకపోయింది. సహచర ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందింది. దాంతో మన్‌ప్రీత్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
సర్దార్కే సారథ్యం
అజ్లాన్ షా హాకీ టోర్నీకి భారత జట్టు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఏప్రిల్ 6 నుంచి 16 వరకు మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. సర్దార్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అజ్లాన్ షా కప్‌లో భారత్‌తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి. -
'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు'
చండీగఢ్: తనతో నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి చేసిన ఆరోపణలను భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ ఖండించాడు. తనకు బ్రిటన్ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదని సర్దార్ స్పష్టం చేశాడు. కాగా ఆ అమ్మాయి తనకు తెలియదని చెప్పలేదు. 'ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదును చూడాలి. ఆ తర్వాత సమాధానమిస్తా. నిన్న గేమ్ ఆడి వస్తున్నా. తర్వాతి జరిగే గేమ్‌పై దృష్టిసారించాలి' అని చండీగఢ్ విమానాశ్రయంలో సర్దార్ చెప్పాడు. సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని బ్రిటన్‌కు చెందిన అమ్మాయి లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. సర్దార్ తండ్రి గుర్నం సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆ అమ్మాయి తెలుసునని, అయితే నిశ్చితార్థం జరగలేదని చెప్పాడు. -
భారత హాకీ కెప్టెన్‌పై అత్యాచారయత్నం కేసు
లుధియానా: భారత హాకీ సంఘంలో ఎప్పటి నుంచో వివాదాలు ఉండగా, తాజాగా భారత హాకీ జట్టు కెప్టెన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు ఆరోపించింది. లుధియానా పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి వెల్లడించింది. ఇటీవల భారత్ వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. కాగా సర్దార్ సింగ్‌పై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. 2012 నుంచి భారత హాకీ జట్టుకు సర్దార్ నాయకత్వం వహిస్తున్నాడు. హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్నాడు. ఇక సర్దార్‌పై ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా వీరిద్దరికీ పరిచయమైనట్టు ఆమె చెప్పింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. గతంలో సర్దార్ స్వగ్రామంలోని అతని ఇంటికి కూడా వెళ్లినట్టు చెప్పింది. 'నాలుగేళ్లుగా మా మధ్య అనుబంధముంది. మేం ప్రేమించుకున్నాం. నేను అతనికి కాబోయే భార్యను. అయితే నాకు నమ్మకద్రోహం చేశాడు. ఇది నా హృదయాన్ని గాయపరిచింది. ఇప్పటికే మా పెళ్లి జరగాల్సింది. మూణ్నెళ్లుగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు అతను సమాధానం ఇవ్వడం లేదు. సర్దార్ మోసగాడు. అతని వయసు, కులం గురించి తప్పు చెప్పాడు. అంతేగాక నన్ను బెదిరించాడు. అతని జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. అతనిపై ఫిర్యాదు చేశా. కోర్టులో పోరాడుతా' అని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోయింది. -
సర్దార్ సింగ్‌కే పగ్గాలు
హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీకి భారత జట్టు ప్రకటన బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. 18 మంది సభ్యులుగల ఈ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది. భారత హాకీ జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (వైస్ కెప్టెన్), హర్జోత్ సింగ్, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, రఘునాథ్, జస్జీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, తల్వీందర్ సింగ్. -
ఆకాశ్‌దీప్‌కు రూ.55 లక్షలు
సర్దార్ సింగ్‌కు నిరాశ హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం న్యూఢిల్లీ : హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్ల వేలంలో యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్‌కు భారీ ధర పలికింది. అయితే భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యపరిచింది. వచ్చే సీజన్ కోసం శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఆకాశ్‌దీప్‌ను ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 84 వేల డాలర్ల (రూ.55,56,247)కు కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆకాశ్‌కే దక్కింది. ఆ తర్వాత స్థానంలో 81 వేల డాలర్ల(రూ.53,57,578) ధరతో సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ సందీప్ సింగ్ (రాంచీ రేస్), గుర్మైల్ సింగ్ (దబాంగ్ ముంబై) నిలిచారు. మరోవైపు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈ ఏడాది వదులుకున్న సర్దార్ సింగ్‌ను 58 వేల డాలర్ల (రూ. 38,36,290) తక్కువ మొత్తంతో పంజాబ్ వారి యర్స్ తీసుకుంది. ఓవరాల్‌గా జర్మనీ స్టార్ ఆటగాడు మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే టాప్‌లో నిలిచాడు. కళింగ లాన్సర్స్ ఈ ఆటగాడిని లక్షా 5 వేల డాలర్ల (రూ.69,46,289)కు తీసుకుంది. -
భారత్‌దే హాకీ సిరీస్
స్పెయిన్‌పై ఆఖరి మ్యాచ్‌లో విజయం టెరాసా (స్పెయిన్): స్పెయిన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత హాకీ జట్టు 2-1తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన సర్దార్ సింగ్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సత్తా చాటింది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత జట్టు 4-2తో గెలిచింది. మ్యాచ్ 24వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్ భారత్‌కు ఆధిక్యం అందించాడు. అయితే తర్వాతి నిమిషంలోనే స్పెయిన్ తరఫున జేవియర్ గోల్ చేశాడు. అనంతరం 45వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్‌తో జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న స్పెయిన్ 49వ నిమిషంలో జేవియర్ చేసిన మరో గోల్‌తో స్కోరును సమం చేసుకుంది. అయితే భారత ఫార్వర్డ్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ 50, 51వ నిమిషాల్లో పటిష్ట స్పానిష్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెరుపు వేగంతో రెండు గోల్స్ అందించడంతో జట్టు చక్కటి విజయాన్ని సాధించింది. -
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మూడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన భారత పురుషుల జట్టు వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో సర్దార్ సింగ్ బృందం 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు మలేసియాతో ఆడనుంది. బీరేందర్ లక్రా (34వ ని.), రమణ్‌దీప్ సింగ్ (51వ ని.) భారత్‌కు గోల్స్ అందించారు. అటు సర్దార్ సింగ్ సేన డిఫెండర్ల వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ ఆసీస్ ఎనిమిదో నిమిషంలో అరన్ జలేస్కి, తొమ్మిదో నిమిషంలో జేమీ డ్వేయర్ గోల్స్‌తో షాకిచ్చింది. ఆ తర్వాత సిరియెల్లో (26,33,44వ నిమిషాల్లో), కీరన్ గోవర్స్( 43వ ని.) గోల్స్ చేయడంతో ఆసీస్‌కు భారీ విజయం దక్కింది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత జట్టు మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది.