చెస్ ఒలింపియాడ్ తొలి రౌండ్‌లో గెలిచిన పురుషుల, మహిళల జట్లు
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీలో మొరాకోతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–0తో గెలుపొందింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్, మహారాష్ట్ర గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మొరాకో బలహీన ప్రత్యర్థి కావడంతో భారత బృందం ఈ మ్యాచ్‌లో గుకేశ్‌కు విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ గేముల్లో ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో మొహమ్మద్ తిసిర్‌పై, అర్జున్ 40 ఎత్తుల్లో ఎల్బియా జాక్వెస్‌పై, విదిత్ 28 ఎత్తుల్లో మెహదీ పియరీపై, హరికృష్ణ 33 ఎత్తుల్లో అనస్ మొయాద్‌పై విజయం సాధించారు. మరోవైపు జమైకా జట్టుతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో గెలుపొందింది.
తొలి రౌండ్ గేముల్లో వైశాలి 29 ఎత్తుల్లో క్లార్క్ అడానిపై, తానియా సచ్‌దేవ్ 41 ఎత్తుల్లో గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 76 ఎత్తుల్లో రాచెల్ మిల్లర్‌పై విజయం సాధించగా... రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్ 53 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత స్టార్ ద్రోణవల్లి హారికకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆతిథ్యమిచి్చన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment