భారత కెప్టెన్ అత్యాచారయత్నం చేయలేదు..
లుధియానా: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) స్పష్టం చేసింది. సర్దార్ పై చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని లూధియానా కమిషనర్ జేఎస్ ఔలక్ తెలిపారు. ఆ యువతితో సర్దార్ ఓ రాత్రి గడిపాడంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్లో హాకీ క్రీడాకారిణి. మహిళా ప్లేయర్ భైనీ సాహిబ్ లో ఓ రాత్రి అతడిని కలవడానికి వెళ్లగా తనపై హత్యాచారయత్నం చేశాడని లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ పూర్తయిందని ఆ వివరాలను ఆయన వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే భారత కెప్టెన్ పై ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నిజం లేదని వివరించారు.
సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి గతంలో వెల్లడించింది. కొన్ని నెలల కిందట భారత్ కు వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని గత ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'భారత హాకీ కెప్టెన్ సర్దార్ తనను బ్లాక్ మెయిల్ చేశాడు.. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అంటూ చాలా ఆరోపణలు చేసింది. సర్దార్పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా అప్పటి పోలీస్ కమిషనర్ పరమ్రాజ్ సింగ్ ఆదేశించారు. ఆ యువతితో తనకు పరిచయం ఉందని, ఆమె పేర్కొన్న వాటిలో వాస్తవాలు లేవని మొదటి నుంచి సర్దార్ చెబుతూనే ఉన్నాడు. మరోవైపు సర్దార్ పై ఫిర్యాదు చేసిన అనంతరం తనకేం పట్టనట్లుగా ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోవడం అప్పట్లో అనుమానాలకు దారితీసింది.