Indian womens team
-
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
ఒకటే లక్ష్యం... రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ సై
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు! ఆ ఇద్దరిని కట్టడి చేస్తే... తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి. మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.పిచ్, వాతావరణం భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు. -
భారత్ ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ ఖోఖో తొలి ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. మహిళల విభాగంతోపాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా అవతరించింది. తొలుత జరిగిన మహిళల ఫైనల్లో భారత జట్టు 78–40 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టును ఓడించగా... పురుషుల ఫైనల్లో టీమిండియా 54–36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపైనే విజయం సాధించింది. భారత జట్టుకు చెందిన ప్రియాంక, ప్రతీక్ ‘బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. -
సిరీస్ విజయంపై గురి
రాజ్‌కోట్: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్ హసబ్నిస్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టిటాస్ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్ అదే జోష్‌లో సిరీస్ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. -
భారత్ 11 మాల్దీవులు 1
బెంగళూరు: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక మ్యాచ్‌లో మరోసారి భారత మహిళల జట్టు అదరగొట్టింది. తొలి పోరులో 14–0తో మాల్దీవులును చిత్తు చేసిన భారత్... గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11–1 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ ద్వారానే జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఫార్వర్డ్ ప్లేయర్ లింగ్డైకిమ్ (12వ, 16వ, 56వ, 59వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించింది. సిమ్రన్ గురుంగ్ (62వ, 68వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటింది. మరో అరంగేట్ర ప్లేయర్ సిబాని దేవి (45+1వ నిమిషంలో)తో పాటు కాజల్ డిసౌజా (15వ ని.లో), పూజ (41వ ని.లో), భూమిక దేవి (71వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మాల్దీవుల తరఫున మరియం రిఫా (27వ ని.లో) ఏకైక గోల్ సాధించగా... ఆ జట్టు కెప్టెన్ హనీఫా (17వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 6–1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... ద్వితీయార్ధంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తిరుగులేని విజయం సాధించింది. -
క్లీన్‌స్వీప్ ఖాయమేనా!
వడోదర: అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆఖరి పోరుకు సిద్ధమైంది. అచ్చొచ్చిన వడోదర పిచ్‌పై నేడు జరిగే మూడో వన్డేలో వెస్టిండీస్‌ను ‘ఢీ’కొట్టేందుకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ బృందం ఉన్న ప్రస్తుత ఫామ్ దృష్ట్యా 3–0తో సిరీస్‌ను ముగించడం ఏమంత కష్టం కానేకాదు. 217/4, 314/9, 358/5... ఆఖరి టి20 సహా, గత రెండు వన్డేల స్కోర్లివి. దుర్బేధ్యమైన టాపార్డర్ బ్యాటింగ్ లైనప్, నిప్పులు చెరుగుతున్న బౌలింగ్ కరీబియన్‌కు కష్టాలనే మిగిలిస్తున్నాయి. మరోవైపు రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లను సమర్పించుకున్న వెస్టిండీస్ ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. పర్యటనలో ఆఖరి పోరులో గెలిచి స్వదేశానికి విజయంతో పయనం కావాలని భావిస్తోంది. కానీ ఇదంతా సులభం కాదు. స్మృతిని ఆపేదెవరు? భారత ఓపెనర్ స్మృతి మంధాన జోరే జట్టుకు కొండంత బలంగా మారింది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 54, 62, 77, 91, 53... అర్ధసెంచరీలను అవలీలగా బాదేసింది. అసాధారణ ఫామ్‌లో ఉన్న స్మృతికి ఇప్పుడు టాపార్డర్‌లో ప్రతీక రావల్, హర్లీన్ డియోల్ జతవ్వడంతో విండీస్ బౌలింగ్ అదేపనిగా కుదేలవుతోంది. వీళ్లకు అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలియక కరీబియన్ జట్టు సతమతమవుతోంది. అలాగని జెమీమా రోడ్రిగ్స్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌లు ఉన్న మిడిలార్డర్ తక్కువేం కాదు. ‘టాప్’ శుభారంభాల్ని భారీస్కోర్లుగా మలిచేయడంలో మిడిలార్డర్ పాత్ర చాలావుంది. ఇక బౌలింగ్ దళం కరీబియన్ల పాలిట సింహస్వప్నమవుతోంది. పేస్‌లో రేణుక, దీప్తిశర్మ, స్పిన్‌లో ప్రియా మిశ్రా నిలకడగా విండీస్ బ్యాటర్లకు ముందరికాళ్లకు ముందే బంధమేస్తున్నారు. ఇలాంటి ఆతిథ్య జట్టుకు చివరి వన్డేలో గెలుపు సాధ్యమే! కష్టాల్లో కరీబియన్ టీమ్ భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ మహిళల జట్టుకు వరుసగా తీవ్ర నిరాశ ఎదురవుతూనే ఉంది. టి20 సిరీస్‌లో ఒక మ్యాచ్ అయినా నెగ్గింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఆ ఫలితం కోసం పెద్ద పోరాటం చేసినా కూడా... ప్రస్తుత పరిస్థితుల్లో ఓదార్పు కష్టంగానే కనబడుతోంది. తొలివన్డేలో అయితే ఘోరంగా కుప్పకూలిన విండీస్ సేన గత మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లను కాస్త ఢీకొట్టగలిగింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్, షెమైన్ క్యాంప్‌బెల్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్ నిలకడను ప్రదర్శించారు. అయితే ప్రత్యర్థి 300 పైచిలుకు చేసే స్కోర్లను కట్టడి చేసే బౌలర్లయితే లేరు. రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే కాస్తో... కూస్తో... ప్రభావం చూపిన బౌలర్ దాదాపు లేదనే చెప్పొచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న హేలీ మాథ్యూస్ సేన 0–3ని తప్పించుకొని 1–2తో ముగించడం పెద్ద సవాలే! తుది జట్లు (అంచనా) భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, టిటాస్ సాధు, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్. వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), క్వియాన, నెరిస్సా క్రాఫ్టన్, రషద విలియమ్స్, డియాండ్రా, షెమైన్, ఆలియా, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కరిష్మా, షమీలియా కానెల్. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
సిరీస్‌లో నిలిచేందుకు...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత మహిళల జట్టు సిరీస్‌ను కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ లోపాలను అధిగమించి పటిష్టమైన ఆసీస్‌తో ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు కనీసం 35 ఓవర్లయినా ఆడలేక 100 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (8), ప్రియా పూనియా (3) ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ (19) వైఫల్యం బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావమే చూపింది. ఓవరాల్‌గా 11 మంది బ్యాటింగ్‌కు దిగితే ఒక్క జెమీమా రోడ్రిగ్స్ (23) మాత్రమే ఇరవై పైచిలుకు స్కోరు చేయగలిగింది. అనుభవజు్ఞరాలైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఆసీస్ బౌలింగ్‌కు చేతులెత్తేసింది. ఇప్పుడు రెండో వన్డేలో ఈ పేలవ ఆటతీరు కొనసాగిస్తే మాత్రం పెర్త్‌కు ముందే ఇక్కడే సిరీస్‌ను ప్రత్యర్థి జట్టుకి సమరి్పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో అందరు సమష్టి బాధ్యత తీసుకోవాలి. క్రీజులో నిలబడి పరుగులు రాబడితే బౌలర్లకు మ్యాచ్ గెలిపించేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కానీ వారి సొంతగడ్డపై వందకో... 150 పరుగులకో కుప్పకూలితే ఆసీస్ చకచకా ఛేదించడం ఖాయం. ఆసీస్ స్పీడ్‌స్టర్ మేగన్ షట్ (5/19)ను ఎదుర్కోవడంపై భారత బ్యాటర్లు కసరత్తు చేయాలి. బౌలర్లలో రేణుక, ప్రియా మిశ్రా ఆకట్టుకున్నారు. బౌలింగ్ దళంతో ఏ ఇబ్బంది లేకపోయినా కీలకమైన రెండో వన్డేలో అన్ని విభాగాలు సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లోనూ ఆసీస్ బలంగా కనిపిస్తోంది. ఎలైస్ పెరీ, లిచ్‌ఫీల్డ్, బెత్‌మూనీ, సదర్లాండ్, గార్డ్నర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. -
Ind Vs Aus ODI: ఈసారైనా...!.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ్రస్టేలియాలో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మరో అవకాశం లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య ఈరోజు తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహాలు ఈ సిరీస్ నుంచే భారత్ మొదలుపెట్టనుంది. బ్రిస్బేన్: ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుండగా... మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో జట్టు బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య 16 వన్డేలు జరగగా... అందులో భారత జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2021లో చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన మన జట్టు 1–2తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత జట్టు శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. 2025లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నామరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తహిలా మెక్‌గ్రాత్ జట్టుకు సారథ్యం వహించనుంది. ‘భారత జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. స్వదేశంలో ఆడుతుండటంతో మాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా. ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తా’ అని తహిలా పేర్కొంది.రాధ యాదవ్‌పై భారీ అంచనాలుఇటీవల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హర్మన్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు ఎక్కువైనా... మేనేజ్మెంట్ ఆమె సారథ్యంపై నమ్మకముంచింది. మరి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హర్మన్ తన సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న రాధ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఆసీస్ జట్టులో స్టార్లకు కొదవలేకపోగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆటకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.షఫాలీ వర్మ చాలా ముఖ్యమైన ప్లేయర్. జాతీయ జట్టు తరఫున షఫాలీ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తుందని నమ్మకముంది. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించాలనే తపనతోనే మైదానంలో అడుగు పెడతాం. వన్డేల్లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. దాన్నే ఇక్కడ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పుపై కసరత్తు చేస్తాం. స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించాం. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటి కోసం సిద్ధంగా ఉన్నాం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ 10 భారత్, ఆ్రస్టేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 53 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.9 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. తొమ్మిది సిరీస్‌లలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు నాలుగు వన్డే సిరీస్‌లు ఆడి నాలుగింటిలోనూ ఓటమి పాలైంది. -
సిరీస్‌పై భారత మహిళల గురి
అహ్మదాబాద్: భారత మహిళల జట్టు సిరీస్ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ను కంగు తినిపించిన భారత్ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్ ఈ మ్యాచ్‌లో పుంజుకొని సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. స్మృతి రాణిస్తేనే... గత మ్యాచ్‌లో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్‌లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తేజల్ హసబి్నస్ మిడిలార్డర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్మన్ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. కివీస్‌కు మరో దెబ్బ సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌కు అమెలియా కెర్ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్‌లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్ కెర్, మోలి ఫెన్ఫోల్డ్, ఎడెన్ కార్సన్, లీ తహుహు. -
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
బ్యాటింగ్‌లో సత్తా చాటితేనే...
దుబాయ్: అంతర్జాతీయ మహిళల టి20ల్లో శ్రీలంకపై భారత విజయాల రికార్డు 19–5తో ఎంతో ఘనంగా ఉంది. అయితే ఈ ఐదు పరాజయాల్లో చివరిది ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో వచ్చి0ది. అప్పటి వరకు అద్భుత ఫామ్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. కాబట్టి శ్రీలంకే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ వరల్డ్ కప్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవడం కూడా భారత్‌కు ముఖ్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు శ్రీలంక వరుసగా పాకిస్తాన్, ఆ్రస్టేలియాల చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో ఓడితే లంక నిష్క్రమణ ఖాయమవుతుంది. హర్మన్ సిద్ధం... కివీస్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–5 స్మృతి, షఫాలీ, హర్మన్, జెమీమా, రిచా విఫలం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. దాని నుంచి కోలుకొని పాక్‌ను ఓడించినా... ఇక్కడా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. బౌలర్ల ప్రదర్శనతో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు 18.5 ఓవర్లు తీసుకోవడంతో రన్‌రేట్ కూడా పెంచుకునే అవకాశం లేకపోయింది. ఇలాంటి స్థితిలో లంకపై బ్యాటర్లు చెలరేగి భారీ స్కోరు సాధిస్తేనే జట్టుకు మేలు కలుగుతుంది. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన స్మృతికి లంకపై కూడా పేలవ రికార్డు ఉంది. మెడ నొప్పితో పాక్‌తో మ్యాచ్‌లో చివరి క్షణాల్లో నిష్క్రమించిన కెపె్టన్ హర్మన్ కోలుకొని ఈ పోరుకు అందుబాటులోకి రావడం టీమ్‌కు సానుకూలాంశం. షఫాలీ దూకుడుగా ఆడి శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పాక్‌తో ఆడిన టీమ్‌నే ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. పేసర్ పూజ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ సజనకు చోటు ఖాయం. అటపట్టు ఆడితేనే... వరుసగా రెండు ఓటముల తర్వాత శ్రీలంక పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కెపె్టన్, స్టార్ ప్లేయర్ చమరి అటపట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓపెనర్‌గా విఫలం కావడంతో దాని ప్రభావం టీమ్‌పై కూడా పడింది. ఆ్రస్టేలియాతో పోరులో 93 పరుగులకే పరిమితం అయిన లంక... అంతకుముందు తమకంటే బలహీన జట్టు అయిన పాకిస్తాన్‌తో కూడా పేలవంగా ఆడి 85 పరుగులే చేయగలిగింది. రెండు మ్యాచ్‌లలో కూడా ఒక్క బ్యాటర్ కనీసం 30 పరుగుల స్కోరు చేయలేదు. బౌలింగ్‌లో అనుభవరాహిత్యం కూడా లంకను బలహీనంగా మార్చింది. ఇలాంటి టీమ్ భారత్‌కు పోటీనివ్వగలదా లేక ఆసియా కప్ ఫైనల్ స్ఫూర్తితో మళ్లీ ఇబ్బంది పెట్టగలదా అనేది చూడాలి. -
64 ఏళ్ల తర్వాత...
అస్తానా (కజకిస్తాన్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్íÙప్లో పెను సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గత ఏడాది రన్నరప్ దక్షిణ కొరియా జట్టును భారత బృందం బోల్తా కొట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–2తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘డబుల్స్ స్పెషలిస్ట్’ ఐహిక ముఖర్జీ రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ బెర్త్ పొందిన భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖరారైంది. భారత మహిళల జట్టు ఏకైకసారి 1960లో ముంబై ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 64 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. ఆసియా టీటీ సమాఖ్య ఆధ్వర్యంలో 1952 నుంచి 1970 వరకు ఆసియా చాంపియన్‌షిప్ జరగ్గా... 1972 నుంచి కొత్తగా ఏర్పడిన ఆసియా టీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇద్దరు మేటి ర్యాంకర్లపై గెలిచి... ప్రపంచ 8వ ర్యాంకర్ షిన్ యుబిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ ఐహిక 11–9, 7–11, 12–10, 7–11, 11–7తో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ మనిక బత్రా 12–14, 13–11, 11–5, 5–11, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీను ఓడించి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ 6–11, 10–12, 8–11తో ప్రపంచ 49వ ర్యాంకర్ లీ యున్‌హై చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 4–11, 11–6, 11–7, 10–12తో షిన్ యుబిన్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 12–10, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్‌కప్‌లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్‌లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్‌ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్‌కప్‌లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్‌లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్‌డౌన్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్‌ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
బంగారం... మన చదరంగం
బుడాపెస్ట్: ప్రపంచ చదరంగ సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైతే చెస్ ఒలింపియాడ్‌లో బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని భారత క్రీడాకారులు దర్జాగా పూర్తి చేశారు. ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తులు వేశారు. తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరసి ఇన్నాళ్లూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి. » ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి. » గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి. » వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. » చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా... భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. » పురుషుల 11వ రౌండ్ గేముల్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెల్పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్ డెమ్చెంకోపై నెగ్గగా... మాతెజ్ సబెనిక్తో జరిగిన గేమ్‌ను విదిత్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. » మహిళల 11వ రౌండ్ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్ బలజయేవాపై గెలుపొందగా... ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. » గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా... భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.కల నిజమైంది చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రస్థానం 13 ఏళ్ల వయస్సులో 2004లో మొదలైంది. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు నా స్వర్ణ స్వప్నం సాకారం అయింది. స్వదేశంలో 2022లో జరిగిన ఒలింపియాడ్‌లో పసిడి పతకం సాధించే అవకాశాలున్నా ఆఖర్లో తడబడి చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాం. కానీ ఈసారి ఆఖరి రౌండ్లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడి ‘బంగారు’ కలను నిజం చేసుకున్నాం. ఈసారి ఒలింపియాడ్‌కు నేను ప్రత్యేక సన్నాహాలు చేయకుండానే బరిలోకి దిగాను. ఈ మెగా టోర్నీలో నా అపార అనుభవం ఉపయోగపడింది. నాతోపాటు దివ్య, వంతిక, వైశాలి, తానియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాం. పటిష్ట జట్లతో ఆడి పోరాడి గెలిచాం. ఈ స్వర్ణ పతకానికి మేమందరం అర్హులం. –‘సాక్షి’తో హారిక -
భారత జట్ల దూకుడు
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్లు వరుసగా ఐదో విజయం నమోదు చేశాయి. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2.5–1.5తో కజకిస్తాన్ జట్టుపై నెగ్గగా... భారత పురుషుల జట్టు 3–1తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. కజకిస్తాన్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో బిబిసారా అసయుబయేవా చేతిలో ఓడిపోయింది. అయితే భారత మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి 59 ఎత్తుల్లో మెరూర్ట్ కమలిదెనోవాపై, వంతిక అగర్వాల్ 51 ఎత్తుల్లో అలువా నుర్మాన్‌పై గెలిచారు. జెనియా బలబయేవాతో గేమ్‌ను ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి భారత విజయాన్ని ఖరారు చేసింది. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అజర్‌బైజాన్‌తో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 44 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్‌పై, దొమ్మరాజు గుకేశ్ 38 ఎత్తుల్లో అయిదిన్ సులేమాన్లిపై విజయం సాధించారు. నిజాత్ అబసోవ్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 34 ఎత్తుల్లో... షఖిర్యార్ మమెదైరోవ్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 83 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని భారత్‌కు విజయాన్ని అందించారు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
ఎదురులేని భారత్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా నాలుగో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో ఫ్రాన్స్ జట్టుపై గెలుపొందింది. భారత పురుషుల జట్టు కూడా 3.5–0.5తో సెర్బియా జట్టుపై విజయం సాధించింది. ఫ్రాన్స్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 52 ఎత్తుల్లో డెమాంటి కార్నెపై, తానియా సచ్దేవ్ 50 ఎత్తుల్లో నటాషా బెన్మెస్బాపై, దివ్య దేశ్‌ముఖ్ 56 ఎత్తుల్లో మిత్రా హెజాజిపూర్పై గెలుపొందగా... సోఫీ మిలెట్తో జరిగిన గేమ్‌ను వైశాలి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వంతిక అగర్వాల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. సెర్బియాతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 40 ఎత్తుల్లో అలెగ్జాండర్ ఇందిక్పై, దొమ్మరాజు గుకేశ్ 85 ఎత్తుల్లో అలెగ్జాండర్ ప్రెడ్కిపై, విదిత్ సంతోష్ గుజరాతి 81 ఎత్తుల్లో వెలిమిర్ ఇవిచ్పై నెగ్గగా... అలెక్సీ సరానాతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
భారత జట్ల ‘హ్యాట్రిక్’
బుడాపెస్ట్ (హంగేరి): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేశాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–1తో స్విట్జర్లాండ్ జట్టును ఓడించగా... భారత పురుషుల జట్టు 3.5–0.5తో హంగేరి ‘బి’ జట్టుపై గెలిచింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 46 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ చేతిలో ఓడిపోగా... వైశాలి 38 ఎత్తుల్లో ఘజల్ హాకిమ్‌ఫర్డ్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 32 ఎత్తుల్లో సోఫియా హ్రిజ్లోవాపై, వంతిక అగర్వాల్ 48 ఎత్తుల్లో మరియా మాంకోపై విజయం సాధించారు. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.హంగేరి ‘బి’ జట్టుతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 34 ఎత్తుల్లో పీటర్ ప్రొజాస్కాపై, దొమ్మరాజు గుకేశ్ 54 ఎత్తుల్లో ఆడమ్ కొజాక్‌పై, ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో తామస్ బానుస్‌పై గెలిచారు. గాబోర్ పాప్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
ఫైనల్ లక్ష్యంగా...
దంబుల్లా: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు ఫైనల్ వేటలో పడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ భారత్... గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రాత్రి ఏడు గంటలకు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆడుతుంది. అజేయంగా హర్మన్‌సేన ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ ఇక నాకౌట్ దశలోనూ ఇదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఓపెనర్లలో షఫాలీ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టు విజయాలకు దోహదం చేస్తోంది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, హేమలతలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు కూడా రాణిస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కీలకంగా మారింది. రేణుకా సింగ్, పూజ వస్త్రకర్ నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారు. యూఏఈ, నేపాల్‌లపై భారీస్కోర్లు సాధించిన భారత మహిళల జట్టు ఈ నాకౌట్ దశలోనూ బంగ్లాదేశ్‌పై మరోభారీ స్కోరును నమోదు చేస్తే మిగతా పనిని బౌలర్లు సమర్థంగా పూర్తి చేస్తారు. సర్వశక్తులు ఒడ్డేందుకు... మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఫైనల్ కోసం గట్టి పోరాటానికే సన్నద్ధమైంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మెడకు తమ స్పిన్ ఉచ్చు బిగించాలని చూస్తోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ నహిదా అక్తర్, లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్లు ఈ టోరీ్నలో చక్కగా రాణించారు. సెమీస్ మ్యాచ్‌లో పిచ్ ఏమాత్రం అనుకూలించినా... తమ మాయాజాలంతో భారత బ్యాటర్ల ఆటకట్టించే ఎత్తుగడలతో పాక్ సేన ఉంది. మలేసియాతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా భారీస్కోరు (191/2) నమోదు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ముర్షిదా, దిలార, కెపె్టన్ నిగర్ సుల్తానా ఫామ్‌లోకి రావడం బంగ్లా శిబిరానికి కలిసొచ్చే అంశం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి మంధాన, హేమలత, జెమీమా, రిచాఘో‹Ù, దీప్తిశర్మ, అరుంధతి, రాధాయాదవ్, తనూజ, రేణుకా సింగ్. బంగ్లాదేశ్ మహిళల జట్టు: నిగర్ సుల్తానా (కెపె్టన్), ముర్షిదా, దిలార రుమానా, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబియా, షోర్న, నహిదా, సబికున్ జాస్మిన్, జహనారా. -
IND W vs SA W : సమం కోసం చివరి పోరు
చెన్నై: దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులోనూ ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టుకు టి20 సిరీస్ కలిసి రాలేదు. తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి రెండో టి20లో విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు వరుణుడు అవకాశం ఇవ్వలేదు. దాంతో రెండో టి20 ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20లో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే మంగళవారం కూడా వర్ష సూచన ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు రాణించలేకపోయారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో భారత బౌలర్ల నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఆశిస్తోంది. -
పాక్‌తో భారత్ తొలిపోరు
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టైటిల్ వేటను ఆరంభించనుంది. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లా నగరంలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా జట్లున్నాయి. జూలై 19న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 21న యూఏఈతో, 23న నేపాల్‌తో ఆడతాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. టాప్–10లో స్మృతి, హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్–10లో ఉన్నారు. గతవారం మూడో స్థానంలో ఉన్న స్మృతి ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకుంది. -
భారత మహిళల జట్టు ‘హ్యాట్రిక్’
అంటాల్యా (టర్కీ): వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు (కాంపౌండ్ విభాగం) స్వర్ణ పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 232–229 స్కోరుతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి గోపీచంద్ స్వామి, పర్నిత్ కౌర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. తుది పోరులో 4 ఎండ్లలో భారత్ వరుసగా 58, 57, 59, 58 పాయింట్లు సాధించగా...ఎస్తోనియా టీమ్ సభ్యులు వరుసగా 57, 57, 58, 57 స్కోర్లు చేసి ఓవరాల్‌గా 3 పాయింట్లతో వెనుకబడ్డారు. మన మహిళల జట్టు ఈ ఏడాది వరుసగా మూడో వరల్డ్ కప్‌లోనూ పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటడం విశేషం. వరల్డ్ కప్ స్టేజ్ 1 (షాంఘై), వరల్డ్ కప్ స్టేజ్ 2 (యెజియాన్)లలో కూడా టీమ్ అగ్రస్థానంతో ముగించింది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగం ఫైనల్లో ఓడిన భారత ఆర్చర్ ప్రియాన్‡్ష రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ప్రియాన్‡్ష 148–149 స్కోరుతో మైక్ స్కాలెసర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. -
సిరీస్ విజయంపై భారత్ గురి
వరుసగా మూడో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల టి20 జట్టు ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు సిల్హెట్లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్ బృందం తలపడనుంది. తొలి మ్యాచ్‌లో 44 పరుగులతో, రెండో మ్యాచ్‌లో 19 పరుగులతో భారత్ గెలిచింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రసారం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబర్లో బంగ్లాదేశ్ లోనే టి20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ భారత జట్టుకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. -
రెండో టి20లోనూ భారత మహిళల గెలుపు
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన రెండో టి20కి వర్షం అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 19 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ముర్షిదా ఖాటున్ (49 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించగా, రీతూ మోని (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. రాధా యాదవ్ 3, శ్రేయాంక, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (5 నాటౌట్) నింపాదిగా ఆడింది. కానీ హేమలత దయాళన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. మైదానం చిత్తడిగా మారడంతో మళ్లీ మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోయింది. హేమలతకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. -
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
బంగ్లాదేశ్‌తో ఆదివారం సిల్హెట్లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యస్తిక భాటియా (36; 6 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (3/18), పూజ వస్త్రకర్ (2/25) బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది. -
భారత్‌ను గెలిపించిన మనిక
బుసాన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరితో ఆదివారం జరిగిన గ్రూప్–1 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో గెలిచింది. భారత నంబర్‌వన్ మనిక బత్రా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత పురుషుల జట్టు గ్రూప్–3లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–3తో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన సింధు బృందం
ఆలమ్ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో అషి్మత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. గెలుపు వాకిట శ్రీకాంత్ బోల్తా భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లో 2–3తో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్‌ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను 22– 20తోపాటు మ్యాచ్‌ను 3–2తో జపాన్‌కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు. అంతకకుముందు తొలి మ్యాచ్‌లో ప్రణయ్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్‌లో లక్ష సేన్ నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–అర్జున్ జంట ఓటమి పాలైంది. -
IND-W Vs AUS-W 2nd T20I: బ్యాటర్ల వైఫల్యంతో...
నవీ ముంబై: వరుసగా రెండో విజయంతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాటర్ల వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైన హర్మన్‌ప్రీత్ బృందానికి ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ విజేతను తేల్చే నిర్ణాయక మూడో మ్యాచ్ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. టాపార్డర్‌లో షఫాలీ వర్మ (1), స్మృతి మంధాన (23; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (13) సహా కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (6) విఫలమయ్యారు. దీంతో 54 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా ఘోష్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్); దీప్తి శర్మ (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడారు. కానీ రిచా అవుటయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పూజ వస్త్రకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4)లు కూడా విఫలమవడంతో డెత్ ఓవర్లలో పరుగుల వేగం పుంజుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కిమ్ గార్త్ (2/27), అనాబెల్ సదర్లాండ్ (2/18), జార్జియా వేర్హమ్ (2/17) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు అలీసా హీలీ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు), బెత్ మూనీ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి విజయానికి అవసరమైన పునాది వేశారు. తర్వాత తాలియా మెక్‌గ్రాత్ (19; 3 ఫోర్లు), ఎలైస్ పెరీ (21 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగైన స్కోరు చేయడంతో ఆ్రస్టేలియా ఒక ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, పూజ చెరో వికెట్ పడగొట్టారు. -
టి20 సిరీస్‌కు ‘సై’
నవీ ముంబై: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టు టి20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 జరగనుంది. వన్డే సిరీస్‌లో నిరాశపరిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు టి20ల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. స్మృతి మంధాన, రిచా, షఫాలీ వర్మ, జెమీమాలతోపాటు హర్మన్‌ప్రీత్ కూడా తనవంతు పాత్రను పోషించాలి. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్, తాలియా, అనాబెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. -
భారత్ 0... ఆసీస్ 3
ముంబై: భారత మహిళల జట్టు కొత్త ఏడాదిని భారీ పరాజయంతో ప్రారంభించింది. ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. భారత జట్టుపై ఆ్రస్టేలియాకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ఫోబీ లిచ్‌ఫీల్డ్ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అలీసా హీలీ (85 బంతుల్లో 82; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత జట్టుపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. భారత బౌలర్లలో శ్రేయాంక 3, అమన్‌జోత్ 2 వికెట్లు తీశారు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 32.4 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. స్మృతి మంధాన (29; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, జెమీమా రోడ్రిగ్స్ (25; 3 ఫోర్లు), దీప్తి శర్మ (25 నాటౌట్; 2 ఫోర్లు)లు 20 పైచిలుకు స్కోర్లు చేశారంతే! కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (3) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమైంది. వేర్హమ్ 3, మేగన్ షుట్, అలానా కింగ్, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. -
రిచా పోరాటం వృథా
ముంబై: గెలవాల్సిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. సిరీస్ పరాజయంతో ఈ ఏడాదిని ముగించింది. 259 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 47 ఓవర్లలో 237/6 వద్ద పటిష్టంగానే కనిపించింది. 18 బంతుల్లో 22 పరుగుల విజయ సమీకరణం భారత మహిళలకే అనుకూలంగా ఉంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూజ (8), హర్లీన్ (1) అవుట్ కావడంతో ఓటమి ఖాయమైంది. 6 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయింది. తుదకు ఆసీస్ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గాయం పంటిబిగువన భరించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (117 బంతుల్లో 96; 13 ఫోర్లు)... జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు) అండతో అది్వతీయ పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే జనవరి 2న జరుగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్‌ఫిల్డ్ (98 బంతుల్లో 63; 6 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఎలీస్ పెరీ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన వారిలో తాలియా (24; 2 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (23; 1 ఫోర్), జార్జియా (22; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. అయితే టెయిలెండర్ అలానా కింగ్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్స్‌లు) కొట్టిన భారీ సిక్సర్లతో ఆసీస్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (5/38) వరుస విరామాల్లో వికెట్లను పడగొట్టింది. తర్వాత భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులకే పరిమితమైంది. అనాబెల్ సదర్లాండ్ (3/47) కీలక సమయంలో విలువైన వికెట్లను తీసి భారత్ గెలుపు రాతను మార్చింది. ఫీల్డింగ్‌లో గాయపడిన స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగింది. బెత్ మూనీ కొట్టిన షాట్‌ను బంతిని అందుకునే క్రమంలో చెరోవైపు నుంచి వచ్చిన స్నేహ్ రాణా, పూజ ఇద్దరి తలలు పరస్పరం ఢీకొని విలవిలలాడారు. తలనొప్పితో స్నేహ్రాణా మైదానం వీడింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: లిచ్‌ఫిల్డ్ (సి) రిచా (బి) శ్రేయాంక 63; అలీసా హీలీ (బి) పూజ 13; ఎలీస్ పెరీ (సి) శ్రేయాంక (బి) దీప్తి శర్మ 50; బెత్ మూనీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి శర్మ 10; తాలియా (బి) దీప్తి శర్మ 24; గార్డ్నెర్ (సి) అమన్‌జీత్ (బి) స్నేహ్ రాణా 2; అనాబెల్ (సి అండ్ బి) దీప్తి 23; జార్జియా (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 22; అలానా కింగ్ (నాటౌట్) 28; కిమ్ గార్త్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–40, 2–117, 3–133, 4–160, 5–170, 6–180, 7–216, 8–219. బౌలింగ్: రేణుక 7–0–36–0, పూజ 10–0–59–1, అమన్‌జోత్ 3–0–21–0, శ్రేయాంక 10–0–43–1, స్నేహ్ రాణా 10–0–59–1, దీప్తి శర్మ 10–0–38–5. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 14; స్మృతి (సి) తాలియా (బి) అలానా 34; రిచా ఘోష్ (సి) లిచ్‌ఫిల్డ్ (బి) అనాబెల్ 96; జెమీమా (సి) లిచ్‌ఫిల్డ్ (బి) వేర్హమ్ 44; హర్మన్‌ప్రీత్ (సి) హీలీ (బి) వేర్హమ్ 5; దీప్తి శర్మ (నాటౌట్) 24; అమన్‌జోత్ (బి) అనాబెల్ 4; పూజ (సి) గార్డ్నెర్ (బి) అనాబెల్ 8; హర్లీన్ (బి) గార్డ్నెర్ 1; శ్రేయాంక (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–37, 2–71, 3–159, 4–171, 5–218, 6–224, 7–240, 8–243. బౌలింగ్: గార్డ్నెర్ 10–0–46–1, బ్రౌన్ 7–0–37–0, కిమ్ గార్త్ 6–0–24–1, అనాబెల్ సదర్లాండ్ 9–0–47–3, అలానా కింగ్ 7–0–43–1, తాలియా 4–0–15–0, జార్జియా వేర్హమ్ 7–0–39–2. -
దీప్తి ధమాకా
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయంపై కన్నేసింది. భారత బౌలర్ల జోరుతో రెండో రోజే మ్యాచ్‌పై జట్టు పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల హవా సాగిన శుక్రవారం రెండు జట్లలో కలిపి 19 వికెట్లు నేలకూలగా... అందులో 15 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. భారత ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీప్తి ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సివర్ బ్రంట్ (70 బంతుల్లో 59; 10 ఫోర్లు) మాత్రమే పోరాడి అర్ధ సెంచరీ సాధించగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచే బ్యాటర్లంతా దూకుడుగా ఆడటంతో జట్టు ఆధిక్యం మరింత పెరిగింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (67 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా... షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధాన (26) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు చార్లీ డీన్ 4, ఎకెల్‌స్టోన్ 2 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ సతీశ్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 410/7తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఏకంగా 478 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో భారత్ ఇప్పటికే అసాధ్యమైన లక్ష్యం విధించే దిశగా సాగుతోంది. మ్యాచ్‌లో మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. -
మన మహిళలు అదుర్స్
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల ఏకైక టెస్టులో మన బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో తొలి రోజే రికార్డు స్కోరు నమోదైంది. ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే రోజు నమోదైన పరుగుల జాబితాను చూస్తే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (95 బంతుల్లో 60 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (81 బంతుల్లో 49; 6 ఫోర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకుంది. ప్రస్తుతం దీప్తితో పాటు పూజ వస్త్రకర్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉంది. డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున ముగ్గురు ప్లేయర్లు జెమీమా, రేణుకా సింగ్, శుభ సతీశ్ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. వీరిలో శుభకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. ఓపెనర్లు షఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, ఆ తర్వాత భారత బ్యాటర్లు క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డారు. కుదురుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించారు. మూడు భారీ భాగస్వా మ్యాలతో జట్టును నడిపించారు. శుభ, రోడ్రిగ్స్ మూడో వికెట్‌కు 115 పరుగులు... యస్తిక, హర్మన్ ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించగా... దీప్తి, స్నేహ్ రాణా (73 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఏడో వికెట్‌కు 92 పరుగులు జత చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) బెల్ 17; షఫాలీ (బి) క్రాస్ 19; శుభ (సి) సివర్ (బి) ఎకెల్‌స్టోన్ 69; జెమీమా (బి) బెల్ 68; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 49; యస్తిక (సి) బెల్ (బి) డీన్ 66; దీప్తి (బ్యాటింగ్) 60; స్నేహ్ రాణా (బి) సివర్ 30; పూజ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (94 ఓవర్లలో 7 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–25, 2–47, 3–162, 4–190, 5–306, 6–313, 7–405. బౌలింగ్: కేట్ క్రాస్ 14–0–64–1, లారెన్ బెల్ 15–1–64–2, నాట్ సివర్ 11–4–25–1, లారెన్ 15–1–84–0, చార్లీ డీన్ 17–1–62–1, సోఫీ ఎకెల్‌స్టోన్ 22–4–85–1. 2 మహిళల టెస్టు క్రికెట్లో ఒకేరోజు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో భారత జట్టు రెండో స్థానం (410)లో నిలిచింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఒకే రోజు 431 పరుగులు సాధించింది. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కూడా. -
సిరీస్ అప్పగించేశారు!
ముంబై: భారత మహిళల జట్టు ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పజెప్పింది. శనివారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇంగ్లండ్ 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిల జట్టు 16.2 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్ బౌలింగ్‌ను కొంత వరకు ఎదుర్కోగలిగింది. స్మృతి మంధాన (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చార్లి డీన్ (2/16), లారెన్ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది. అయితే చివరకు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డాని వైట్ (0), సోఫియా డన్‌క్లీ (9) విఫలమైనా... అలైస్ కాప్సీ (21 బంతుల్లో 25; 4 ఫోర్లు), నట్ సీవర్ (16) కాసేపు క్రీజులో నిలవడంతో విజయం దక్కింది. సిరీస్‌లో నామమాత్రమైన చివరి టి20 మ్యాచ్ నేడు ఇదే వేదికపై జరుగుతుంది. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బుధవారం వాంఖెడె మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. హీతెర్ నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఈ గెలుపుతో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. రేణుక సింగ్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లీ, అలీస్ క్యాప్సీలను అవుట్ చేసింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్‌ను డానియల్ వైట్ (47 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 77; 13 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓడిపోయింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 52; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15) భారత్‌ను కట్టడి చేసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా డంక్లీ (బి) రేణుక సింగ్ 1; డానియల్ వైట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సైకా ఇషాక్ 75; అలీస్ క్యాప్సీ (బి) రేణుక సింగ్ 0; నాట్ సివర్ బ్రంట్ (సి) రిచా ఘోష్ (బి) రేణుక సింగ్ 77; హీతెర్ నైట్ (బి) శ్రేయాంక పాటిల్ 6; అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక పాటిల్ 23; ఫ్రెయా కెంప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–140, 4–165, 5–177, 6–197. బౌలింగ్: రేణుక 4–0–27–3, పూజ 4–0–44–0, సైకా ఇషాక్ 4–0–38–1, దీప్తి శర్మ 3–0–28–0, శ్రేయాంక 4–0–44–2, కనిక అహుజా 1–0–12–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) సారా గ్లెన్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 52; స్మృతి మంధాన (బి) నాట్ సివర్ బ్రంట్ 6; జెమీమా రోడ్రిగ్స్ (సి) అమీ జోన్స్ (బి) ఫ్రెయా కెంప్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 26; రిచా ఘోష్ (సి) అలీస్ క్యాప్సీ (బి) సారా గ్లెన్ 21; కనిక అహుజా (సి) నాట్ సివర్ బ్రంట్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 15; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; దీప్తి శర్మ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–20, 2–41, 3–82, 4–122, 5–134, 6–151. బౌలింగ్: మహికా గౌర్ 2–0–18–0, లారెన్ బెల్ 4–0–35–0, నాట్ సివర్ బ్రంట్ 4–0–35–1, ఫ్రెయా కెంప్ 2–0–30–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–15–3, సారా గ్లెన్ 4–0–25–1. -
భారత మహిళల ఓటమి
సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్ ఖాన్ (24వ ని.) గోల్స్ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్ (17వ ని.), కరోలిన్ సీడెల్ (38వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్‌లోనే 2 గోల్స్ సాధించి ముందంజలో నిలిచిన భారత్ మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ కొట్టింది. ఆఖరి క్వార్టర్లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడుతుంది. -
బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ!
నాలుగు నెలల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌ల పర్యటనలో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాపై భారత జట్టు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. భారత్ కోణంలో చూస్తే పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువ క్రీడాకారిణులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నిలిచింది. సీనియర్ స్పిన్నర్లు రాధ యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్ లేకపోవడంతో తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనూషకు ఇది మంచి చాన్స్. ఆమె తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఎంపికైన పేసర్ మోనికా పటేల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. భారత మహిళల జట్టు కోచ్‌గా అమోల్ మజుందార్ ఎంపిక దాదాపు ఖాయమైనా...అధికారిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అతను కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్–19 జట్టు, ఇటీవల ఆసియా కప్ గెలిచిన అండర్–23 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, బారెడ్డి అనూష -
Womens T20 World Cup: మరో విజయమే లక్ష్యంగా...
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు వరుసగా మరో విజయంపై దృష్టి సారించింది. బుధవారం గ్రూప్ ‘బి’లో జరిగే లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన... వెస్టిండీస్‌తో తలపడుతుంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓడిన కరీబియన్ అమ్మాయిలు బోణీ కొట్టేందుకు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ ఎదురైన గత మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభంలో తడబడినా... తర్వాత పుంజుకుంది. డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన గాయంతో అందుబాటులో లేకపోయినా... లక్ష్యఛేదనలో భారత్ ఆడిన తీరు బాగుంది. ఇప్పుడైతే స్టార్ ఓపెనర్ స్మృతి తుది జట్టులోకి రావడంతో బ్యాటింగ్ దళం మరింత పటిష్టమైంది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. పాక్‌తో పోరులో తొలి పది ఓవర్ల పాటు బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. కానీ తర్వాతి 10 ఓవర్లే కట్టుదిట్టంగా వేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అలాంటి తడబాటుకు అవకాశమివ్వకుండా రాణిస్తే భారత్‌కు వరుస విజయం కష్టమేం కాదు. మరోవైపు విండీస్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. వరుసగా 14 మ్యాచ్‌ల్లో హేలీ మాథ్యూస్ సేన గెలుపొందలేకపోయింది. ఇందులో ఒక మ్యాచ్ ‘టై’కాగా... 13 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం జట్టును కుంగదీస్తోంది. మెగా ఈవెంట్లో\ ముందంజ వేయాలంటే కరీబియన్ జట్టుకు ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి లీగ్ మ్యాచ్‌లో విండీస్ ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. 12:ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది. -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
IND W vs ENG W 3rd T20: మళ్లీ ఓడిన మన మహిళలు
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన హర్మన్ బృందానికి ఓటమిని అందించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 9.5 ఓవర్లకే షఫాలీ (5), స్మృతి (9), మేఘన (0), హేమలత (0), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (5) వెనుదిరగ్గా... 52 పరుగుల వద్ద స్నేహ్ రాణా (8) వికెట్ పడింది. ఈ దశలో రిచా ఘోష్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు), దీప్తి శర్మ (25 బంతుల్లో 24) ఆదుకోవడంతో స్కోరు 100 పరుగులు దాటగలిగింది. చివర్లో పూజ వస్త్రకర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) కూడా కొన్ని పరుగులు జోడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (3/25) భారత్‌ను దెబ్బ తీయగా, సారా గ్లెన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు సాధించి గెలిచింది. సోఫియా డంక్లీ (44 బంతుల్లో 49; 6 ఫోర్లు), అలైస్ క్యాప్సీ (24 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, డానీ వ్యాట్ (22; 1 ఫోర్) రాణించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హోవ్‌లో తొలి వన్డే జరుగుతుంది. -
మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీని ప్రశంసిస్తూ మోదీ లేఖ
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ట్విట్టర్లో ఆ లేఖను పోస్ట్ చేశారు. ‘రెండు దశాబ్దాలకు పైగా మీరు భారత క్రికెట్‌కు సేవలందించారు. మీ ప్రతిభాపాఠవాలతో జాతీయ జట్టును నడిపించిన తీరు అమోఘం. మీ ప్రదర్శన అద్భుతం. ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్ మొత్తం అంకెలతో ఉన్నత శిఖరాలకు చేరింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరెన్నో రికార్డులను నెలకొల్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఓ అథ్లెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయ్యారు’ అని ప్రధాని అందులో పేర్కొన్నారు. -
భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీ జూన్ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది. -
IndW Vs AusW Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట
గోల్డ్‌కోస్ట్: భారత మహిళల జట్టు ‘పింక్’ టెస్టుకు ‘సై’ అంటోంది. ఆ్రస్టేలియాతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే నాలుగు రోజుల టెస్టు నేటి నుంచి జరగనుంది. మిథాలీ రాజ్ బృందానికి డే–నైట్ టెస్టు కొత్తనుకుంటే... ఆసీస్‌తో ఆడటం కూడా ఒక రకంగా కొత్తే! ఎందు కంటే ఇరు జట్ల మధ్య సంప్రదాయ మ్యాచ్ జరిగి దశాబ్దంన్నరకాలం అవుతోంది. ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి. కెపె్టన్ మిథాలీ రాజ్, వెటరన్ సీమర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి, పూనమ్ రౌత్/యస్తిక, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా, పూజ/శిఖా పాండే, జులన్, మేఘన, రాజేశ్వరి గైక్వాడ్. ఆ్రస్టేలియా మహిళల జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, ఎలీస్ పెర్రీ, తాలియా, యాష్ గార్డెనెర్, సదర్లాండ్, సోఫీ, వేర్హామ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. -
India vs England: మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
వొర్సెస్టర్: స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో కెప్టెన్ మిథాలీ రాజ్ భారత మహిళల జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిథాలీ అజేయ అర్ధ సెంచరీ (86 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు) సాధించడంతోపాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు), కెప్టెన్ హీతర్ నైట్ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జెమీమా (4) విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిథాలీ... స్నేహ్ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. చివర్లో స్నేహ్ అవుటవ్వగా... భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా... మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడటంతో సిరీస్‌ను 1–2తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మిథాలీ మైలురాయి: ఈ మ్యాచ్ మిథాలీకి చిరస్మరణీయ మ్యాచ్ అయ్యింది. ఆమె వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్; 10,273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7,304; 89 టి20 మ్యాచ్‌ల్లో 2,364 పరుగులు) చేసింది. -
వైట్‌వాష్ తప్పేనా!
వార్సెస్టర్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు జరిగే ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. రెండు వన్డేల్లోనూ సారథి మిథాలీ మినహా ఎవరూ రాణించలేకపోయారు. సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు బాధ్యత పంచుకోవాల్సిన తరుణమిది. రెండో వన్డేలో షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించింది. వీరితో పాటు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు కూడ రాణిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు జోరు మీదున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పర్యాటక జట్టుపై ఆధిపత్యాన్ని చాటాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డే సందర్భంగా మెడనొప్పితో ఇబ్బంది పడిన భారత కెప్టెన్ మిథాలీ గాయం నుంచి కోలుకుందని జట్టు వర్గాలు తెలిపాయి. శుక్రవారం సహచరులతో కలిసి ఆమె నెట్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది. -
వన్డే సమరానికి ‘సై’
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. 2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్ బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్‌కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్ హెదర్‌నైట్, బీమోంట్‌లతో పాటు బ్యాటింగ్ ఆల్ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో కేట్ క్రాస్, ఎకిల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. -
భారత మహిళా క్రికెటర్లకు ‘ఆ మొత్తం’ అందనేలేదు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా... రన్నరప్ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రన్నరప్ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వనే లేదు. మహిళా క్రికెటర్లపై బోర్డు శీతకన్నుకు ఇదో నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు గత సంవత్సరం ఏప్రిల్‌లో... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు గత ఏడాది మేలోనే ప్రైజ్‌మనీని పంపిణీ చేశాయి. వారం రోజుల్లో ఇస్తాం: బీసీసీఐ బ్రిటన్ దినపత్రికలో వచ్చిన ఈ కథనం, దరిమిలా విమర్శలపై బోర్డు స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది. ‘కరోనా కారణంగా ఈ ఒక్క ప్రైజ్‌మనీయే కాదు... పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, వార్షిక చెల్లింపులు అన్నీ ఆలస్యమే అవుతున్నాయి’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
ముక్కోణపు టి20 : ఫైనల్లో భారత్
మెల్బోర్న్: మహిళల టి20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా (0.23), భారత్ (–0.07) ఈనెల 11న జరిగే టైటిల్ పోరుకు అర్హత సాధించగా... ఇంగ్లండ్ (–0.16) జట్టు నిష్క్రమించింది. -
బ్యాడ్మింటన్‌పై ‘కరోనా’
న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరగనున్న ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు తప్పుకుంది. ఫిలిప్పీన్ దేశంలోనూ ‘కరోనా వైరస్’ వేగంగా వ్యాప్తి చెందుతుండటమే అందుకు కారణం. ఈ నెల 11 నుంచి 16 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. ‘కరోనా కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. ఆసియా బ్యాడ్మింటన్ సమాఖ్యతో కూడా దీనిపై చర్చించాం. అనంతరం మన మహిళల జట్టు టోర్నీలో పాల్గొనకుండా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఇంతకు ముందే ఈ టోర్నీకి దూరం కాగా అస్మిత చలీహా, మాల్విక బన్సోడ్, పుల్లెల గాయత్రి తదితర యువ క్రీడాకారిణులతో కూడిన భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు పురుషుల జట్టు మాత్రం చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని ‘బాయ్’ వెల్లడించడం విశేషం. సాయిప్రణీత్, శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ తదితరులతో పూర్తి స్థాయి పురుషుల జట్టు టోర్నీ బరిలోకి దిగుతోంది. వీరంతా ఈ నెల 9న మనీలా బయల్దేరతారు. -
ఒత్తిడిని అధిగమించడం కీలకం
ముంబై: పెద్ద టోర్నీల్లో ఆడేటపుడు ఎదురయ్యే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకుంటేనే ఫలితాలు సాధించవచ్చని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయ పడింది. ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు బయల్దేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘మేం గత రెండు ప్రపంచకప్‌లకు దగ్గరయ్యాం. కానీ... ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలమై చేజార్చుకున్నాం. ఇప్పుడు అలా కానివ్వం. పెద్ద టోర్నీ అనే సంగతి పక్కనబెట్టి మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం. అలా ఒత్తిడి లేకుండా చూసుకుంటాం’ అని అన్నారు. గత టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడిన భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడింది. ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మల పాత్ర కీలకమని చెప్పిన హర్మన్... వాళ్లిద్దరు శుభారంభమిస్తే జట్టు గెలుపొందడం సులభమవుతుందని పేర్కొంది. ఆసీస్ ఆతిథ్యమిచ్చే పొట్టి కప్ వచ్చే నెల 21 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. అయితే అంతకంటే ముందు భారత్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలు సన్నాహకంగా ముక్కోణపు టోర్నీని ఆడతాయి. అందుకే భారత్ కాస్త ముందుగా అక్కడికి బయల్దేరుతోంది. 30 ఏళ్ల హర్మన్‌ప్రీత్ గతేడాది రాణించలేకపోయింది. ఈ ఏడాది మాత్రం తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటానని చెప్పింది. -
భారత మహిళల ‘ఎ’ జట్టుకు రెండో ఓటమి
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో ఆ్రస్టేలియా 37 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సారథి తహిలా మెక్‌గ్రాత్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో స్యామి జో జాన్సన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (2/22) రాణించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి ఓడిపోయింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (1) విఫలమైంది. వేద కృష్ణమూర్తి (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో అరుంధతి రెడ్డి (14 బంతుల్లో 19; 1 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ స్కోరు 100 పరుగులు దాటగలిగింది. తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడగా... నామమాత్రపు మూడో టి20 ఈనెల 23వ తేది జరుగుతుంది. -
పురుషుల జట్టు కివీస్‌తో...మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో...
టోక్యో: అంతర్జాతీయ హాకీ సమాఖ్య టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి ఈవెంట్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. జూలై 24న ప్రారంభోత్సవం తర్వాత ఈవెంట్స్ మొదలయ్యే తొలి రోజు 25న హాకీ మ్యాచ్‌లు మొదలవుతాయి. అదే రోజు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత పురుషుల జట్టు... నెదర్లాండ్స్‌తో భారత మహిళల జట్టు ఆడతాయి. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత పురుషుల జట్టు తర్వాతి మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా (జూలై 26న), స్పెయిన్ (జూలై 28న), అర్జెంటీనా (జూలై 30న), జపాన్ (జూలై 31న) జట్లతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే ఉన్న భారత మహిళల జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో జర్మనీ (జూలై 27న), బ్రిటన్ (జూలై 29న), ఐర్లాండ్ (జూలై 31న), దక్షిణాఫ్రికా (ఆగస్టు 1న) జట్లతో తలపడుతుంది. -
భారత అమ్మాయిలకు రెండో విజయం
కాన్బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు అజేయ రికార్డు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఈ టోర్నీ లో భారత్‌కిది రెండో విజయం కాగా... మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. నేడు ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. ప్రతి క్వార్టర్లో ఒక్కో గోల్ చేశారు. భారత్ తరఫున షర్మిలా దేవి (12వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డుంగ్‌డుంగ్ బ్యూటీ (27వ ని.లో), లాల్రిన్డికి (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కివీస్ తరఫున షానన్ ఒలివియా (4వ ని.లో) ఏకైక గోల్ చేసింది. -
భారత్ అజేయంగా
కౌలాలంపూర్: మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 35వ నిమిషంలో నవ్‌జ్యోత్ కౌర్ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్ వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్‌తో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరంభంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో రెండు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే మూడో క్వార్టర్లో నవ్‌జ్యోత్ కౌర్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత మహిళలు ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంపై కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ ‘ భారత్ గోల్ చేసే అవకాశాలు సృష్టించుకున్న తీరు అభినందనీయం. ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చాలా సార్లు దూసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచాం. కానీ పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారించాలి’ అని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా ఈ టూర్ యువ క్రీడాకారిణులకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అన్నారు. -
భారత్‌దే సిరీస్
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 1–0 తో మలేసియాపై విజయం సాధించింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా లాల్రెమ్సియామి చేసిన గోల్‌తో భారత్‌ను విజయం వరించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు భారత్ ఆడిన మూడు గేముల్లో రెండింటిలో గెలిచి మరోటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మలేసియా హోరాహోరీగా పోరాడింది. తొలి నిమిషంలోనే పెనాల్టీకార్నర్‌ను గెలుచుకుంది. అయితే భారత గోల్‌కీపర్ సవిత చాకచక్యంగా వ్యవహరించడంతో మలేసియాకు గోల్ దక్కలేదు. మరోవైపు భారత్ కూడా తమకు అందివచ్చిన ఐదు పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకుంది. దీంతో తొలి మూడు క్వార్టర్స్ గోల్ లేకుండానే ముగిసిపోయాయి. నాలుగో క్వార్టర్లో ఇరుజట్లు గోల్ కోసం దాడులు ఉధృతం చేశాయి. ఆట 55వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ అందించిన పాస్‌ను లాల్రెమ్సియామి అద్భుతంగా డైవ్ చేస్తూ గోల్‌గా మలిచి భారత శిబిరంలో ఆనందం నింపింది. -
భారత మహిళల జోరు
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కనబరుస్తోంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించి భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. నవ్‌జ్యోత్ కౌర్ (12వ ని.), వందన కటారియా (20వ ని.), నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) తలా ఓ గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ ప్రారంభించిన భారత్‌కు మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దీన్ని గోల్‌గా మలచలేకపోయింది. తర్వాత మరో రెండు గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో మూడు నిమిషాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా నవ్‌జ్యోత్ కౌర్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో స్ట్రయికర్ వందన కటారియా అద్భుత ఫీల్డ్ గోల్‌తో పాటు, నవ్‌నీత్‌కౌర్ మరో గోల్ చేయడంతో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో మలేసియా జట్టు పుంజుకుంది. భారత గోల్ పోస్టుపై దాడులు చేయడంతో పాటు, గోల్ చేయకుండా ప్రత్యర్థిని అడ్డుకుంది. దీంతో మూడో క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివరి క్వార్టర్లో లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) వరుస గోల్స్‌తో చెలరేగడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. -
భారత మహిళల శుభారంభం
కౌలాలంపూర్: మలేసియాతో గురువారం ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 3–0తో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ తరఫున స్ట్రయికర్ వందన కటారియా (17వ ని., 60వ ని.) రెండు గోల్స్‌తో చెలరేగగా... లాల్రెమ్సియామి (38వ ని.) మరో గోల్‌తో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్లో ఇరు జట్లూ గోల్స్ చేయనప్పటికీ ఆధిక్యం సాధించేందుకు విఫలయత్నాలు చేశాయి. మ్యాచ్ మూడో నిమిషంలోనే మలేసియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే అనుభవజ్ఞురాలైన భారత గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి గోల్‌ను నిలువరించింది. తర్వాత భారత్ నుంచి లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్ గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫినిషింగ్ లోపంతో సఫలం కాలేకపోయారు. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో అలరించింది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మూడో క్వార్టర్స్‌లో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే లాల్రెమ్సియామి మరో ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కొద్ది సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వందన మరో గోల్‌తో భారత్ విజయాన్ని పరిపూర్ణం చేసింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. -
చేజేతులా...
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు టి20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. చివరిదైన మూడో మ్యాచ్‌లో విజయం అంచుల్లో నిలిచి కూడా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకొని సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. ఆఖరి ఓవర్లో విజయం కోసం 3 పరుగులు చేయాల్సిన భారత మహిళల జట్టు ఒక్క పరుగు మాత్రమే చేసి అనూహ్యంగా ఓడిపోయింది. గువహటి: గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా ఓడిపోవాలో భారత మహిళల జట్టు శనివారం ఓడి చూపించింది. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 118 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్లో భారత విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) ఉన్నప్పటికీ ఆమెకు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న భారత బ్యాటర్ భారతి ఫుల్మాలి (13 బంతుల్లో 5)... ఇంగ్లండ్ బౌలర్ కేట్ క్రాస్ వేసిన ఈ ఓవర్లో తొలి మూడు బంతులను వృథా చేసింది. నాలుగో బంతికి భారీ షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో ష్రబ్‌సోల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. భారతి స్థానంలో వచ్చిన అనూజా పాటిల్ (0) సింగిల్ తీసి మిథాలీ రాజ్‌కు స్ట్రయికింగ్ ఇవ్వాలని ఆలోచించలేదు. భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకొచ్చిన అనూజాను ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఆమీ ఎలెన్ జోన్స్ స్టంపౌంట్ చేసింది. దాంతో విజయ సమీకరణం ఒక బంతికి 3 పరుగులుగా మారింది. చివరి బంతిని ఎదుర్కొనేందుకు క్రీజ్‌లోకి వచ్చిన శిఖా పాండే ఒక పరుగు మాత్రమే చేయగలిగింది. దాంతో భారత ఓటమి ఖాయంకాగా... నమ్మశక్యంకాని రీతిలో గెలిచినందుకు ఇంగ్లండ్ జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మెరిసిన స్మృతి మంధాన... అంతకుముందు భారత కెప్టెన్ స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 58 పరుగులు చేసింది. 13వ ఓవర్ చివరి బంతికి స్మృతి ఔటయ్యే సమయానికి భారత స్కోరు 87. అప్పటికి భారత్ నెగ్గాలంటే 42 బంతుల్లో 33 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ మిథాలీ రాజ్ కూడా నింపాదిగా ఆడటం... ఇతర బ్యాటర్లు బంతులు వృథా చేయడంతో భారత్ విజయానికి చేరువై దూరమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. డానియెలా వ్యాట్ (22 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), టామీ బీమోంట్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), ఆమీ జోన్స్ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హర్లీన్ డియోల్, అనూజా పాటిల్ రెండేసి వికెట్లు తీశారు. కేట్ క్రాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... డానియెలా వ్యాట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
చివరి వన్డేలో పరాజయం
ముంబై: ఎట్టకేలకు ఇంగ్లండ్ గెలిచింది. 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 49 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి.. ఇక క్లీన్‌స్వీపే అనిపించిన దశలో ప్రపంచ చాంపియన్ కడదాకా పోరాడింది. గెలిచే దాకా పట్టుదల చూపింది. చివరకు భారత మహిళల నుంచి వైట్‌వాష్‌ను తప్పించుకుంది. గురువారం జరిగిన చివరి మూడో వన్డేలో భారత మహిళల జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఆధిక్యం 2–1కు పరిమితమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 50 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (74 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా... పూనమ్ రౌత్ (97 బంతుల్లో 56; 7 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కాగా... స్మృతి, పూనమ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. కానీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కాథరీన్ బ్రంట్ (5/28) దెబ్బకు భారత్ తడబడింది. 150 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. చివరకు దీప్తిశర్మ 27, శిఖాపాండే 26 పరుగులు చేయడంతో 200 దాటింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలో ఇంగ్లండ్‌పై జులన్ గోస్వామి (3/41) పంజా విసిరింది. దీంతో 49 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హీథర్ నైట్ (63 బంతుల్లో 47; 6 ఫోర్లు), ఆల్‌రౌండర్ వ్యాట్ (82 బంతుల్లో 56; 5 ఫోర్లు), ఎల్విస్ (53 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు) పట్టుదలతో ఆడి జట్టును గెలిపించారు. శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఈ నెల 4, 7, 9 తేదీల్లో గువహటిలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. -
అమ్మాయిలూ ఓడారు
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా పురుషుల, మహిళల క్రికెట్ జట్ల ప్రయాణం ఒకే విధంగా సాగుతోంది. హామిల్టన్‌లో గురువారం తన 200వ వన్డేలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు పరాజయం ఎదురవగా... అదే వేదికలో శుక్రవారం రికార్డు స్థాయిలో 200వ మ్యాచ్ ఆడిన అమ్మాయిల సారథి మిథాలీ రాజ్‌కూ ఓటమి అనుభవమే మిగిలింది. ఈ ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లూ వన్డే సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకోవడం గమనార్హం కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పరిస్థితుల్లో మ్యాచ్‌లు చేజార్చుకోవడం విశేషం. హామిల్టన్: ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు వన్డేల్లో చెలరేగి ఆడి సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు చివరిదైన మూడో వన్డేలో ఓటమి పాలైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు... కివీస్ ఆఫ్ స్పిన్నర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అనా పీటర్సన్ (4/28), పేసర్ లీ మేరీ తహుహు (3/26) ధాటికి తడబడ్డారు. వన్‌డౌన్ బ్యాటర్ దీప్తి శర్మ (90 బంతుల్లో 52; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెరీర్లో 200వ వన్డే ఆడిన కెప్టెన్ మిథాలీ రాజ్ (9) సహా ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ (12), స్మృతి మంధాన (1) నిరాశపర్చారు. ఓ దశలో 35 ఓవర్లకు 115/4తో ఉన్న జట్టు బ్యాటర్ల వైఫల్యంతో 44 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. మరో స్పిన్నర్ అమేలియా కెర్ (2/43)కు రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్ సుజీ బేట్స్ (64 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్); కెప్టెన్ సాటర్‌వైట్ (74 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆతిథ్య జట్టు 29.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేట్స్, సాటర్‌వైట్ రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. భారత ఓపెనర్ స్మృతికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఈ నెల 6 నుంచి జరుగనుంది. -
వేదపై వేటు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత మహిళల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. హేమలత కళ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించింది. సారథులుగా వన్డేలకు మిథాలీరాజ్‌ను, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కొనసాగించింది. అయితే ఇరుజట్ల నుంచి వేద కృష్ణమూర్తిని తొలగించారు. ఫామ్ లో లేకపోవడంతో ఆమెను కివీస్ టూర్‌కు ఉద్వాసన పలికారు. ఆమె స్థానంలో వన్డే జట్టులోకి మోనా మేష్రమ్, టి20లో కొత్తమ్మాయి ప్రియా పూనియాను ఎంపిక చేశారు. పూజ వస్త్రకర్ గాయపడటంతో టి20 జట్టులో ఆమె స్థానాన్ని శిఖాపాండేతో భర్తీ చేశారు. జనవరి 24 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడుతుంది. టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇది. గురువారం అమ్మాయిల జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. వన్డే జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ, తానియా భాటియా, మోనా మేష్రమ్, ఏక్తాబిష్త్, మాన్సి జోషి, హే మలత, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖాపాండే. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, మిథాలీ, దీప్తి, జెమీమా, అనూజ, హేమలత, మాన్సి, శిఖా పాండే, తానియా, పూనమ్, ఏక్తా బిష్త్, రాధ, అరుంధతి రెడ్డి, ప్రియాపూనియా. -
వార్మప్ మ్యాచ్‌లో జయభేరి
కూలిడ్జ్: టి20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు... డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (37 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించింది. రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/17), తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (2/36) ప్రత్యర్థిని కట్టడి చేశారు. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 75 పరుగులుగా నిర్దేశించారు. మిథాలీ రాజ్ (0), జెమీమా రోడ్రిగ్స్ (1), తాన్యా భాటియా (5) విఫలమైనా... స్మృతి మంధాన (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 18; 2 ఫోర్లు) నిలవడంతో భారత్ మరో 3 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. మహిళల క్రికెట్‌పై పుస్తకం... ‘ది ఫైర్ బర్న్స్ బ్లూ; ఎ హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా’ శీర్షికన భారత్‌లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై ఓ పుస్తకం రానుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు కారుణ్య కేశవ్, సిద్ధాంత పట్నాయక్ రచించిన ఈ పుస్తకం ఈ నెల 30న మార్కెట్లో విడుదల కానుంది. వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ముద్రిస్తోంది. 1970ల నుంచి నేటి వరకు మహిళల క్రికెట్ ప్రస్థానాన్ని ఇందులో వివరించనున్నారు. లుపు -
భారత జట్లకు వరుసగా రెండో విజయం
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. జార్జియాలో మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ద్రోణవల్లి హారిక, తానియా, ఇషా, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4–0తో వెనిజులాపై గెలిచింది. హారిక 52 ఎత్తుల్లో సరాయ్‌పై, తానియా 44 ఎత్తుల్లో అమెలియాపై, ఇషా 49 ఎత్తుల్లో రవీరాపై, పద్మిని 42 ఎత్తుల్లో పటినో గార్సియాపై నెగ్గారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్, ఆధిబన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఆస్ట్రియాను ఓడించింది. -
భారత్ క్లీన్‌స్వీప్
కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు జైత్రయాత్ర ముగిసింది. వన్డే సిరీస్‌ను 2–1తో హస్తగతం చేసుకున్న మన అమ్మాయిలు... పొట్టి ఫార్మాట్లోనూ దుమ్మురేపారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షార్పణం కాగా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలిచి 4–0తో క్లీన్‌స్వీప్ చేశారు. మంగళవారం జరిగిన చివరిదైన ఐదో టి20లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. తొలుత భారత్ 18.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (12), స్మృతి మంధాన (0) త్వరగానే పెవిలియన్ చేరినా... జెమీమా, హర్మన్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అనంతరం వేద కృష్ణమూర్తి (8), అనూజ (1), తానియా (5) సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో భారత్ నిర్ణీత ఓవర్లకంటే ముందే ఆలౌటైంది. లంక బౌలర్లలో శశికళ, ప్రయదర్శని ఫెర్నాండో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం పూనమ్ యాదవ్ (3/18), దీప్తి శర్మ (2/18), రాధ యాదవ్ (2/14)ల ధాటికి లంక 17.4 ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. -
టి20 సిరీస్ కూడా మనదే
కొలంబో: వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగించింది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అనూజా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. చివరిదైన ఐదో మ్యాచ్ నేడు జరుగుతుంది. రెండో మ్యాచ్ వర్షంతో రద్దయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 134 పరుగులు సాధించింది. సిరివర్ధనే (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్స్), జయాంగని (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుంది. అనంతరం భారత్ 15.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (7 బంతుల్లో 11; 2 ఫోర్లు), స్మృతి మంధాన (5), తానియా భాటియా (5) తొందరగా ఔటవ్వడంతో ఒకదశలో భారత్ 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనూజా పాటిల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు. లంక బౌలర్ల పనిపట్టి నాలుగో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశారు. ఈ సిరీస్‌లో జెమీమాకిది రెండో అర్ధసెంచరీ. మూడో మ్యాచ్‌లో జెమీమా 57 పరుగులు సాధించింది. -
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ
భారత మహిళల, పురుషుల బ్యాడ్మింటన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి పతకం రేసు నుంచి నిష్క్రమించాయి. భారత మహిళల జట్టు 1–3తో పటిష్టమైన జపాన్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో సింధు 21–18, 21–19తో రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గి 1–0 ఆధిక్యం అందించింది. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ఆర్తి సునిల్ జంట 15–21, 6–21తో యూకి ఫుకుషిమా–సయాకా జోడీ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో సైనా 11–21, 25–23, 16–21తో ఒకుహారా చేతిలో ఓడింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో సింధు–అశ్విని ద్వయం 13–21, 12–21తో అయాక తకహషి–మిసాకి జంట చేతిలో ఓడటంతో భారత పోరాటం ముగిసింది. ఇక భారత పురుషుల జట్టు 1–3తో ఇండోనేసియా చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–23, 22–20, 10–21తో గిన్టింగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్æ–చిరాగ్‌శెట్టి జోడీ 21–19, 19–21, 16–21తో సుకాముల్జో–ఫెర్నాల్డీ గిడియోన్ చేతిలో ఓడింది. భారత్ 0–2తో వెనుకబడిన స్థితిలో సింగిల్స్ బరిలో దిగిన ప్రణయ్ 21–15, 19–21, 21–19తో జొనాథన్ క్రిస్టీపై గెలిచి పోటీలో నిలిపినా... మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 14–21, 18–21తో ఫజర్–రియాన్ జోడీ చేతిలో ఓడింది. కబడ్డీలో షాక్... డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల కబడ్డీ జట్టుకు షాక్ తగిలింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం భారత్ 23–24తో కొరియా చేతిలో ఖంగుతింది. ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశ పెట్టిన 28 ఏళ్లలో భారత జట్టు ఓ మ్యాచ్‌లో ఓడటం ఇదే తొలి సారి. మహిళల జట్టు 33–23తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. సెపక్‌తక్రాలో పతకం ఖాయం... సెపక్‌తక్రాలో భారత్‌కు తొలిసారి పతకం ఖాయమైంది. పురుషుల టీమ్ రెగూ ప్రిలిమినరీ విభాగంలో భారత్ 21–16, 19–21, 21–17తో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రాంజల జంట ఓటమి మహిళల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల–రుతుజా భోస్లే జంట 6–3, 4–6, 9–11తో నిచా–ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్; రామ్‌కుమార్... మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా, కర్మన్ కౌర్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. భారత్ 17 – ఇండోనేసియా 0 భారత పురుషుల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో 17–0తో ఆతిథ్య ఇండోనేసియాను చిత్తుచేసింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్, సిమ్రన్‌జీత్ సింగ్, మన్దీప్ సింగ్ మూడేసి గోల్స్ చేయగా...రూపిందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సునీల్, వివేక్ సాగర్ ఒక్కో గోల్ సాధించారు. -
రెండో వన్డేలో భారత మహిళల ఓటమి
నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలబడింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత భారత్ 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (42; 3 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (26 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ (3) సహా మిగతావారు నిరాశ పరిచారు. ప్రత్యర్థి బౌలర్లలో హజెల్, ఎకల్స్టన్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 29 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలుపొందింది. వ్యాట్ (47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూమౌంట్ (39 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే గురువారం జరుగనుంది. -
మరో గెలుపుపై గురి
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికాతో తొలి టి20లో రికార్డు ఛేదనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు శుక్రవారం ఇక్కడ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తిలతో పాటు కొత్తమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ కూడా రాణించడంతో మొదటి మ్యాచ్‌లో మన జట్టు ఏడు వికెట్లతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో భారత్ ముందంజ వేస్తుంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఓపెనర్ స్మృతి మంధాన కూడా సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఆఫ్ స్పిన్నర్ అనూజ పాటిల్ గత మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఎక్కువగా కెప్టెన్ నికెర్క్ పైనే ఆధారపడుతోంది. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మెరుగైతే తప్ప భారత్‌ను ఓడించలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
మరింత ప్రసారం కావాలి: హర్మన్‌ప్రీత్
మైసూరు: భారత పురుషుల క్రికెట్ జట్టుతో పాటే తమ మ్యాచ్‌లను కూడా మరింత ఎక్కువగా టీవీల్లో ప్రసారం చేస్తే బావుంటుందని భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ‘ప్రపంచకప్ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే చాలా మ్యాచ్‌లు టీవీల్లో ప్రత్యక్షంగా చూసి మా ఆటతీరును గమనించారు. ఒకవేళ మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఇలాగే టీవీల్లో చూపిస్తే అసలు మేం ఎలా ఆడుతున్నామో అభిమానులకు తెలుస్తుంది. ప్రపంచకప్‌కు ముందు మేం చాలా టోర్నీలను గెలిచాం. కానీ అవేవీ టీవీల్లో రాలేదు కాబట్టి అభిమానులకు తెలీదు. ఇప్పుడు వారు కూడా మా ఆటను మరింతగా చూడాలనుకుంటున్నారు’ అని హర్మన్‌ప్రీత్ తెలిపింది. -
విజయంతో ముగించారు
బెల్జియం జూనియర్ పురుషుల జట్టుపై భారత మహిళల జట్టు గెలుపు ఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. పటిష్టమైన బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (7వ, 11వ నిమిషాల్లో), కెప్టెన్ రాణి రాంపాల్ (13వ, 33వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ చేశారు. బెల్జియం జట్టుకు థిబాల్ట్ నెవెన్ (38వ నిమిషంలో), విలియమ్ వాన్ డెసెల్ (42వ నిమిషంలో), మథియాస్ రెలిక్ (48వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్‌కు చివరి రెండు క్వార్టర్స్‌లో గట్టిపోటీ ఎదురైంది. ఆఖరి పది నిమిషాల్లో బెల్జియం జట్టు స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా... గోల్‌కీపర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించి ప్రత్యర్థి జట్టు ఆశలను వమ్ము చేసింది. పది రోజుల ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. నెదర్లాండ్స్‌కు చెందిన డెన్ బాష్ జట్టు చేతిలో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా... బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. -
బెల్జియం అబ్బాయిలు... భారత అమ్మాయిలు
హాకీ ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ ఆంట్వర్ప్ (బెల్జియం): మహిళల జట్టు ప్రత్యర్థిగా మరో మహిళల జట్టు ఉండటం సహజం. కానీ తమ యూరోప్ పర్యటనలో భారత మహిళల జట్టు ప్రాక్టీస్ కోసం కొత్తగా ఆలోచించింది. మహిళల జట్టుతో కాకుండా బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో ఆడాలని నిర్ణయించుకుంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2–2తో బెల్జియం జూనియర్ పురుషుల జట్టును నిలువరించడం విశేషం. భారత్ నుంచి నిక్కీ ప్రధాన్ (36వ నిమిషంలో), వందన (54వ నిమిషంలో) గోల్స్ సాధించారు. ఆట 40వ సెకనులోనే కెప్టెన్ రాణికి పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కినా గోల్‌గా మలచలేకపోయింది. అటు ప్రత్యర్థికి ఆరు నిమిషాల వ్యవధిలోనే మూడు పెనాల్టీ కార్నర్లు లభించినా గోల్‌కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకుంది. ఆ తర్వాత 1–2తో వెనకబడిన దశలో భారత్‌ను చివర్లో వందన ఆదుకోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. -
మిథాలీ సేనపై ప్రశంసల ట్వీట్లు..
డెర్బీ: చావో రేవో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన కీలకపోరులో మిథాలీ సేన 186 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మిథాలీ అజెయ శతకం, వేద మెరుపు ఇన్నింగ్స్, గైక్వాడ్ స్పిన్ బౌలింగ్ ప్రదర్శనలపై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల ట్వీట్లతో ముంచెత్తారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ మిథాలీ రాజ్, వేద, రాజేశ్వరిలది గొప్ప ప్రదర్శనంటూ భారత మహిళలకు అభినందనలు తెలిపాడు. మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మహిళల బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేయగా గౌతమ్ గంభీర్ ఆల్‌దిబెస్ట్, మీ అందరికి మా మద్దతు ఉంటుందని ట్వీట్ చేశాడు. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ కివీస్‌ను క్లినికల్ ప్రదర్శనతో ఓడించారని పొగడాడు. భారత మహిళల ప్రదర్శన అద్భుతమని మనోజ్ తివారి ప్రశంసించాడు. సమిష్టీ ప్రదర్శనతో సెమీస్‌కు చేరడం గర్వంగా ఉందని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. ఇక హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ భారత స్పిన్‌కు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పుకూలింది. గైక్వాడ్ ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. మాజీ క్రికెటర్లు హర్భజన్, ఆకాశ్ చోప్రాలు సైతం భారత మహిళలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. Congratulations @BCCIWomen on the stunning win and making it to the semis. Great effort from @M_Raj03 ,Veda and Rajeshwari.#WWC17 — Virender Sehwag (@virendersehwag) July 15, 2017 Congratulations @BCCIWomen - Indian Women's Team! Best of luck for the semis, You have all our support! #WomensWorldCup2017 — Gautam Gambhir (@GautamGambhir) July 15, 2017 Indian bowlers spin a Web around the NZ batswomen -
250 దాటితే పెద్ద స్కోరే: మిథాలీ
న్యూఢిల్లీ: మహిళల వన్డేల్లో 250 పైచిలుకు పరుగులు చేస్తే భారీస్కోర్లేనని భారత మహిళా సారథి మిథాలీ రాజ్ తెలిపింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై సంచలన విజయంతో భారత్ ఐసీసీ ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ బాగా ఆడారు. ప్రపంచకప్ మ్యాచ్ అన్న సంగతి మరచి స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ఆడారు. సగం ఓవర్లకు పైగా వారే బ్యాటింగ్ కొనసాగించారు. అందువల్లే భారీస్కోరు సాధ్యమైంది. ఇలాంటి భాగస్వామ్యాలు ఇక ముందు కూడా సాధించాలని ఆశిస్తున్నా. శుభారంభాల్ని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణింపుతో భారీస్కోర్లుగా మలచుకోవచ్చు’ అని చెప్పారు. ప్రపంచ రికార్డు అర్ధసెంచరీలపై మాట్లాడుతూ... తనది రికార్డవుతుందన్న సంగతి తెలియదని, పరుగులు చేయడం, అవి జట్టుకు ఉపయోగపడటం ఆనందంగా ఉందని చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రపంచకప్‌లో మేటి జట్టుపై గెలిచి శుభారంభం చేయడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని పేర్కొంది. మహిళా క్రికెట్లో డీఆర్ఎస్ (నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టడం మంచిదేనని తెలిపింది. -
సమరానికి సిద్ధం
►వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటుతాం ►లోపాలు సరిదిద్దుకున్నాం ►విదేశాల్లో నిలకడగా ఆటతీరు ►భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మిథాలీ రాజ్... భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈమె ఇప్పుడు విజయ సారథి. ఓ కెప్టెన్‌గా ముందుండి నడిపించడమే కాదు... నిలకడగా గెలుపిస్తోంది. ఘన విజయాలతో దూసుకెళుతున్న మిథాలీ సేన లక్ష్యం ప్రపంచకప్. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్న ఆమె... క్రికెటర్లకు శారీరక ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా కీలకమంటోంది. తమజట్టు ఇప్పుడు బాగా రాటుదేలిందని, వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతామంది. ఇంకా ఏం చెప్పిందంటే... ఇపుడు విదేశీ గడ్డపైనా గెలుస్తున్నాం... గతంలో మేం విదేశీ పర్యటనల్లో తేలిపోయేవాళ్లం. గెలిచేందుకు ఆపసోపాలు పడ్డా చివరకు ఓటమే ఎదురయ్యేది. ఒకటి అరా గెలిచినా... సిరీస్ విజయాలేవీ లేవు. ఇప్పుడు అక్కడా నిలకడైన విజయాలు సాధిస్తున్నాం. ఇది జట్టుకు సానుకూలాంశం. ఆశావహ దృక్పథంతో ముందడుగు వేసేందుకు ఇలాంటి ఫలితాలు దారి చూపుతాయి. ఆట అభివృద్ధికి ఇదో అవకాశం... పురుషుల క్రికెట్‌లాగే ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ మ్యాచ్‌ల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుండటం సంతోషకరం. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇదో చక్కని వేదిక. ఇప్పుడు మా ఆటతీరుతో ప్రేక్షకులను ఆకర్షిస్తాం. భారత్‌లో మా ఆటకు ప్రజాదరణ పెంచేందుకు ఇది మంచి అవకాశం. ఈ ప్రపంచకప్ ద్వారా మేం ప్రముఖంగా నిలిచేందుకు, చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. విజయాల ఊపు కొనసాగించలేకే... గత ప్రపంచకప్‌లలో బాగా ఆడినా టైటిల్ గెలవలేకపోయాం. ప్రారంభ మ్యాచ్‌ల్లో చక్కని ప్రదర్శనతో గెలిచాం. తదనంతరం ఈ విజయాల జోరును కొనసాగించలేకపోయాం. దీంతో కీలకమైన మ్యాచ్‌ల్లో ఓడటం, టైటిల్ వేటకు దూరమవడం జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. జట్టు కూర్పు బాగుంది. వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లు గెలిచాం. ఫీల్డింగ్‌పై కన్నేశాం... బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బాగానే ఉన్నా... ఫీల్డింగ్ చాలా కీలకమైంది. ఇందులో ఎప్పటికప్పుడు మెరుగవ్వాల్సిందే. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ పరిస్థితుల్ని అప్పటికప్పుడు మార్చేయొచ్చు. శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక స్థైర్యం కూడా ఆటపై ప్రభావం చూపిస్తుంది. మెంటల్ ఫిట్నెస్తోనే ఎలాంటి ఎత్తిడినైనా అధిగమించవచ్చు. ముంబైలో శిబిరం ప్రపంచకప్‌కు ముందు మహిళల జట్టుకు ముంబైలో వచ్చే నెల 6 నుంచి 10 వరకు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెంటనే 11న ఇంగ్లండ్‌కు పయనమవుతుంది. అక్కడ కివీస్(19న), శ్రీలంక(21న)లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రధాన టోర్నీ జూన్ 24 నుంచి జరుగుతుంది. అదే రోజు ఇంగ్లండ్‌తో భారత మహిళలు తలపడతారు. -
మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్
వెస్ట్ వాంకోవర్ (కెనడా): హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) రౌండ్–2లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్ 4–0 గోల్స్‌తో బెలారస్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (13వ, ని. 58వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (20వ ని. 40వ ని.) రెండేసి గోల్స్ చేశారు. మరో సెమీస్‌లో ఉరుగ్వేపై 2–1తో గెలిచిన చిలీతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. తాజా సెమీస్ విజయంతో భారత జట్టు హెచ్‌డబ్ల్యూఎల్ సెమీఫైనల్ ఈవెంట్‌కు అర్హత సంపాదించింది. ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ (2018)కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఆ ఈవెంట్ ఈ ఏడాది జూన్ 21 నుంచి బెల్జియంలో జరుగనుంది. -
పాక్ పనిపట్టి... ఫైనల్‌కు
⇒టైటిల్ పోరుకు భారత మహిళల జట్టు ⇒పాకిస్తాన్‌పై ఏడు వికెట్లతో గెలుపు ⇒స్పిన్నర్ ఏక్తా (10–7–8–5) అద్భుత ప్రదర్శన ⇒మంగళవారం దక్షిణాఫ్రికాతో తుది సమరం కొలంబో: ఫేవరెట్ హోదాతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అదే స్థాయిలో ప్రదర్శన చేస్తూ... ఐసీసీ ప్రపంచకప్ వన్డే క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో నాలుగు విజయాలు, సూపర్ సిక్స్‌లో మూడు విజయాలు సాధించిన భారత్ అజేయ రికార్డుతో ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. సూపర్ సిక్స్ దశ తర్వాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్ (10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), శ్రీలంక (6 పాయింట్లు), పాకిస్తాన్ (4 పాయింట్లు) జట్లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. ఏక్తా మాయాజాలం... టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించగా... ఆ జట్టు 43.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ కళ్లు చెదిరే బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. 31 ఏళ్ల ఏక్తా 10 ఓవర్లలో 7 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. శిఖా పాండే రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ, దేవిక వైద్య, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఒక్కో వికెట్ లభించింది. పాక్ జట్టులో ఎక్స్‌ట్రాలే (24) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇద్దరు బ్యాట్స్‌విమెన్ అయేషా జఫర్ (19; 3 ఫోర్లు), బిస్మా మారూఫ్ (13; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత్ 22.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. దీప్తి శర్మ (29 నాటౌట్; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (24; 2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఆడిన తొమ్మిది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్‌నే విజయం వరించడం విశేషం. ఇతర సూపర్ సిక్స్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీలంక 42 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై, దక్షిణాఫ్రికా 36 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచాయి. -
భారత్ వైట్‌వాష్...
వెస్టిండీస్‌దే టి20 సిరీస్ మూడో మ్యాచ్‌లోనూ విజయం విజయవాడ స్పోర్ట్స: వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు అదే ప్రదర్శనను టి20 ఫార్మాట్లో పునరావృతం చేయడంలో విఫలమైంది. మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిన టీమిండియా సిరీస్‌ను 0-3తో కోల్పోరుుంది. టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ తమ హోదాకు తగ్గట్టు రాణించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూలపాడు స్టేడియంలో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (22 బంతుల్లో 47; 7 ఫోర్లు, ఒక సిక్సర్), స్టెఫానీ టేలర్ (55 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 61 పరుగులు జోడించి విండీస్‌కు శుభారంభం అందించారు.. హేలీ అవుటయ్యాక విండీస్ స్కోరు బోర్డు నెమ్మదించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా... జులన్ గోస్వామి, ఏక్తా బిష్త్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు సాధించి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వేద కృష్ణమూర్తి (40 బంతుల్లో 31 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. -
సిరీస్‌పై కన్నేసిన భారత్
విండీస్ మహిళలతో రెండో వన్డే నేడు సాక్షి, విజయవాడ స్పోర్ట్స: తొలి వన్డే విజయంతో జోరుమీదున్న భారత మహిళల జట్టు మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే రెండో వన్డేలో విజయం సాధించాలనే లక్ష్యంతో మిథాలీ సేన బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌తో పాటు వేద ఫామ్‌లో ఉంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఒత్తిడి విండీస్ జట్టుపై వుంది. దీంతో పాటు ఒక్క మ్యాచ్ గెలిచినా... ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశమూ వెస్టిండీస్‌ను ఊరిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచకప్‌కి అర్హత సాధించింది. -
ఒలింపియాడ్‌కు ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొనే భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూషకు తొలిసారి స్థానం లభించింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 14 వరకు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా (ఢిల్లీ), పద్మిని (ఒడిషా) జట్టులోని ఇతర సభ్యులు. -
క్వార్టర్స్‌లో భారత మహిళలు
* జర్మనీపైనా 5-0తో విజయం * ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షాన్ (చైనా): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో జర్మనీపై గెలిచింది. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన భారత్, జపాన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. జపాన్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. జర్మనీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 21-10తో ఫాబియెన్ డెప్రిజ్ను ఓడించి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-12తో లూస్ హీమ్పై గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 14-21, 21-9, 21-8తో లిండా ఎఫ్లెర్-లారా కెప్లెన్ జోడీపై నెగ్గడంతో భారత్‌కు 3-0తో విజయం ఖాయమైంది. గద్దె రుత్విక శివాని 21-5, 21-15తో యోన్ లీపై నెగ్గగా... సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-18, 19-21, 22-20తో ఇసాబెల్-ఫ్రాన్జిస్కా వోల్క్మన్ జంటపై విజయం సాధించడంతో భారత్ ఖాతాలో మరో క్లీన్‌స్వీప్ చేరింది. పురుషుల జట్టుకు నిరాశ మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్‌లో 2-3తో హాంకాంగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 13-21, 12-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో... రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 19-21, 12-21తో చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ జంట చేతిలో ఓడారు. మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23-21, 23-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్‌పై సంచలన విజయం సాధించాడు. నాలుగో మ్యాచ్‌లో సాత్విక్ -చిరాగ్ ద్వయం 10-21, 11-21తో చాన్ కిట్-లా చెక్ హిమ్ జోడీ చేతిలో ఓడటంతో భారత్‌కు 1-3తో ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 17-21, 21-19, 21-9తో వీ నాన్పై గెలిచాడు.