
ఐదోసారి ఆసియా కబడ్డీ టైటిల్ నెగ్గిన భారత మహిళల జట్టు
టెహ్రాన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్‌లో జరిగిన మహిళల ఆసియా కబడ్డీ ఆరో చాంపియన్‌షిప్‌లో టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ జైత్రయాత్ర కొనసాగించి ఐదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది.
టైటిల్ పోరులో భారత జట్టు 32–25 పాయింట్లతో తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 56–18 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై ఘనవిజయం అందుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో టీమిండియా 64–23 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై, రెండో మ్యాచ్‌లో 76–21 పాయింట్లతో థాయ్‌లాండ్ జట్టుపై, మూడో మ్యాచ్‌లో 73–19 పాయింట్లతో మలేసియా జట్టుపై గెలుపొందాయి.
మొత్తం ఏడు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లు... గ్రూప్ ‘బి’లో ఇరాన్, ఇరాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లోని నాలుగో జట్టు చైనీస్ తైపీ జట్టు చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో రాణించిన భారత జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్‌కప్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన భారత జట్టుకు సోనాలి విష్ణు షింగేట్ కెపె్టన్‌గా, పుష్ప రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వేస్ తరఫున ఆడిన సోనాలి గోల్డెన్ రెయిడ్‌తో తన జట్టును విజేతగా నిలిపింది. పూజా కజిలా, నిధి శర్మ, పూజా నర్వాల్, ఆమ్రపాలి గలాండె, నేహా దక్ష్ , సంజూ దేవి, జ్యోతి ఠాకూర్, సాక్షి శర్మ, భావన దేవి, రీతూ మిగతా సభ్యులుగా ఉన్నారు.
2005లో హైదరాబాద్‌లో తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించగా... భారత జట్టు విజేతగా అవతరించింది. అనంతరం 2007లో టహ్రాన్ (ఇరాన్)లో జరిగిన రెండో ఆసియా చాంపియన్‌షిప్‌లో, 2008లో మదురై (భారత్)లో జరిగిన మూడో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 2008 తర్వాత ఎనిమిదేళ్లకు మళ్లీ ఆసియా చాంపియన్‌షిప్ జరిగింది.
2016లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన నాలుగో ఆసియా చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. 2017లో గొర్గాన్ (ఇరాన్)లో జరిగిన ఐదో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా> నిలిచింది. 2017 తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment