Mens team
-
భారత జట్ల దూకుడు
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్లు వరుసగా ఐదో విజయం నమోదు చేశాయి. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2.5–1.5తో కజకిస్తాన్ జట్టుపై నెగ్గగా... భారత పురుషుల జట్టు 3–1తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. కజకిస్తాన్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో బిబిసారా అసయుబయేవా చేతిలో ఓడిపోయింది. అయితే భారత మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి 59 ఎత్తుల్లో మెరూర్ట్ కమలిదెనోవాపై, వంతిక అగర్వాల్ 51 ఎత్తుల్లో అలువా నుర్మాన్‌పై గెలిచారు. జెనియా బలబయేవాతో గేమ్‌ను ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి భారత విజయాన్ని ఖరారు చేసింది. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అజర్‌బైజాన్‌తో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 44 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్‌పై, దొమ్మరాజు గుకేశ్ 38 ఎత్తుల్లో అయిదిన్ సులేమాన్లిపై విజయం సాధించారు. నిజాత్ అబసోవ్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 34 ఎత్తుల్లో... షఖిర్యార్ మమెదైరోవ్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 83 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని భారత్‌కు విజయాన్ని అందించారు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
ఎదురులేని భారత్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా నాలుగో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో ఫ్రాన్స్ జట్టుపై గెలుపొందింది. భారత పురుషుల జట్టు కూడా 3.5–0.5తో సెర్బియా జట్టుపై విజయం సాధించింది. ఫ్రాన్స్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 52 ఎత్తుల్లో డెమాంటి కార్నెపై, తానియా సచ్దేవ్ 50 ఎత్తుల్లో నటాషా బెన్మెస్బాపై, దివ్య దేశ్‌ముఖ్ 56 ఎత్తుల్లో మిత్రా హెజాజిపూర్పై గెలుపొందగా... సోఫీ మిలెట్తో జరిగిన గేమ్‌ను వైశాలి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వంతిక అగర్వాల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. సెర్బియాతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 40 ఎత్తుల్లో అలెగ్జాండర్ ఇందిక్పై, దొమ్మరాజు గుకేశ్ 85 ఎత్తుల్లో అలెగ్జాండర్ ప్రెడ్కిపై, విదిత్ సంతోష్ గుజరాతి 81 ఎత్తుల్లో వెలిమిర్ ఇవిచ్పై నెగ్గగా... అలెక్సీ సరానాతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
భారత జట్ల శుభారంభం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీలో మొరాకోతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–0తో గెలుపొందింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్, మహారాష్ట్ర గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొరాకో బలహీన ప్రత్యర్థి కావడంతో భారత బృందం ఈ మ్యాచ్‌లో గుకేశ్‌కు విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ గేముల్లో ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో మొహమ్మద్ తిసిర్‌పై, అర్జున్ 40 ఎత్తుల్లో ఎల్బియా జాక్వెస్‌పై, విదిత్ 28 ఎత్తుల్లో మెహదీ పియరీపై, హరికృష్ణ 33 ఎత్తుల్లో అనస్ మొయాద్‌పై విజయం సాధించారు. మరోవైపు జమైకా జట్టుతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో గెలుపొందింది. తొలి రౌండ్ గేముల్లో వైశాలి 29 ఎత్తుల్లో క్లార్క్ అడానిపై, తానియా సచ్దేవ్ 41 ఎత్తుల్లో గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 76 ఎత్తుల్లో రాచెల్ మిల్లర్‌పై విజయం సాధించగా... రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్ 53 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత స్టార్ ద్రోణవల్లి హారికకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆతిథ్యమిచి్చన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ సెమీఫైనల్ చేరింది. తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. 1990 నుంచి థామస్ కప్‌లో సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తున్నారు. అంతకుముందు మాత్రం సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా కాంస్య పతకం కోసం మ్యాచ్‌ను నిర్వహించేవారు. బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది. గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్ అయిన థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. థామస్ కప్‌లో సెమీఫైనల్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. నేడు జరిగే సెమీఫైనల్లో 2016 చాంపియన్ డెన్మార్క్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియాతో జపాన్ ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్ 3–2తో దక్షిణ కొరియాపై... జపాన్ 3–2తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3–0తో చైనాపై విజయం సాధించాయి. గెలిపించిన ప్రణయ్ మలేసియాతో పోటీలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–23, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–19, 21–15తో గో జె ఫె– నూరుజుద్దీన్ జోడీని ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ జోరు పెంచి ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–17తో ఎన్జీ జె యోంగ్‌పై గెలిచి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌లో చెలరేగిపోగా... రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. నాలుగో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట 19–21, 17–21తో ఆరోన్ చియా–తియో యె యి ద్వయం చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. తెలంగాణ ప్లేయర్ విష్ణువర్ధన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కృష్ణప్రసాద్ పోరాటపటిమ కనబరిచినా కీలకదశలో తడబడ్డారు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన హెచ్ఎస్ ప్రణయ్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 21–13, 21–8తో లియోంగ్ జున్ హావోపై నెగ్గడంతో భారత్ 3–2తో చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకుంది. స్కోరు 20–8 వద్ద ప్రణయ్ స్మాష్ షాట్ కొట్టి చివరి పాయింట్ రాబట్టిన వెంటనే భారత జట్టు సభ్యులందరూ ఆనందంతో కోర్టులోకి దూసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడింది. -
క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్లో వెల్లడించింది. దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్ ససెక్స్ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్(వికెట్ కీపింగ్ కోచ్)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్ సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
మహిళలే అధిగమించారు
మౌంట్ మాంగనుయ్: మహిళలు ఆకాశంలో సగమే కాదు... రికార్డుల్లోనూ ఘనమని చేతల్లో చాటారు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉన్న వరుస వన్డే విజయాల రికార్డును ఆ దేశ మహిళల క్రికెట్ జట్టు అధిగమించింది. న్యూజి లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా 22 వన్డేల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన 21 వరుస విజయాల రికార్డు తెరమరుగైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర 2018 మార్చి 12న మొదలైంది. ఈ క్రమంలో ఆసీస్ 3–0తో భారత్‌పై... 3–0తో పాకిస్తాన్‌పై... 3–0తో న్యూజిలాండ్‌పై... 3–0తో ఇంగ్లండ్‌పై... 3–0తో వెస్టిండీస్‌పై... 3–0తో శ్రీలంకపై... 3–0తో న్యూజిలాండ్‌పై గెలిచి 2020 అక్టోబర్ 7న ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డాన్ (90; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకుంది. కెప్టెన్ అమీ సాటెర్వైట్ (32; 3 ఫోర్లు), అమెలియా కెర్ (33; 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్ 4, నికోలా క్యారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అలీసా హీలీ (65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అష్లే గార్డ్నెర్ (53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెర్రీ (56 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. కివీస్ బౌలర్లలో జెస్ కెర్, హన్నా రోవ్, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
సౌత్‌జోన్ మహిళల త్రోబాల్ రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : సౌత్‌జోన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల జట్టు మూడో స్థానంలో నిలిచింది. రెండు విభాగాల్లోనూ తమిళనాడు జట్లు టైటిల్స్ సాధించాయి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌ల్ని నిర్వహించారు. మహిళల ఫైనల్లో తెలంగాణ జట్టు 15-11, 12-15, 13-15తో తమిళనాడు చేతిలో పోరాడి ఓడింది. అంతకుముందు సెమీస్‌లో తెలంగాణ 15-2, 15-10తో పుదుచ్చేరిపై, తమిళనాడు 15-5, 15-4తో ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు 10-15, 15-10, 15-10తో పుదుచ్చేరిపై గెలిచింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఫైనల్లో ఏపీ 15-17, 15-12, 6-15తో తమిళనాడు చేతిలో ఓడింది. సెమీస్‌లో ఏపీ 15-6, 15-10తో పుదుచ్చేరిపై, తమిళనాడు 16-14, 15-13తో తెలంగాణపై గెలుపొందాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 15-6, 15-10తో పుదుచ్చేరిపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి ప్రేమ్‌రాజ్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి సోమిరెడ్డి, డీపీఎస్ చైర్మన్ కొమరయ్య, ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, వినోద్ రెడ్డి, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వ్కాష్ లో భారత్ సరికొత్త చరిత్ర
ఇంచియాన్:స్వ్కాష్ లో భారత పురుషల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ మలేషియాతో తలపడిన భారత టీం 2-0 తేడాతో పరిపూర్ణ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మహిళల ఈవెంట్ లో తొలిసారి రజతాన్ని చేజిక్కించుకున్న భారత్.. పురుషుల ఈవెంట్ లో కూడా మెరిసి పసిడిని కూడా తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీం ఈవెంట్ లో సౌరవ్ ఘోశల్, హరివిందర్ పాల్ సింగ్ ,కుశ్ కౌర్, మహేష్ మనోన్కర్ లు భారత్ కు స్వర్ణాన్ని సాధించిపెట్టారు. ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు మూడు స్వర్ణాలు లభించాయి.