‘మన సైనికుల కోసం పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తాం’
బెంగళూరు: ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. మలేసియాలో వచ్చే నెల 20 నుంచి 30 జరగనున్న టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే శ్రీజేష్ పలు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ హాకీ టీమ్ చేతిలో ఓడిపోయి భారత సైనికులను నిరాశ పరచాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు.
‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. మేము వందశాతం కష్టపడతాం. ఓడిపోయి మన సైనికులను నిరుత్సాహపరచం. దేశ సరిహద్దులో ఎదురుకాల్పుల్లో ప్రాణాలర్పించిన సైనికుల కోసమేనా గెలుస్తామ’ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్థాన్ హాకీ జట్టు ప్రస్తుతం దిగువస్థాయి ఆటతీరు కనబరుస్తోందని, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిందని తెలిపాడు. అయితే తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించే సత్తా పాక్ టీమ్ ఉందన్నాడు. ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో మలేసియా, కొరియా జట్లను తక్కువగా అంచనా వేయడానికి లేదని శ్రీజేష్ పేర్కొన్నాడు.