చెస్ ఒలింపియాడ్‌లో వరుసగా నాలుగో విజయం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా నాలుగో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో ఫ్రాన్స్ జట్టుపై గెలుపొందింది. భారత పురుషుల జట్టు కూడా 3.5–0.5తో సెర్బియా జట్టుపై విజయం సాధించింది.
ఫ్రాన్స్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 52 ఎత్తుల్లో డెమాంటి కార్నెపై, తానియా సచ్‌దేవ్ 50 ఎత్తుల్లో నటాషా బెన్‌మెస్బాపై, దివ్య దేశ్‌ముఖ్ 56 ఎత్తుల్లో మిత్రా హెజాజిపూర్‌పై గెలుపొందగా... సోఫీ మిలెట్‌తో జరిగిన గేమ్‌ను వైశాలి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వంతిక అగర్వాల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
సెర్బియాతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 40 ఎత్తుల్లో అలెగ్జాండర్ ఇందిక్‌పై, దొమ్మరాజు గుకేశ్ 85 ఎత్తుల్లో అలెగ్జాండర్ ప్రెడ్కిపై, విదిత్ సంతోష్ గుజరాతి 81 ఎత్తుల్లో వెలిమిర్ ఇవిచ్‌పై నెగ్గగా... అలెక్సీ సరానాతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment