చెస్ ఒలింపియాడ్‌లో వరుసగా ఐదో విజయం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్లు వరుసగా ఐదో విజయం నమోదు చేశాయి. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2.5–1.5తో కజకిస్తాన్ జట్టుపై నెగ్గగా... భారత పురుషుల జట్టు 3–1తో అజర్‌బైజాన్ జట్టును ఓడించింది.
కజకిస్తాన్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో బిబిసారా అసయుబయేవా చేతిలో ఓడిపోయింది. అయితే భారత మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి 59 ఎత్తుల్లో మెరూర్ట్ కమలిదెనోవాపై, వంతిక అగర్వాల్ 51 ఎత్తుల్లో అలువా నుర్మాన్‌పై గెలిచారు. జెనియా బలబయేవాతో గేమ్‌ను ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి భారత విజయాన్ని ఖరారు చేసింది.
తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అజర్‌బైజాన్‌తో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 44 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్‌పై, దొమ్మరాజు గుకేశ్ 38 ఎత్తుల్లో అయిదిన్ సులేమాన్లిపై విజయం సాధించారు.
నిజాత్ అబసోవ్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 34 ఎత్తుల్లో... షఖిర్యార్ మమెదైరోవ్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 83 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని భారత్‌కు విజయాన్ని అందించారు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment