వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల జట్టు
చైనా జట్టుపై 3–0తో ఘనవిజయం
నేడు జపాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా లీగ్‌లో అగ్రస్థానం ఖరారు
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
మూడో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి.
ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి.
లీగ్‌లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది.
మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment