భారత హాకీ కెప్టెన్పై అత్యాచారయత్నం కేసు
లుధియానా: భారత హాకీ సంఘంలో ఎప్పటి నుంచో వివాదాలు ఉండగా, తాజాగా భారత హాకీ జట్టు కెప్టెన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు ఆరోపించింది. లుధియానా పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది.
సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి వెల్లడించింది. ఇటీవల భారత్ వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. కాగా సర్దార్ సింగ్పై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సర్దార్పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా పోలీస్ కమిషనర్ పరమ్రాజ్ సింగ్ ఆదేశించారు.
2012 నుంచి భారత హాకీ జట్టుకు సర్దార్ నాయకత్వం వహిస్తున్నాడు. హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్నాడు. ఇక సర్దార్పై ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్లో హాకీ క్రీడాకారిణి. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా వీరిద్దరికీ పరిచయమైనట్టు ఆమె చెప్పింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. గతంలో సర్దార్ స్వగ్రామంలోని అతని ఇంటికి కూడా వెళ్లినట్టు చెప్పింది. 'నాలుగేళ్లుగా మా మధ్య అనుబంధముంది. మేం ప్రేమించుకున్నాం. నేను అతనికి కాబోయే భార్యను. అయితే నాకు నమ్మకద్రోహం చేశాడు. ఇది నా హృదయాన్ని గాయపరిచింది. ఇప్పటికే మా పెళ్లి జరగాల్సింది. మూణ్నెళ్లుగా ఫోన్ కాల్స్, మెసేజ్లకు అతను సమాధానం ఇవ్వడం లేదు. సర్దార్ మోసగాడు. అతని వయసు, కులం గురించి తప్పు చెప్పాడు. అంతేగాక నన్ను బెదిరించాడు. అతని జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. అతనిపై ఫిర్యాదు చేశా. కోర్టులో పోరాడుతా' అని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోయింది.