India hockey captain
-
హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ..
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన రాకేష్ కాత్యాల్, బోలా నాథ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా టిర్కీ గెలుపొందాడు. కాగా హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఎంపిక ఏకగ్రీవం కావడంతో వారం రోజుల ముందే నిర్వహకులు ప్రకటించారు. అయితే జాతీయ క్రీడా నియమావళిని హాకీ ఇండియా ఉల్లంఘించిందే అని చెప్పుకోవాలి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం.. ఎన్నికల తేదికు ముందు విజేతను ప్రకటించకూడదు. కాగా హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు నిర్వాహకుల కమిటీ సభ్యలకు టిర్కీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా 44 ఏళ్ల టిర్కీ 1998 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదే విధంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీగా భోలా నాథ్ సింగ్, కోశాధికారిగా శేఖర్ జె. మనోహరన్ ఎంపికయ్యారు. చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
‘మన సైనికుల కోసం పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తాం’
బెంగళూరు: ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. మలేసియాలో వచ్చే నెల 20 నుంచి 30 జరగనున్న టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే శ్రీజేష్ పలు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ హాకీ టీమ్ చేతిలో ఓడిపోయి భారత సైనికులను నిరాశ పరచాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. ‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. మేము వందశాతం కష్టపడతాం. ఓడిపోయి మన సైనికులను నిరుత్సాహపరచం. దేశ సరిహద్దులో ఎదురుకాల్పుల్లో ప్రాణాలర్పించిన సైనికుల కోసమేనా గెలుస్తామ’ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్థాన్ హాకీ జట్టు ప్రస్తుతం దిగువస్థాయి ఆటతీరు కనబరుస్తోందని, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిందని తెలిపాడు. అయితే తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించే సత్తా పాక్ టీమ్ ఉందన్నాడు. ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో మలేసియా, కొరియా జట్లను తక్కువగా అంచనా వేయడానికి లేదని శ్రీజేష్ పేర్కొన్నాడు. -
భారత కెప్టెన్ అత్యాచారయత్నం చేయలేదు..
లుధియానా: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) స్పష్టం చేసింది. సర్దార్ పై చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని లూధియానా కమిషనర్ జేఎస్ ఔలక్ తెలిపారు. ఆ యువతితో సర్దార్ ఓ రాత్రి గడిపాడంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. మహిళా ప్లేయర్ భైనీ సాహిబ్ లో ఓ రాత్రి అతడిని కలవడానికి వెళ్లగా తనపై హత్యాచారయత్నం చేశాడని లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ పూర్తయిందని ఆ వివరాలను ఆయన వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే భారత కెప్టెన్ పై ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నిజం లేదని వివరించారు. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి గతంలో వెల్లడించింది. కొన్ని నెలల కిందట భారత్ కు వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని గత ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'భారత హాకీ కెప్టెన్ సర్దార్ తనను బ్లాక్ మెయిల్ చేశాడు.. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అంటూ చాలా ఆరోపణలు చేసింది. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా అప్పటి పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. ఆ యువతితో తనకు పరిచయం ఉందని, ఆమె పేర్కొన్న వాటిలో వాస్తవాలు లేవని మొదటి నుంచి సర్దార్ చెబుతూనే ఉన్నాడు. మరోవైపు సర్దార్ పై ఫిర్యాదు చేసిన అనంతరం తనకేం పట్టనట్లుగా ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోవడం అప్పట్లో అనుమానాలకు దారితీసింది. -
'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు'
చండీగఢ్: తనతో నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి చేసిన ఆరోపణలను భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ ఖండించాడు. తనకు బ్రిటన్ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదని సర్దార్ స్పష్టం చేశాడు. కాగా ఆ అమ్మాయి తనకు తెలియదని చెప్పలేదు. 'ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదును చూడాలి. ఆ తర్వాత సమాధానమిస్తా. నిన్న గేమ్ ఆడి వస్తున్నా. తర్వాతి జరిగే గేమ్‌పై దృష్టిసారించాలి' అని చండీగఢ్ విమానాశ్రయంలో సర్దార్ చెప్పాడు. సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని బ్రిటన్‌కు చెందిన అమ్మాయి లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. సర్దార్ తండ్రి గుర్నం సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆ అమ్మాయి తెలుసునని, అయితే నిశ్చితార్థం జరగలేదని చెప్పాడు. -
భారత హాకీ కెప్టెన్‌పై అత్యాచారయత్నం కేసు
లుధియానా: భారత హాకీ సంఘంలో ఎప్పటి నుంచో వివాదాలు ఉండగా, తాజాగా భారత హాకీ జట్టు కెప్టెన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు ఆరోపించింది. లుధియానా పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి వెల్లడించింది. ఇటీవల భారత్ వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. కాగా సర్దార్ సింగ్‌పై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. 2012 నుంచి భారత హాకీ జట్టుకు సర్దార్ నాయకత్వం వహిస్తున్నాడు. హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్నాడు. ఇక సర్దార్‌పై ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా వీరిద్దరికీ పరిచయమైనట్టు ఆమె చెప్పింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. గతంలో సర్దార్ స్వగ్రామంలోని అతని ఇంటికి కూడా వెళ్లినట్టు చెప్పింది. 'నాలుగేళ్లుగా మా మధ్య అనుబంధముంది. మేం ప్రేమించుకున్నాం. నేను అతనికి కాబోయే భార్యను. అయితే నాకు నమ్మకద్రోహం చేశాడు. ఇది నా హృదయాన్ని గాయపరిచింది. ఇప్పటికే మా పెళ్లి జరగాల్సింది. మూణ్నెళ్లుగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు అతను సమాధానం ఇవ్వడం లేదు. సర్దార్ మోసగాడు. అతని వయసు, కులం గురించి తప్పు చెప్పాడు. అంతేగాక నన్ను బెదిరించాడు. అతని జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. అతనిపై ఫిర్యాదు చేశా. కోర్టులో పోరాడుతా' అని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోయింది.