chess olympiad
-
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్‌లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్‌లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్‌గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్‌ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్‌లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
ప్రపంచ మూడో ర్యాంకర్‌గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్‌లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్‌లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్‌లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్‌వన్‌గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్‌కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్‌లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్‌గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్‌గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్‌లో, వైశాలి 15వ ర్యాంక్‌లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్‌లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్‌లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్‌లో, సవితాశ్రీ 99వ ర్యాంక్‌లో నిలిచారు. -
తిరంగాతో భారత్‌కు పాక్ విషెస్.. హాకీ ఆటగాళ్లలా కాదు!
చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ విజయోత్సవాల సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి తొలిసారి పసిడి పతకాలు అందించిన అనంతరం భారత పురుషుల జట్టు సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ క్రీడాకారులుమ సంతోషాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలో.. పాకిస్తాన్ టీమ్ సైతం త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ.. టీమిండియాను విష్ చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రశంసలు, విమర్శలుక్రికెట్, హాకీ, టెన్నిస్.. క్రీడ ఏదైనా మ్యాచ్ జరుగుతున్న వేళ అభిమానులు భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. మ్యాచ్ ఫలితం ఆధారంగా ఆయా జట్ల ఆటగాళ్లపై ప్రశంసలు, విమర్శలు కురుస్తాయి. ఇక ఇటీవల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ స్టేజిలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. సెమీ ఫైనల్‌కు చేరినా అక్కడ చైనా చేతిలో పరాజయం పాలైంది. పాక్ హాకీ ఆటగాళ్లు చైనా జెండాలతోమూడోస్థానం కోసం పోటీపడి కాంస్యాన్ని దక్కించుకుంది. అయితే, ఫైనల్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు వ్యవహరించినతీరు విమర్శలకు తావిచ్చింది. భారత్- చైనా టైటిల్ కోసం పోటీపడుతున్న వేళ.. పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు చైనా జెండాలు చేతబట్టి ఆ జట్టుకు తమ మద్దతు ప్రకటించారు. తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో.. వారి ముఖాలు వాడిపోయాయి. అయితే, చెస్ ఒలింపియాడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించడం విశేషం. భారత జట్టుతో కలిసి పాక్ టీమ్ తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటింది.స్వర్ణ చరిత్రఇక భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా- పాక్ ప్లేయర్ అర్షద్ నదీం సైతం తమ స్నేహబంధంతో ఇరు దేశాల అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే.బుడాపెస్ట్‌లో జరిగిన మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది.మరోవైపు.. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.చదవండి: ‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’Pakistani Chess Team with the Champions of Chess Olympiad 2024 - Team India!#chess #chessbaseindia #ChessOlympiad2024 #india pic.twitter.com/LHEveDvEOt— ChessBase India (@ChessbaseIndia) September 26, 2024 -
‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’
న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేకంగా అభినందించారు. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్లుగా నిలిచి భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ప్లేయర్లను మన్‌సుఖ్‌తోపాటు కేంద్ర క్రీడా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే గురువారం న్యూఢిల్లీలో సన్మానించారు. ‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం ద్వారా దేశ ప్రజలను గర్వపడేలా చేశారు. దీంతో పాటు వారసత్వ క్రీడలో మన సత్తా ఏంటో నిరూపించారు. ఏ ఆటలోనైనా నైపుణ్యాన్ని గుర్తించి వారికి అండగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న క్రమంలో క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించే విజయాలు దేశానికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయి. ఒలింపియాడ్‌లో పతకాలు నెగ్గిన ప్లేయర్లు దేశంలో యువతరానికి బ్రాండ్ అంబాసిడర్ల వంటి వాళ్లు’ అని మాండవీయ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాగా.. ఈ ప్రదర్శనతో దేశంలో చిన్నారులు, యువతలో ఆటల పట్ల ఆకర్శణ మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొమ్మరాజు గుకేశ్, ద్రోణవల్లి హారికలతో మాండవీయ సరదాగా చెస్ ఆడారు. స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్ల సభ్యులకు కేంద్ర క్రీడా శాఖ రూ. 20 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని చెక్‌ల రూపంలో అందించింది. -
Erigaisi Arjun: తడబాటు నుంచి తారాస్థాయికి...
స్వీయ అంచనాలతో పాటు... ఫలితాల ఒత్తిడితో సతమతమై కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... వాటిని పక్కన పెట్టడం వల్లే విజయవంతం అయ్యానని వెల్లడించాడు. ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఓరుగల్లు కుర్రాడు ఇక మీదట కూడా ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా... అందులో తన వంతు పాత్ర ఉండటం ఆనందంగా ఉందని 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ఒలింపియాడ్‌లో ఆడిన 11 గేమ్‌ల్లో తొమ్మిదింట నెగ్గిన అర్జున్... వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి దూసుకెళ్లాడు. చెస్ ఒలింపియాడ్ ప్రదర్శన, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అర్జున్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అతిగా ఆలోచించి... ఒత్తిడిని అధిగమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే 2021లో నా ఎలో రేటింగ్ పాయింట్లు 2500 ఉండేవి. కానీ నా సామర్థ్యం కచ్చితంగా అంతకన్నా ఎక్కువే అని నమ్మేవాడిని. ఇక రెండేళ్లు తిరిగేసరికి 2023లో ఎలో రేటింగ్ 2700కు చేరింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టంగా గడించింది. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైంది క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక కాకపోవడం. చాన్నాళ్లుగా ఆ టోర్నీలో ఆడాలని అనుకుంటూ వచ్చా. అయితే గత ఏడాది దానికి అర్హత సాధించలేకపోవడం బాధించింది. ఒకప్పుడు సొంత అంచనాలతో సతమతమయ్యేవాడిని. ఎక్కువ ఊహించేసుకొని గందరగోళానికి గురయ్యే వాడిని. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం నా ఆటతీరుపై ప్రభావం చూపింది. దాన్ని మార్చుకోవడం అంత సులువుకాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. ఫలితాలను పట్టించుకోవడం మానేశా. ఏదో సాధించాలని తీవ్రంగా కోరుకుంటూ నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటున్నానని అర్థం చేసుకున్నా. వాటిపై దృష్టి పెట్టడం వదిలేశాక మెరుగైన పలితాలు రావడం ప్రారంభమైంది. అదే అతిపెద్ద లక్ష్యం! ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే నా అతిపెద్ద లక్ష్యం. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ ముందుకు సాగుతున్నా. ఒక టోర్నమెంట్లో బరిలోకి దిగితే దాని గురించే ఆలోచిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సానుకూల ఫలితం సాధించాలనుకుంటా. ప్రస్తుతం మన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దీన్ని చదరంగంలో మన ‘గోల్డెన్ ఎరా’గా చెప్పుకొవచ్చు. నాతో పాటు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మేమంతా స్నేహితులం గుకేశ్, ప్రజ్ఞానందతో మంచి అనుబంధం ఉంది. చాన్నాళ్లుగా కలిసి ఆడుతుండటంతో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఒకరికి ఒకరం అండగా నిలుస్తాం. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇది ఎంతగానో దోహద పడుతుంది. 2003 నుంచి 2006 మధ్య జన్మించిన వాళ్లమే జట్టులో ఎక్కువ మంది ఉన్నాం. అందులో నేనే పెద్దవాడిని. ప్రస్తుతం మన దశ నడుస్తోంది. స్వతహాగా నేను టీమ్ ఈవెంట్లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతా. గ్లోబల్ చెస్ లీగ్ (జీఎస్ఎల్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చెస్ ఐపీఎల్ గ్లోబల్ చెస్ లీగ్‌ను చదరంగ ఐపీఎల్ అని భావిస్తా. సమష్టి ప్రదర్శనలు అంటే నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫార్మాట్లో జరగనున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ లీగ్‌లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. నల్ల పావులతో ఆడి విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు... తెల్ల పావులతో గెలిస్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు. అంటే తెల్ల పావులతో ఆడిన సహచరుడు పరాజయం పాలైతే... ప్రత్యర్థి జట్టు పాయింట్లను అందుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనివల్ల ‘డ్రా’ల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకే ఈ ఫార్మాట్ నన్ను బాగా ఆకర్షించింది. గత జీఎస్‌ఎల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్తో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగడం చాలా సంతోషంగా అనిపించింది. కార్ల్సన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ఏడాది భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జట్టు తరఫున ఆడనున్నా. నా ఆటపై ఎంతో ప్రభావం చూపిన గురువు లాంటి విశ్వనాథన్ ఆనంద్‌తో సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా. మానసికంగా సిద్ధమయ్యా... ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. ఫలానా టోర్నీలో ఫలానా ఆటగాడిపై తప్పక గెలవాలని అనుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. ఆ తర్వాత అత్యుత్తమ ఆటతీరు కనబరిస్తే ఫలితం కూడా అందుకు తగ్గట్లే ఉంటుందనే విషయం గ్రహించా. ఇది చెప్పినంత సులభం కాదు. ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. గత ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం చాలా బాధించింది. ఈ ఏడాది చాలా బాగా గడిచింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. -
మీ ప్రదర్శన అద్భుతం
న్యూఢిల్లీ: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన భారత చాంపియన్ గ్రాండ్‌మాస్టర్లు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో పసిడి పతకాలు సాధించి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన పురుషులు, మహిళల జట్లను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. అందరితోనూ చనువుగా మాట్లాడిన మోదీ వారి ప్రదర్శనను ఆకాశానికెత్తారు. మహిళా గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, మూడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, ఆర్.ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతిలతో ప్రధాని ముచ్చటించారు. 11 గేమ్లకుగాను 10 గేముల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన దొమ్మరాజు గుకేశ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలతో కలిసి మోదీ గేమ్ ఆడారు. అనంతరం విజేత సభ్యులంతా కలిసి తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన చెస్ బోర్డును ప్రధానికి అందజేశారు. ప్లేయర్లతో ప్రధాని ముఖా ముఖీ వీడియోను క్రీడాశాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డిఫెండింగ్ టైటిల్‌ను వదిలేసి... ప్రధానితో ప్రత్యేక భేటీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకోరాదనే ఉద్దేశంతో విదిత్ సంతోష్ గుజరాతి అజర్బైజాన్ టోర్నీ నుంచి వైదొలగి హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చాడు. గతేడాది బాకులో జరిగిన వుగార్ గాషిమోవ్ మెమోరియల్ చెస్ సూపర్ టోర్నమెంట్లో విదిత్ విజేతగా నిలిచాడు. టైటిల్ నిలబెట్టుకునేందుకు బాకు చేరుకున్న అతనికి ప్రధాని భేటీకి సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో ఉన్నపళంగా డిఫెండింగ్ చాంపియన్íÙప్ను వదిలేసి ఢిల్లీకి పయనమై కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఏఐసీఎఫ్ నజరానా రూ. 3 కోట్ల 20 లక్షలు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్లకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ. 3 కోట్ల 20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత పురుషుల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున.... భారత మహిళల జట్టులోని ఐదుగురికి రూ. 25 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ ప్రకటించారు.పురుషుల జట్టు కోచ్, కెప్టెన్ శ్రీనాథ్ నారాయణన్‌కు, మహిళల జట్టు కోచ్, కెప్టెన్ అభిజిత్ కుంతేకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. భారత బృందం చీఫ్ దివ్యేందు బారువాకు రూ. 10 లక్షలు, అసిస్టెంట్ కోచ్‌లకు రూ. 7 లక్షల 50 వేల చొప్పున లభిస్తాయి. -
ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌పై దృష్టి
చెన్నై: చెస్ ఒలింపియాడ్ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. నవంబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనీస్ గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్గుకేశ్ ప్ టైటిల్ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్‌ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్‌లో గుకేశ్, లిరెన్‌ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ హంగేరిలో ముగిసిన చెస్ ఒలింపియాడ్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పురుషుల టీమ్ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్‌పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్‌గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్‌లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఒలింపియాడ్‌లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఘనస్వాగతం అంతకుముందు బుడాపెస్ట్ నుంచి చెస్ ఒలింపియాడ్ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్‌లకు చెన్నైలో చెస్ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్ ఒలింపియాడ్‌లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్లకు ఢిల్లీ చెస్ సంఘం అధికారులు, హైదరాబాద్‌లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. -
Harika Dronavalli: ఖమ్మం కోడలు బంగారం!
ఖమ్మం స్పోర్ట్స్: చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన ద్రోణవల్లి హారికకు జిల్లా క్రీడాకారులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. అయితే, జట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ద్రోణవల్లి హారిక ఖమ్మం కోడలే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కాగా, ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్‌తో 2018లో వివాహం జరిగింది. తొలినాళ్ల నుంచి అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి సారించిన ఆమెకు 2022లో కుమార్తె జన్మించింది. అయినప్పటికీ భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్న హారిక ఇప్పుడు చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటడం విశేషం. -
చెస్ ఒలింపియాడ్–2024.. చెస్ ‘క్వీన్స్’
‘చెస్ అనేది ఆర్ట్. ఆట, సైన్స్‌ల సమాహారం’ అంటారు. ఆ విషయం ఎలా ఉన్నా... చెస్ అనేది ఆత్మవిశ్వాస సంకేతం. ఆ ఆత్మవిశ్వాస శక్తితోనే చెస్ ఒలింపియాడ్–2024(బుడాపెస్ట్, హంగెరి)లో మన మహిళా మణులు సత్తా చాటారు. చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో తొలి స్వర్ణం సాధించారు. మన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి రమేష్‌బాబు, వంతిక ఆగర్వాల్, తానియా సచ్దేవ్లు సత్తా చాటారు. స్వర్ణకాంతులతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు..ఆమె విజయ రహస్యంమహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పుట్టింది దివ్యా దేశ్‌ముఖ్. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. తండ్రి తరచు చెస్‌బోర్డ్ ముందు కూర్చొని కనిపించేవాడు. ఆ దృశ్యాలను పదే పదే చూసిన దివ్యకు చెస్‌పై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి కాస్తా నైపుణ్యంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ‘వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్’ టైటిల్ గెలుచుకుంది.తన ఆట తీరుతో ఎన్నోసార్లు ‘అమేజింగ్ పర్ఫార్మెన్స్’ అనిపించుకున్న దివ్యా దేశ్‌ముఖ్ ‘గంటల కొద్దీ ్రపాక్టీస్, తల్లిదండ్రుల నిరంతర ్రపోత్సాహమే నా విజయ రహస్యం’ అంటోంది.ఆ క్షణం నుంచి...ఏడున్నర సంవత్సరాల వయసులో తొలిసారిగా చెస్ బోర్డ్‌ను టచ్ చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వంతిక అగర్వాల్. ఆ టచ్ చేసిన ముహూర్తం ఎలాంటిదోగాని ఆ క్షణం నుంచే చెస్ ఆటే తన రూట్ అయింది. స్కూల్లో ఫ్రెండ్స్‌తో, ఇంట్లో సోదరుడు విశేష్‌తో చెస్ ఆడేది. చెస్ కెరీర్ ్రపారంభంలోనే ఎన్నో ట్రోఫీలు గెలుచుకొని ‘ఔరా’ అనిపించింది. రోజుకు ఎనిమిది గంటలు చెస్ ్రపాక్టీస్ చేస్తుంది. పోద్దున యోగా చేయడం, సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడడం తప్పనిసరి. మొదట్లో గేమ్‌లో ఓటమిని తట్టుకోలేకపోయేది. ఏడ్చేది కూడా. ఏడుస్తూ నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తనలో గెలుపు, ఓటములను సమంగా చూసే పరిణతి వచ్చింది. ‘నేను ఏమాత్రం నిరాశగా కనిపించినా అమ్మ నాలో ధైర్యం నింపుతుంది. యస్...నువ్వు సాధించగలవు అంటుంది. ఆమె నాకు కొండంత అండ’ అంటుంది వంతిక అగర్వాల్.హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్2005లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన తానియా సచ్దేవ్ దిల్లీలో పుట్టి పెరిగింది. తానియా సచ్‌దేవ్‌కు ఆరేళ్ల వయసులో తల్లి అంజు ద్వారా చెస్ పరిచయం అయింది. తానియా తల్లి బ్యాడ్మింటన్, తండ్రి ఫుట్‌బాల్ ఆడేవారు. ఈ రెండు ఆటలు కాకుండా తానియాకు చెస్ పరిచయం చేయడం యాదృచ్ఛికమే అయినా ఆ చెస్ తనని ఎక్కడికో తీసుకెళ్లింది. 2007లో మహిళల ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది తానియ.‘చెస్‌లో స్టార్‌గా రాణించడం ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతిభ కాదు. కష్టపడితే అందరికి సాధ్యమే’ అంటున్న తానియా సచ్దేవ్ గ్యారీ కాస్పరోవ్ మాట ‘హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్’ను పదే పదే గుర్తు తెస్తుంటుంది.ఆరోజు నుంచి వైశాలి జీవితమే మారిపోయింది!చెన్నైలో పుట్టింది వైశాలి రమేష్‌బాబు. తల్లి గృహిణి. తండ్రి టీఎన్ఎస్సీ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. ఆమె సోదరుడు ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్. చిన్నప్పుడు వైశాలి టీవీకి అతుక్కుపోయేది. చివరికి అదొక వ్యసనంగా మారింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వైశాలిని చెస్ క్లాసులకు పంపించారు.‘నేను వెళ్లను’ అని వైశాలి మారాం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘అలాగే’ అంటూ వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చేసింది. 2012లో గర్ల్స్ వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ (అండర్–12), 2016లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐయం) టైటిల్ గెలుచుకుంది. చెస్‌లో తొలి పాఠం నుంచి ‘గ్రాండ్ మాస్టర్’ టైటిల్ సొంతం చేసుకోవడం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. ఆటకు సంబంధించిన ఇన్‌స్పిరేషన్‌ను ది గ్రేట్ విశ్వనాథన్ ఆనంద్ నుంచి మాత్రమే కాదు తన సోదరుడు ప్రజ్ఞానంద నుంచి కూడా తీసుకుంటుంది. ‘అతడికి ఓపిక ఎక్కువ. గెలుపు, ఓటములను ఒకేరకంగా తీసుకుంటాడు. ఓర్పు నుంచి స్థితప్రజ్ఞత వరకు ప్రజ్ఞ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి’ అంటుంది వైశాలి.కుటుంబ బలం పరిచయం అక్కర్లేని పేరు హారిక ద్రోణవల్లి. ఎంతోమంది ఔత్సాహికులకు ఈ గ్రాండ్ మాస్టర్ స్ఫూర్తిగా మారింది. చెన్నైలో ‘చెస్ ఒలింపియాడ్’ జరుగుతున్న టైమ్‌లో హారిక తొమ్మిది నెలల గర్భిణి. అయినప్పటికీ పోటీలో పాల్గొని జట్టుకు కాంస్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని టఫెస్ట్ టీమ్‌లు ఏమిటో, ఇండియా టీమ్‌లోని స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటో హారికకు బాగా తెలుసు. బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు.‘మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత కాలం చెస్‌ను కొనసాగించవచ్చు. వయసు ముఖ్యం కాదు. నేను బాగా ఆడగలుగుతున్నాను అనిపించినంత కాలం ఆడతాను. కుటుంబ బలం నా అదృష్టం’ అంటోంది హారిక. -
భారత చెస్‌పై ఆనంద్ ఎఫెక్ట్
‘చదరంగపు సంస్కృతి కనిపించని దేశం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రపంచ చాంపియన్ కావడమే కాదు, ఆటపై ఆసక్తి పెంచుకొని దానిని ముందుకు తీసుకెళ్లగలిగేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా నమ్మలేని విషయం, అసాధారణం. ఆ దిగ్గజమే విశ్వనాథన్ ఆనంద్’... భారత జట్టు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన తర్వాత టాప్ చెస్ ప్లేయర్, ప్రపంచ 2వ ర్యాంకర్ నకముర ఆనంద్ గురించి చేసిన ప్రశంస ఇది. భారత చెస్ గురించి తెలిసిన వారెవరైనా ఈ మాటలను కాదనలేరు. ఆటగాడిగా మన చదరంగంపై ఆనంద్ వేసిన ముద్ర అలాంటిది. చెస్ క్రీడను పెద్దగా పట్టించుకోని సమయంలో 19 ఏళ్ల వయసులో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన ఆనంద్... ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్త తరానికి బ్యాటన్‌ను అందించి సగర్వంగా నిలిచాడు. ఆనంద్ జీఎంగా మారిన తర్వాత ఈ 36 ఏళ్ల కాలంలో మన దేశం నుంచి మరో 84 మంది గ్రాండ్మాస్టర్లుగా మారగా... ఇందులో 30 మంది తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం. ‘వాకా’తో విజయాలు... నాలుగేళ్ల క్రితం ఆనంద్ తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మెల్లగా తాను ఆడే టోర్నీల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయమది. తన ఆట ముగిసిపోయాక భవిష్యత్తులో ప్రపంచ చెస్‌లో భారత్ స్థాయిని కొనసాగించేలా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భావించాడు. ఈ క్రమంలో వచ్చి0దే చెస్ అకాడమీ ఏర్పాటు ఆలోచన. చెన్నైలో వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)ని అతను నెలకొల్పాడు. ఇక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అద్భుత ఫలితాలను అందించి ఆనంద్ కలలకు కొత్త బాట వేసింది. దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి ఇందులో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి కూడా ఇక్కడ శిక్షణ పొందాడు. ‘విషీ సర్ లేకపోతే ఇవాళ మేం ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదు’... గుకేశ్, ప్రజ్ఞానంద తరచుగా చెబుతూ రావడం వారి కెరీర్ ఎదుగుదలలో ఆనంద్ పాత్ర ఏమిటో చెబుతుంది. యువ చెస్ ఆటగాళ్ల కెరీర్ దూసుకుపోవడంలో తల్లిదండ్రులు, ఆరంభంలో కోచింగ్ ఇచ్చిన వారి పాత్రను ఎక్కడా తక్కువ చేయకుండా వారిపైనే ప్రశంసలు కురిపించిన ఆనంద్ ‘వాకా’తో తాను ఎలా సరైన మార్గ నిర్దేశనం చేశాడో ఒలింపియాడ్ విజయానంతరం వెల్లడించాడు. జూనియర్ దశను దాటుతూ... యువ ఆటగాళ్లను విజయాల వైపు సరైన దిశలో నడిపించడం అకాడమీ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమని అతను చెప్పాడు. తన కెరీర్ ప్రారంభంలో సోవియట్ యూనియన్‌లో ఉన్న చెస్ సంస్కృతిని చూసి అకాడమీ ఆలోచన వచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నాడు. అక్కడ దిగువ స్థాయికి పెద్ద ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఈ అకాడమీలు సంధానకర్తలుగా వ్యవహరిస్తాయని అతను వెల్లడించాడు. ‘భారత ఆటగాళ్లు ర్యాంకింగ్‌పరంగా తరచుగా టాప్–200లోకి దూసుకొస్తున్నారు.కానీ టాప్–100లోకి మాత్రం రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతిభావంతులను ఆ దిశగా సాధన చేయించడం ముఖ్యమని భావించా. వారి విజయాల్లో మా పాత్రను పోషించడం సంతృప్తినిచ్చే విషయం’ అని ఆనంద్ తన అకాడమీ ప్రాధాన్యతను గురించి పేర్కొన్నాడు. 14 ఏళ్ల కంటే ముందే గ్రాండ్మాస్టర్లుగా మారిన ఆటగాళ్లను ఆనంద్ తన అకాడమీలోకి తీసుకున్నాడు. జూనియర్ స్థాయిలో సంచలనాలు సాధించి సీనియర్‌కు వచ్చేసరికి ఎక్కడా కనిపించకపోయిన ప్లేయర్లు చాలా మంది ఉంటారు. అలాంటిది జరగకుండా జూనియర్ స్థాయి విజయాలను సీనియర్‌లోనూ కొనసాగిస్తూ పెద్ద విజయాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని ఆనంద్ చెప్పుకున్నాడు. అనూహ్య వేగంతో... ‘నా తొలి గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లంతా గొప్పగా రాణిస్తున్నారు. నిజానికి వీరు తొందరగా శిఖరానికి చేరతారని నేనూ ఊహించలేదు. వారు మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నా గానీ అదీ ఇంత వేగంగా, నమ్మశక్యం కానట్లుగా జరిగింది’ అంటూ యువ ఆటగాళ్లపై ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్ను ప్రకటించలేదు. తనకు నచ్చిన, ఎంపిక చేసిన టోర్నీల్లోనూ అతను ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితం స్పెయిన్‌లో జరిగిన లియోన్ మాస్టర్స్‌లో అతను విజేతగా కూడా నిలిచాడు. ఒకవైపు ప్లేయర్‌గా కొనసాగుతూ మరో వైపు యువ ప్లేయర్లకు అతను మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా భారత జట్టుకు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచే సత్తా ఉందంటే అది ఈ జట్టుతోనే సాధ్యం అని ఒలింపియాడ్‌కు వెళ్లే ముందే ఆనంద్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించాడు. టీమ్‌లోని ఆటగాళ్లపై అతను చూపిన విశ్వాసం అది. దానిని వారంతా నిజం చేసి చూపించారు. ‘భారత చెస్‌లో అద్భుత సమయం నడుస్తోంది. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మనం కచ్చితంగా మంచి విజయాలు ఆశిస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే వారు మనందరి అంచనాలకు మించి రాణించారు. మున్ముందు ఇవి కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ఆనంద్ భావోద్వేగంతో అన్నాడు.ఒలింపియాడ్ బహుమతి ప్రదానోత్సవంలో ఆనంద్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. అతడిని వేదికపైకి ఆహా్వనిస్తూ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆనంద్‌ను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ చెస్ బూమ్’ అంటూ ప్రశంసలు కురిపించడం అతని విలువను చాటి చెప్పింది. ప్రధానమంత్రి ప్రశంస చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణాలు సాధించిన పురుషుల, మహిళల జట్ల ఘనతను ఆయన కొనియాడారు. ‘45వ చెస్ ఒలింపియాడ్‌లో అటు ఓపెన్, ఇటు మహిళల విభాగాల్లో టైటిల్స్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ రెండు టీమ్‌లకు కూడా నా అభినందనలు. భారత క్రీడల్లో ఇదో సరికొత్త అధ్యాయం. చెస్‌లో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉన్న ఉత్సాహవంతులకు కొన్ని తరాల పాటు ఈ ఘనత స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ అన్నారు. -
బంగారం... మన చదరంగం
బుడాపెస్ట్: ప్రపంచ చదరంగ సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైతే చెస్ ఒలింపియాడ్‌లో బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని భారత క్రీడాకారులు దర్జాగా పూర్తి చేశారు. ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తులు వేశారు. తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరసి ఇన్నాళ్లూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి. » ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి. » గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి. » వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. » చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా... భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. » పురుషుల 11వ రౌండ్ గేముల్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెల్పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్ డెమ్చెంకోపై నెగ్గగా... మాతెజ్ సబెనిక్తో జరిగిన గేమ్‌ను విదిత్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. » మహిళల 11వ రౌండ్ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్ బలజయేవాపై గెలుపొందగా... ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. » గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా... భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.కల నిజమైంది చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రస్థానం 13 ఏళ్ల వయస్సులో 2004లో మొదలైంది. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు నా స్వర్ణ స్వప్నం సాకారం అయింది. స్వదేశంలో 2022లో జరిగిన ఒలింపియాడ్‌లో పసిడి పతకం సాధించే అవకాశాలున్నా ఆఖర్లో తడబడి చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాం. కానీ ఈసారి ఆఖరి రౌండ్లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడి ‘బంగారు’ కలను నిజం చేసుకున్నాం. ఈసారి ఒలింపియాడ్‌కు నేను ప్రత్యేక సన్నాహాలు చేయకుండానే బరిలోకి దిగాను. ఈ మెగా టోర్నీలో నా అపార అనుభవం ఉపయోగపడింది. నాతోపాటు దివ్య, వంతిక, వైశాలి, తానియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాం. పటిష్ట జట్లతో ఆడి పోరాడి గెలిచాం. ఈ స్వర్ణ పతకానికి మేమందరం అర్హులం. –‘సాక్షి’తో హారిక -
శెభాష్ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్‌మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు, క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్లో భారత్ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి స్వర్ణం లాంఛనమే కావచ్చు. బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్ బృందం మరో రౌండ్ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్లో మాత్రం ఉజ్బెకిస్తాన్ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ 2–2తో ‘టై’గా ముగిసింది. శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్ గుజరాతి... లెవొన్ అరోనియన్‌తో గేమ్ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్... లినియార్ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్... ని షిఖన్ను ఓడించడంతో భారత్ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్ తర్వాతే మహిళల జట్టు స్థానం ఖరారవుతుంది. -
Chess Olympiad 2024: చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో...
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్ మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు, క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్లో భారత్ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి స్వర్ణం లాంఛనమే కావచ్చు. బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్ బృందం మరో రౌండ్ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్లో మాత్రం ఉజ్బెకిస్తాన్ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ 2–2తో ‘టై’గా ముగిసింది. శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్ గుజరాతి... లెవొన్ అరోనియన్‌తో గేమ్ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్... లినియార్ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్... ని షిఖన్ను ఓడించడంతో భారత్ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్ తర్వాతే మహిళల జట్టు స్థానం ఖరారవుతుంది. -
పురుషుల జట్టుకు అన్నీ ‘డ్రా’లే
బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అజేయంగా సాగుతోంది. శుక్రవారం ఉజ్బెకిస్తాన్ జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో టై చేసుకుంది. ఈ పోరులో బరిలోకి దిగిన నలుగురు ఆటగాళ్లు కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో వరుసగా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను నిలువరించిన జట్టుగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది. దొమ్మరాజు గుకేశ్... నొదిర్బెక్ అబ్దుసత్తొరొవ్తో, ప్రజ్ఞానంద.... జవొఖిర్ సిందరొవ్తో, విదిత్ గుజరాతి... జకొంగిర్ వఖిదొవ్తో, ఇరిగేశి అర్జున్... షంసిద్దీన్తో తమ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్లో భారత బృందం 2–2తో అమెరికా జట్టుతో టై చేసుకుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 2–1తో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో వంతిక అగర్వాల్ వేసిన ఎత్తులు భారత్‌ను పైఎత్తుకు చేర్చింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో ఆమె ఇరినా క్రుశ్ను ఓడించి 2–2తో స్కోరును సమం భారత మహిళల జట్టు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు ఎనిమిదో రౌండ్లో అమ్మాయిల జట్టు పోలండ్ చేతిలో ఓడింది. దీంతో ఏడురౌండ్ల దాకా అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టుకు ఈ టోరీ్నలో తొలిసారి ఓటమి ఎదురైంది. ఉత్తమ ఆటగాళ్లుగా కార్ల్సన్, పోల్గర్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తమ శతాబ్ది ఉత్సవాలను బుడాపెస్ట్‌లోనే ఘనంగా నిర్వహించింది. ‘ఫిడే 100’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒలింపియాడ్‌లో ఎనిమిదో రౌండ్ పోటీలు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తమ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని మొత్తం 18 కేటగిరీల్లో ‘ఫిడే’ అవార్డులు అందజేసింది. శతాబ్ది అత్యుత్తమ ఆటగాళ్లుగా పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్, మహిళల విభాగంలో జూడిత్ పోల్గర్ ఎంపికయ్యారు. కార్ల్సన్ క్లాసిక్ విభాగంలో ఐదు సార్లు, ర్యాపిడ్ విభాగంలో ఐదు సార్లు, బ్లిట్జ్ విభాగంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ (2882) సాధించిన ఘనత కార్ల్సన్ సొంతం. మహిళల చెస్‌కు సుదీర్ఘ కాలం చిరునామాగా నిలిచిన పోల్గర్ 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయింది. 12 ఏళ్లకే టాప్–100 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పోల్గర్ 2700 రేటింగ్ దాటిన ఏకైక మహిళ. -
చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. తద్వారా పసిడి వేటలో మరో ముందడుగు పడింది. గురువారం జరిగిన 8వ రౌండ్లో భారత్ 3.5–0.5తో ఇరాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... డానెశ్వర్ బర్డియాపై గెలిచి పురుషుల జట్టుకు చక్కని ఆరంభమిచ్చాడు. అనంతరం దొమ్మరాజు గుకేశ్... పర్హామ్ మగ్సూద్‌ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో పోరులో ప్రజ్ఞానంద... అమిన్ టబటబేతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగో మ్యాచ్‌లో విదిత్ గుజరాతి విజయంతో భారత్‌కు ఎదురులేని విజయం ఖాయమైంది. అతను డానెశ్వర్ బర్డియాను ఓడించడంతో భారత్ ఆడిన 8 రౌండ్లలోనూ గెలుపొందింది. ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో భారత్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ‘స్వర్ణ చరిత్ర’ లిఖిస్తుంది. -
భారత చెస్ జట్లకు వరుసగా ఏడో విజయం
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా ఏడో విజయం సాధించి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. జార్జియా జట్టుతో బుధవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచింది. వైశాలి 62 ఎత్తుల్లో లెలా జవాఖి‹Ùవిలిపై, వంతిక 46 ఎత్తుల్లో బెలా ఖొటె నాష్‌విలిపై నెగ్గారు. నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను హారిక 59 ఎత్తుల్లో; నినో బత్సియా‹Ùవిలితో గేమ్ ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. తానియా కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. భారత పురుషుల జట్టు 2.5–1.5తో చైనాపై గెలిచింది. గుకేశ్ 80 ఎత్తుల్లో యి వెను ఓడించగా... ఇరిగేశి అర్జున్–బు జియాంగ్జి గేమ్ 26 ఎత్తుల్లో, ప్రజ్ఞానంద–యు యాంగీ గేమ్ 17 ఎత్తుల్లో, హరికృష్ణ–యు వాంగ్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. విదిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
చెస్ ఒలింపియాడ్: నేడు చైనా, జార్జియాలతో భారత్ పోరు
చెస్ ఒలింపియాడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్లు విరామం తర్వాత తదుపరి పోటీలను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం పురుషుల జట్టు చైనాను ఢీకొంటుండగా, మహిళల జట్టు జార్జియాతో తలపడుతుంది. భారత జట్లు ఈ టోర్నీలో వరుసగా ఆరు రౌండ్లలోనూ విజయాలు సాధించాయి. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్ ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ కీలక పాత్ర పోషిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. చైనా గట్టి ప్రత్యర్థి కావడంతో ఈ మ్యాచ్ ఫలితం భారత్ పతక వేటను శాసించనుంది. తర్వాత అమెరికా, ఉజ్బెకిస్తాన్లతో భారత పురుషుల జట్టు తలపడుతుంది. మహిళల ఈవెంట్లో జార్జియా కూడా కఠినమైన ప్రత్యర్థే కావడంతో ఏడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లకు కష్టమైన సవాళ్లు ఎదురవనున్నాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి భారత జట్లు 12 పాయింట్లతో పురుషుల, మహిళల కేటగిరీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి. -
భారత జట్ల దూకుడు
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్లు వరుసగా ఐదో విజయం నమోదు చేశాయి. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2.5–1.5తో కజకిస్తాన్ జట్టుపై నెగ్గగా... భారత పురుషుల జట్టు 3–1తో అజర్బైజాన్ జట్టును ఓడించింది. కజకిస్తాన్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో బిబిసారా అసయుబయేవా చేతిలో ఓడిపోయింది. అయితే భారత మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి 59 ఎత్తుల్లో మెరూర్ట్ కమలిదెనోవాపై, వంతిక అగర్వాల్ 51 ఎత్తుల్లో అలువా నుర్మాన్‌పై గెలిచారు. జెనియా బలబయేవాతో గేమ్‌ను ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి భారత విజయాన్ని ఖరారు చేసింది. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అజర్‌బైజాన్‌తో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 44 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్‌పై, దొమ్మరాజు గుకేశ్ 38 ఎత్తుల్లో అయిదిన్ సులేమాన్లిపై విజయం సాధించారు. నిజాత్ అబసోవ్‌తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 34 ఎత్తుల్లో... షఖిర్యార్ మమెదైరోవ్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 83 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని భారత్‌కు విజయాన్ని అందించారు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
ఎదురులేని భారత్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా నాలుగో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో ఫ్రాన్స్ జట్టుపై గెలుపొందింది. భారత పురుషుల జట్టు కూడా 3.5–0.5తో సెర్బియా జట్టుపై విజయం సాధించింది. ఫ్రాన్స్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 52 ఎత్తుల్లో డెమాంటి కార్నెపై, తానియా సచ్దేవ్ 50 ఎత్తుల్లో నటాషా బెన్మెస్బాపై, దివ్య దేశ్‌ముఖ్ 56 ఎత్తుల్లో మిత్రా హెజాజిపూర్పై గెలుపొందగా... సోఫీ మిలెట్తో జరిగిన గేమ్‌ను వైశాలి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వంతిక అగర్వాల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. సెర్బియాతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 40 ఎత్తుల్లో అలెగ్జాండర్ ఇందిక్పై, దొమ్మరాజు గుకేశ్ 85 ఎత్తుల్లో అలెగ్జాండర్ ప్రెడ్కిపై, విదిత్ సంతోష్ గుజరాతి 81 ఎత్తుల్లో వెలిమిర్ ఇవిచ్పై నెగ్గగా... అలెక్సీ సరానాతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
భారత జట్ల ‘హ్యాట్రిక్’
బుడాపెస్ట్ (హంగేరి): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేశాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–1తో స్విట్జర్లాండ్ జట్టును ఓడించగా... భారత పురుషుల జట్టు 3.5–0.5తో హంగేరి ‘బి’ జట్టుపై గెలిచింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 46 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ చేతిలో ఓడిపోగా... వైశాలి 38 ఎత్తుల్లో ఘజల్ హాకిమ్‌ఫర్డ్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 32 ఎత్తుల్లో సోఫియా హ్రిజ్లోవాపై, వంతిక అగర్వాల్ 48 ఎత్తుల్లో మరియా మాంకోపై విజయం సాధించారు. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.హంగేరి ‘బి’ జట్టుతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 34 ఎత్తుల్లో పీటర్ ప్రొజాస్కాపై, దొమ్మరాజు గుకేశ్ 54 ఎత్తుల్లో ఆడమ్ కొజాక్‌పై, ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో తామస్ బానుస్‌పై గెలిచారు. గాబోర్ పాప్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
భారత జట్ల శుభారంభం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీలో మొరాకోతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–0తో గెలుపొందింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్, మహారాష్ట్ర గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొరాకో బలహీన ప్రత్యర్థి కావడంతో భారత బృందం ఈ మ్యాచ్‌లో గుకేశ్‌కు విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ గేముల్లో ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో మొహమ్మద్ తిసిర్‌పై, అర్జున్ 40 ఎత్తుల్లో ఎల్బియా జాక్వెస్‌పై, విదిత్ 28 ఎత్తుల్లో మెహదీ పియరీపై, హరికృష్ణ 33 ఎత్తుల్లో అనస్ మొయాద్‌పై విజయం సాధించారు. మరోవైపు జమైకా జట్టుతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో గెలుపొందింది. తొలి రౌండ్ గేముల్లో వైశాలి 29 ఎత్తుల్లో క్లార్క్ అడానిపై, తానియా సచ్దేవ్ 41 ఎత్తుల్లో గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 76 ఎత్తుల్లో రాచెల్ మిల్లర్‌పై విజయం సాధించగా... రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్ 53 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత స్టార్ ద్రోణవల్లి హారికకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆతిథ్యమిచి్చన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. -
పతకాలే లక్ష్యంగా ఎత్తులు
5 చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు లభించిన పతకాలు. ఓపెన్ విభాగంలో రెండు కాంస్యాలు (2014, 2022) ... మహిళల విభాగంలో ఒక కాంస్యం (2022) లభించింది. కరోనా సమయంలో 2020లో ఆన్లైన్లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత జట్టు సంయుక్త విజేతగా నిలువగా... 2021లో కాంస్యం దక్కింది. బుడాపెస్ట్ (హంగేరి): రెండేళ్ల క్రితం స్వదేశంలో తొలిసారి జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఓపెన్ విభాగంతోపాటు మహిళల విభాగంలోనూ భారత జట్లు కాంస్య పతకాలు గెల్చుకున్నాయి. నేటి నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే 45వ చెస్ ఒలింపియాడ్‌లో గతం కంటే ఘనమైన ప్రదర్శన ఇచ్చేందుకు భారత జట్లు సిద్ధమయ్యాయి. గత రెండేళ్ల కాలంలో భారత చెస్ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో మరింతగా రాటుదేలారు. తమిళనాడు యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో నవంబర్‌లో తలపడనున్నాడు. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి, పెంటేల హరికృష్ణ కూడా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి భారత్ తరఫున మూడో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ ర్యాంక్‌కు చేరుకోగా... సీనియర్ స్టార్ తానియా సచ్దేవ్, వంతిక అగర్వాల్ కూడా తమదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించగల సమర్థులే. ఈ నేపథ్యంలో చెస్ ఒలింపియాడ్‌లో భారత ఓపెన్, మహిళల జట్లు ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఓపెన్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్‌తోపాటు గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి, పెంటేల హరికృష్ణ... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ భారత జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో 197 జట్లు... మహిళల విభాగంలో 184 జట్లు పోటీపడుతున్నాయి. ఓపెన్ విభాగంలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, ఉజ్బెకిస్తాన్, నార్వే, నెదర్లాండ్స్ జట్లు... మహిళల విభాగంలో జార్జియా, పోలాండ్, ఉక్రెయిన్, బల్గేరియా జట్లు ఫేవరెట్స్‌గా ఉన్నాయి. -
చదరంగ విప్లవం ముంగిట్లో భారత్!
దశాబ్ద కాలంలోనే భారత్‌లో యాభై మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు అవతరించారు. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. చెస్‌కు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. అయితే దేశంలో చదరంగ విప్లవానికి ఇది నాంది మాత్రమే. మున్ముందు జరగాల్సింది చాలా మిగిలి ఉంది. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఇంకో భారతీయుడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడా? ఏమైనా, భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందని మాత్రం తప్పక చెప్పవచ్చు. బిందువు బిందువు సింధువైనట్లు... ముందు కొంతమంది యువ ప్రతిభావంతులు చెస్ గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగారు. ఆ తరువాత పరిపక్వత లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. భారతీయ చదరంగ చరిత్రలో డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద నేతృత్వంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. వీరితోపాటు ఎంతోమంది యువ కులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులను అధిరోహిస్తున్నారు. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ సందర్భంగా భారతీయ క్రీడా కారుల ఆటతీరును గమనించినప్పుడు ఇలాంటిది ఏదో జరగాలని మనం ఆశించాము. ఆ పోటీల్లో ఇండియా–బి బృందం ఓపెన్ కేటగి రిలో కాంస్య పతకం సాధించింది. మహిళా క్రీడాకారులు కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. అయితే ఫైడ్ చెస్ ర్యాంకింగ్‌లో గుకేశ్ టాప్–10లో ఒకడిగా ఎదగడంతో మిగిలిన వారు కూడా ఇప్పుడు మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదరంగంలో అతితక్కువ కాలంలో వచ్చిన ఈ గుణాత్మక మార్పునకు కారణాలు ఎన్నో. చెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. ఆటగాళ్లకూ, ఆటకూ ఎక్స్ పోజర్ కూడా బాగుంది. అత్యున్నతస్థాయి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యానికి కొరతే లేదు. దేశంలో చదరంగం మరింత ఎదిగేందుకు ఈ నైపుణ్యమే కీలకం. విస్తృతస్థాయిలో నైపుణ్యం ఉండటం పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కాస్తా ఆటగాళ్లు మరింత రాటుదేలేందుకు ఉపయోగ పడుతుంది. భారత్ తరఫున ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లేదా వరల్కప్ పోటీల్లో పాల్గొనాలంటే అత్యున్నత స్థాయి ఆట ఆడాల్సి ఉంటుంది. మనకేం ఫర్వాలేదు అనుకునే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. అందరూ ముంగాళ్లపై నుంచోవాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే. ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూంటారు. మంచి మిత్రులే కానీ, ఆట విషయానికి వస్తే మాత్రం ఎవరి గుట్లు వారి వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆ రహస్యాలే వారికి ఏదో ఒక రోజు విజయాన్ని సంపాదించి పెట్టవచ్చు. ఇక్కడ చాలామంది టాప్ ర్యాంకింగ్ ఆటగాళ్లను మాత్రమే చూస్తున్నారు. కానీ కింది స్థాయిలోనూ చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నేను భారతదేశంలో నంబర్ వన్ (1986 జూలై ఒకటవ తేదీన 2405 ఎలో రేటింగ్‌తో ప్రవీణ్ థిప్సే కంటే ముందుకు వెళ్లినప్పుడు)గా మారినప్పుడు దరిదాపుల్లో ఇంకో ఆటగాడు కనిపించలేదు. 1988లో ఇరవై ఏళ్ల వయసులో నేను గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు పోటీల గురించి కాకుండా, రానున్న మూడేళ్లలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎలా అని ఆలోచించాను. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి! 1988లో నేను గ్రాండ్ మాస్టర్‌గా అవతరిస్తే, మూడేళ్ల తరువాత 1991లో దివ్యేందు బారువా ఆ ఘనత సాధించాడు. ప్రవీణ్ థిప్సే 1997 నాటికి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు పరిస్థితిలో చాలామార్పు వచ్చింది. 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు 50 మంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగారు. ఎలో రేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉన్న భారతీయ గ్రాండ్ మాస్టర్లు (పాక్షికంగా రిటైరైన నాతో కలిపి) ఆరుగురు ఉన్నారిప్పుడు. గ్రాండ్ మాస్టర్ కావడం చాలా గొప్పవిషయమే అయినప్పటికీ ప్రస్తుతం సాధారణమైపోయింది. మారుతున్న కాలానికి నిదర్శనం ఇది. ఈ తరానికి ఇంకో సానుకూల అంశమూ ఉంది. నాకున్న దశాబ్దాల అనుభవంపై వారు ఆధారపడవచ్చు. అలాగే ఎందరో చెస్ గురు వుల ప్రస్థానాల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చాలా కీలకం. కానీ మాలాంటివాళ్లం ఈ తరం ఆటగాళ్లకు మార్గ దర్శనం మాత్రమే చేయించగలం. టాప్ లెవల్ ఆటగాళ్లందరికీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి ఆటగాళ్లను వేరు చేసే అంశాలు వారి ప్రవర్తన, నిత్యం ఉన్నతస్థాయి ఆటను కొనసాగించగలగడం, శారీరక దారుఢ్యం, ఒత్తిడికి లోనుకాకపోవడం. అంతేకాదు... ఆట విషయంలో సమగ్రత కూడా చాలా అవసరం. ప్రత్యర్థి ఎప్పుడు ఏ రకమైన సవాలు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండటం అవసరం. కొంతమంది ప్రత్యర్థులు మీరు తయారైన దానికంటే భిన్నమైన రీతిలో దాడికి దిగవచ్చు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? దేనిపై ఆధారపడతారు? మీ లెక్కకు చిక్కని విషయమని భావిస్తారా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే బాగా శ్రమించడం అన్నదానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎలో రేటింగ్ 2700కు చేరుకోవడం కూడా ఈ శ్రమలో భాగమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. భారతీయ చదరంగం కేవలం పురుషులకు మాత్రమే చెందింది కాదు. దేశంలో చదరంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే మహిళా క్రీడాకారులు కూడా బాగా రాణించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్యలో చాలా అంతరం ఉంది. భారత్‌లోనే కాదు... ప్రపంచం మొత్తమ్మీద ఇదే పరిస్థితి. ఈ అంత రాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాడమీ ఏర్పాటు ద్వారా మేమీ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తామన్న నమ్మ కమూ ఉంది. కోనేరు హంపి, డి.హారిక, ఇతరుల స్థాయుల మధ్య చాలా అంతరం ఉంది. ఉన్నత స్థానంలో ఏళ్ల తరబడి కొనసాగేందుకు తగిన జ్ఞానం హారిక, హంపికి ఉంది. అయితే మిగిలిన వారు సమీప భవిష్యత్తులోనే వీరికి సవాలు విసరగలరని ఆశిస్తున్నా. ఒకే ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు కదా! అసలైన విప్లవం అందరినీ తోడుతీసుకునే మొదలవుతుంది. గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ చదరంగంలో మారుతున్న తరానికి ప్రతినిధులు. నా అనుభవం వారికి ఉపయోగపడుతుంది కానీ, వారు తమ సొంత మార్గంలో మరింత దూరం ప్రయాణించడం అలవర్చు కోవాలి. తమ సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. కొత్త హోదా, హంగు ఆర్భాటాలకు వారిప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. ఎదురుదెబ్బలూ వారికి ఎదురు కావచ్చు. ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కాకపోతే వీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం సరైందనే చెప్పాలి. మిగిలినవి ఎలా ఉన్నా ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత దేశ చదరంగం ఒక్కో అడుగే ముందుకేయాలి. ఎదుగుతున్నప్పటికీ అందుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. విçస్తృతమైన, లోతైన వ్యవస్థ అక్కరకొచ్చే అంశం. కాలం గడుస్తున్న కొద్దీ ఒకదానికి ఒకటి పూరకంగా వ్యవహరిస్తాయి. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారా? ఇంకో భారతీ యుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఒకే మాట చెప్పవచ్చు. భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందీ అని! విశ్వనాథన్ ఆనంద్ వ్యాసకర్త ప్రపంచ ఛాంపియన్ షిప్ ఐదుసార్లు నెగ్గిన చదరంగ క్రీడాకారుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం
చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్లాంటివేమీ లేవు. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది. -
Chess Olympiad 2022:చెస్ విజేతలకు నజరానా
సాక్షి, చెన్నై: 44వ చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లను ఆతిథ్య తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున ఆరు జట్లు పాల్గొనగా...ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు, మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి. ఓపెన్ జట్టులో గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆదిబన్, రౌనక్ సాధ్వాని సభ్యులు కాగా, మహిళల టీమ్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి భాగంగా ఉన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరందరి ఘనతను సీఎం ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక్కో జట్టుకు రూ. 1 కోటి చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధికారులతో పాటు మంత్రి మెయ్యనాథన్, సీఎస్ ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు. ‘టాటా స్టీల్’లో మహిళలు చెన్నై: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదినుంచి ఈ టోర్నీలో మహిళల విభాగంలో కూడా పోటీలు నిర్వహించబోతున్నారు. పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీని అందిస్తూ తొలిసారి మహిళల కేటగిరీని చేర్చారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 29నుంచి డిసెంబర్ 4 వరకు కోల్‌కతాలో జరుగుతుంది. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఈవెంట్లలో జరిగే టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లంతా భాగం కానున్నారు. మహిళల విభాగంలో భారత్‌నుంచి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలతో పాటు అనా ముజిచుక్, మారియా ముజిచుక్ (ఉక్రెయిన్), నానా జాగ్నిజ్ (జార్జియా), అలినా కష్లిన్స్కయా (పోలండ్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. టాటా స్టీల్ చెస్ టోర్నీకి భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సలహాదారుడు కావడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. -
డబుల్ ధమాకా
సాక్షి, చెన్నై: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. ► నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. ► పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, విదిత్, నారాయణన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానంలో... సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, మురళీ కార్తికేయ, అభిమన్యులతో కూడిన భారత ‘సి’ జట్టు 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి. ► చివరిదైన 11వ రౌండ్లో భారత్ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్ తమ ప్రత్యర్థులపై గెలిచారు. అమెరికాతో మ్యాచ్ ను భారత్ ‘ఎ’ 2–2తో... కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్ ‘సి’ 2–2తో ‘డ్రా’ చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు సభ్యులు ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్, నిహాల్ సరీన్, గుకేశ్ అమెరికా చేతిలో ఓడి... మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. సోమ వారం జరిగిన చివరిదైన 11వ రౌండ్లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్ గోమ్స్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 16 పాయింట్లతో 8వ స్థానంలో... ఇషా కరవాడే, నందిద, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారి ణులు సాహితి వర్షిణి, ప్రత్యూష, విశ్వ వాస్నావాలాలతో కూడిన భారత ‘సి’ జట్టు 15 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాయి. ► క్లాసికల్ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పరిమార్జన్ నేగి, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్లైన్లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్ కాంస్యం సాధించింది. మనోళ్లకు ఏడు పతకాలు టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వ్యక్తిగత విభాగం పతకాలను (కనీసం 8 గేమ్‌లు ఆడాలి) ఖరారు చేయగా... భారత ప్లేయర్లకు ఏడు పతకాలు లభించాయి. బోర్డు–1పై 11 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు గుకేశ్ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... బోర్డు–2పై 10 గేమ్‌లు ఆడిన నిహాల్ సరీన్ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో రజతం... బోర్డు–3పైనే 9 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో కాంస్యం గెల్చుకున్నారు. మహిళల విభాగంలో బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన వైశాలి 7.5 పాయింట్లతో కాంస్యం, బోర్డు–4పై 11 గేమ్‌లు ఆడిన తానియా 8 పాయింట్లతో కాంస్యం... బోర్డు–5పై 9 గేమ్‌లు ఆడిన దివ్య 7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. -
చెస్ ఒలింపియాడ్‌కు ఎంఎస్ ధోని.. అక్కడేం పని!
భారత్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని హాజరవ్వనున్నాడు. అయితే ఒక ప్లేయర్‌గా కాదులెండి.. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మాత్రమే. ఆగస్టు 28న చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులు.. ముగింపు వేడుకలు కూడా అంతే ఘనంగా ఉండాలని ధోనికి ఆహ్వానం పంపింది. కాగా ముగింపు వేడుకల ఇవాళ(మంగళవారం) సాయంత్రమే జరగనున్నాయి. ధోని రాక కోసం చెన్నై అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తలైవాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటికి నుంచి ధోని సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాదించిన ధోని సీఎస్కే నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఈ సీజన్ ప్రారంభంలో ధోని తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకునేందుకు జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి మధ్యలోనే వైదొలిగాడు. మరోసారి ధోని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటికి నిరాశపర్చిన సీఎస్కే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ధోనినే సీఎస్కేను నడిపించనున్నాడు. ఇక తొలిసారి భారత్‌కు వచ్చిన చెస్ ఒలింపియాడ్‌లో భారత ఆటగాళ్లు సహా ఇతర దేశాల చెస్ క్రీడాకారులు విరివిగా పాల్గొన్నారు. వాస్తవానికి 44వ చెస్ ఒలింపియడ్ను ఉక్రెయిన్‌లో నిర్వహించాల్సింది. కానీ రష్యా మిలటరీ దాడుల నేపథ్యంలో ఆఖరి నిమిషంలో చెస్ గవర్నింగ్ బాడీ ఫిడే(అంతర్జాతీయ చెస్ ఫెడరషన్ సమాఖ్య) భారత్‌లోని చెన్నై సిటీని హోస్ట్‌గా ఎంపిక చేసి గేమ్స్‌ను తరలించింది. దీంతో చెస్ ఒలింపియాడ్ నిర్వహించే సువర్ణవకాశం భారత్‌కు దక్కింది. చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది. చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’ -
పతకం రేసులో భారత్ ‘ఎ’
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది. -
Chess Olympiad: ఎదురులేని భారత్
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు వరుసగా ఆరో విజయంతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. జార్జియాతో బుధవారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 3–1తో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌లో హంపి 42 ఎత్తుల్లో...లెలా జావఖిష్‌విలితో గేమ్‌లో వైశాలి 36 ఎత్తుల్లో గెలిచారు. నినో బాత్సియాష్‌విలితో గేమ్‌ను హారిక 33 ఎత్తుల్లో... సలోమితో జరిగిన గేమ్‌ను తానియా 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ 3–1తో నెగ్గగా... చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను భారత్ ‘బి’ 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’–ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’కాగా... భారత్ ‘బి’ 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం ఏడో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Chess Olympiad 2022: అజేయంగా భారత్ ‘ఎ’
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ ఖాతాలో నాలుగో విజయం చేరింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 2.5–1.5తో రొమేనియాపై గెలిచింది. పెంటేల హరికృష్ణ–బొగ్డాన్ గేమ్ 31 ఎత్తుల్లో... విదిత్–లుపులెస్కు గేమ్ 31 ఎత్తుల్లో... నారాయణన్–జియాను గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 46 ఎత్తుల్లో పరిల్‌గ్రాస్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో భారత్ ‘బి’ 2.5–1.5తో స్పెయిన్‌పై గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేయగా...భారత్ ‘సి’ 2.5–1.5తో చిలీపై నెగ్గింది. మహిళల విభాగంలో భారత్ ‘ఎ’ 2.5–1.5తో ఫ్రాన్స్‌పై గెలుపొందగా... భారత్ ‘బి’ 1–3తో జార్జియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’–బ్రెజిల్ మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. -
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా
Chess Olympiad 2022: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా కొనసాగుతుంది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు పరాజయం అన్నది లేకుండా దూసుకెళ్తున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో భారత జట్లు వరుసగా మూడో విజయాలు సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాయి. ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో (ఓపెన్ విభాగంలో) తెలుగు యువ కెరటాలు హరికృష్ణ, అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో భారత్ ‘ఎ’ 3–1తో గ్రీస్‌పై విజయం సాధించింది. దిమిత్రోస్‌పై హరికృష్ణ విజయం సాధించగా, అర్జున్.. మాస్తోవసిల్స్‌ను చిత్తు చేశాడు. భారత ‘బి’.. స్విట్జర్లాండ్‌పై (4–0) ఏకపక్ష విజయం నమోదు చేయగా.. భారత్ ‘సి’ 3–1తో ఐస్లాండ్పై నెగ్గింది. మహిళల విషయానికొస్తే.. భారత్ ‘ఎ’ 3–1తో ఇంగ్లండ్‌పై.. భారత్ ‘బి’ 3–1తో ఇండోనేసియాపై.. భారత్ ‘సి’ 2.5–1.5తో ఆస్ట్రియాపై గెలుపొందాయి. -
చిత్రం భళారే విచిత్రం.. రాజమౌళి మూవీనే తలదన్నే వీడియో..
దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ చెస్ మహా సంగ్రామానికి తమిళనాడు రాజధాని చెన్నై నగరం వేదికైంది. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఒలంపియాడ్ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా పోటీలు జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. ఇదిలా ఉండగా.. చెస్ ఒలంపియాడ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెస్ బోర్డుపై పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో తెరకెక్కించారు. చెస్ బోర్డులో రాజు, మంత్రిగా, సైనికులుగా, గుర్రాలుగా, ఒంటెలుగా, ఏనుగులుగా మనుషులే వేషం ధరించి కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా వీడియోను రూపొందించారు. Superb. Choreographed, I’m told, by Ms Kavitha Ramu, Collector Pudukkottai. Makes the chess pieces come alive in our imagination. Also it has authenticity, given the game was invented in India. Bravo! pic.twitter.com/BZCQvluyFz — anand mahindra (@anandmahindra) July 29, 2022 కాగా, తమిళనాడులోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. ఈ వీడియోను చూసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రశంసలు కురిపించారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్న చర్యలు చేపట్టిందని మెచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘ఇదో అద్భుతం. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రామాణికతను కలిగి ఉంది. మన దేశంలో కనుగొనబడిన గేమ్ ఇది’ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. District administrations have taken various intiatives to promote #chessolympiad22. This beautiful video is by District Administration, Pudukkottai in which Classical, Folk, Mal Yutham and Silambam artists magically transport us to a World of creative fantasy, 1/2 pic.twitter.com/sQig1Ew675 — CMOTamilNadu (@CMOTamilnadu) July 27, 2022 ఇది కూడా చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు -
Chess Olympiad 2022: భారత జట్ల జోరు
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి. మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. -
Chess Olympiad 2022: భారత్ 24–0
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జట్లకు ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు బోర్డులో ఎత్తు వేసినవారంతా విజేతలుగానే నిలిచారు. ఓపెన్‌లో మూడు, మహిళల్లో మరో మూడు... ఈ ఆరు జట్ల తరఫున బరిలోకి దిగిన 24 మంది ఆటగాళ్లు విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీలో ఇరిగైసి అర్జున్, విదిత్ సంతోష్ గుజరాతీ, నారాయణన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 4–0తో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. విదిత్ సంతోష్... మకొటో రాడ్‌వెల్‌పై గెలుపొందగా, రెండో బోర్డులో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు అర్జున్, మనాంగో స్పెన్సర్‌ను ఓడించాడు. 32 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఎమరాల్డ్ ముషోర్‌పై ఎస్.ఎల్.నారాయణన్, జెంబా జెముసెపై శశికిరణ్ గెలుపొందారు. భారత ‘బి’ జట్టు 4–0తో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)పై నెగ్గింది. అల్ హొసానిపై గుకేశ్, ఇబ్రహీమ్‌పై శరీన్ నిహిల్, సయీద్‌పై ఆధిబన్, అబ్దుల్ రహమాన్‌పై రౌనక్ విజయం సాధించారు. భారత ‘సి’ జట్టు కూడా 4–0తో దక్షిణ సుడాన్‌పై నెగ్గింది. సైప్రియానోపై సేతురామన్, అజక్ మచ్ దువనీపై అభిజిత్ గుప్తా, గాంగ్ తోన్ గాంగ్‌పై మురళీ కార్తికేయన్, మజుర్ మన్యంగ్‌పై అభిమన్యు పీటర్ గెలుపొందారు. మహిళల విభాగంలో కూడా ఆతిథ్య జట్లు శుభారంభం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్ర శ్రేణి గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, వైషాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలున్న భారత్ ‘ఎ’ 4–0తో తజికిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. నదెజ్దా అంటొనొవాపై హంపి 41 ఎత్తుల్లో అలవోక విజయం సాధించింది. సబ్రినాపై వైషాలీ, రుక్సోనా సైదొవాపై తానియా, ముత్రిబా హొతమిపై భక్తి గెలిచారు. భారత్ ‘సి’ అమ్మాయిల జట్టు 4–0తో హాంకాగ్‌పై నెగ్గింది. లామ్ క యాన్పై బొడ్డా ప్రత్యూష, సిగప్పి కన్నప్పన్‌పై ఇషా కరవాడే, డెంగ్ జింగ్ జిన్‌పై పీవీ నందిదా, లి జాయ్ చింగ్‌పై సాహితి వర్షిణి విజయం సాధించారు. ‘బి’ జట్టు కూడా 4–0తో వేల్స్‌పై గెలిచింది. స్మిత్ ఒలివియాపై వంతిక అగ్రావల్, చాంగ్ కింబెర్లీపై సౌమ్య స్వామినాథన్, 1–0తో హియా రేపై మేరి ఆన్ గోమ్స్, ఖుషీ బగ్గాపై దివ్య దేశ్‌ముఖ్ నెగ్గారు. -
పాలస్తీనా చిన్నది... టోర్నీలోనే పిన్నది
చెన్నైకొచ్చిన 8 ఏళ్ల పాలస్తీనా పాప రాండా సెడార్. అసలు ‘ఎత్తు’ వేయకుండానే ఈ ‘చెస్ ఒలింపియాడ్’ పుస్తకాల్లోకెక్కింది. చెన్నై మెగా ఈవెంట్లో ఆడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత పొందింది. ఐదేళ్ల పసిప్రాయంలో తండ్రి దగ్గర ఏదో ఆటవిడుపుగా నేర్చుకున్న చదరంగంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. మూడేళ్లు తిరిగేసరికే పాలస్తీనా మహిళల చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి... ఈ ఒలింపియాడ్‌లో ఆడే జాతీయ జట్టుకు ఎంపికైంది. మయన్మార్ అమరవట్టి... మన కుట్టి! భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మయన్మార్ అమ్మాయి కూడా చెన్నైలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మయన్మార్ అబ్బాయిలే ‘పావులు’ కదుపుతున్న చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి అమ్మాయిల జట్టు ఆడుతోంది. అరంగేట్రం చేస్తున్న అమ్మాయిల బృందంలో ఉన్న మిన్ అమరవట్టి తన మూలాలున్న చోట ఘనాపాఠిగా నిలిచేందుకు తహతహలాడుతోంది. చదవండి: Chess Olympiad 2022: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్.. -
భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్..
భారత్, పాక్‌ల మధ్య సత్సబంధాల్లేవ్. గరువారం భారత్‌లోని చెన్నై వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ టోర్నీ కావడంతో ‘ఫిడే’ పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపింది. కానీ పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. ఈ నెల జూలై 21 జమ్మూ కశ్మీర్లో ఒలింపియాడ్‌కు సంబంధించిన ‘టార్చ్ రిలే’ మొదలైంది. అయితే దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఆఖరి నిమిషంలో టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి అరిందమ్ బాగ్చి అసహనం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. పక్కదేశానికి అభ్యంతరమేంటి? అయినా ప్రతిష్టాత్మక క్రీడల్లో ఆడేందుకువచ్చి రాజకీయ రగడ చేయడం విచారకరం’ అని అన్నారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్ ఒలంపియాడ్ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ అందుకున్నారు. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో మంత్రి ఎల్. మురుగన్ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్ రజినీకాంత్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చదవండి: చెస్ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..! Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా? -
చెస్ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..!
‘విశ్వ’ వేడుకకు భారత్ వేదికైంది. అంబరాన్నంటే సంబరాలు.. ఆహుతులను మంత్రముగ్ధులను చేసే లేజర్ షోలు, చూపరులను కట్టిపడేసే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా చెస్ ఒలంపియాడ్ పోటీల ప్రారంభోత్సవం గురువారం రాత్రి నభూతో నభవిష్యతీ అన్న రీతిలో సాగింది. అత్యంత వైభవంగా ముస్తాబైన.. చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తమ దేశ జెండాలు, ప్లకార్డులను చేతబూని సభా ప్రాంగణంలో వివిధ దేశాల క్రీడాకారులు ర్యాలీ చేశారు. జనగణమన.. తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను గాయకులు ఆలపించారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ప్రపంచ స్థాయి పోటీలకు భారత్ వేదిక కావడం చారిత్రాత్మకం అని.. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సాక్షి , చెన్నై: చెన్నై వేదికగా ప్రపంచ చెస్ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పరాజితులు ఉండరు.. విజేతలు, భావి విజేతలు మాత్రమే ఉంటారని ఉద్బోధించారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్ ఒలంపియాడ్ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విశ్వనాథన్ ఆనంద్ తీసుకురాగా.. చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ అందుకున్నారు. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో మంత్రి ఎల్. మురుగన్ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్ రజినీకాంత్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకమైన చెస్ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయని, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న వేళ చెస్ పోటీలు జరగడం చారిత్రాత్మకమన్నారు.. ‘‘చాలా తక్కువ వ్యవధిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి అతిథి దేవో భవ అని నిరూపించారు. చెస్ క్రీడకు భారత్‌లో ప్రత్యేక స్థానం ఉంది. చెన్నైలో జరుగుతున్న ఈ పోటీ లు చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. చెస్ ఒలంపియాడ్ సందర్భంగా దేశంలో పర్యటించిన టార్చ్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎందరో క్రీడాకారులను ఉత్తేజ పరిచింది. ఇందుకు ప్రతి భారతీయునికి వందనాలు సమర్పిస్తున్నాను. చెస్‌తో తమిళనాడుకు చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. తమిళనాడు నుంచి ఎందరో చెస్ గ్రాండ్ మాస్టర్లు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతున్నారు. చెస్ క్రీడలు స్ఫూర్తే కాదు, ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తుంది. పోస్ట్ కోవిడ్‌తో భారత్ మానసికంగా, శారీరకంగా.. చాలా దృఢంగా మారింది అనేందుకు ఈ క్రీడలే నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను నిర్వహించి క్రీడావృద్ధి చెందడం తథ్యం. యువత మన దేశానికి ఒక పెద్ద శక్తి. ఇక్కడి మహిళల్లోనిS నాయకత్వ లక్షణాలు భారత్‌కు తలమానికం. చెస్ ఒలంపియాడ్ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు భారత్ ఘన స్వాVýæతం పలుకుతోంది’’ అని ఆయన అన్నారు. తమిళ ఖ్యాతి ఇనుమడించేలా.. ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, ఈ చెస్ పోటీలు ప్రపంచం మన వైపు చూసేలా చేశాయని, తమిళనాడు ఖ్యాతిని మరింత పెరిగేలా మార్చాయని అభిప్రాయపడ్డారు.. ‘‘కఠోర శ్రమ తోనే ఇది సాధ్యమైంది. ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్లలో ఇండియా అగ్రశ్రేణిలో ఉంది. అందులో 36 శాతం గ్రాండ్‌మాస్టర్లు తమిళనాడుకు చెందిన వారే. చెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తమిళనాడు విరాజిల్లుతోంది. చెస్ ఒలంపియాడ్ పోటీలు భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. ఇది దేశానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. చారిత్రాత్మకమైన ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడం ఆనందదాయకం. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో 20 వేల మంది క్రీడాకారులతో చెస్ పోటీలను నిర్వహించి చెస్‌పై ఆయనకున్న మక్కువను ఆనాడే చాటారు. ఇక ఈ పోటీలకు ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లాలని భావించాను. అయితే కరోనా సోకడం వల్ల వీలుకాలేదు. ఈ సమయంలో ప్రధాన మోదీ నాకు ఫోన్ చేసి మీరు విశ్రాంతి తీసుకోండి.. నేను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఈ చెస్ ఒలంపియాడ్ పోటీలు రష్యాలో జరగాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల అక్కడ నిర్వహించలేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఈ సమయంలో భారత్‌లో జరపాలని భావించడం ఇందు కు తమిళనాడు సిద్ధం కావడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలను విజయవంతం చేసేందుకు 18 ఉప సంఘాలను నియమించాను. కేవలం నాలుగు నెలలలోనే అద్భుతంగా ఏర్పాట్లు చేసిన వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. అంతేకాక పాఠశాల స్థాయిలోనే చెస్ క్రీడను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదృష్టంపై ఆధారపడి కాదు, మేధస్సు, తెలివితేటలు ఏకాగ్రతతో ఇది ముడిపడి ఉంటుంది.’’అని ఆయన వివరించారు. చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..? -
చెస్ ఒలింపియాడ్‌కు వేళాయె...
గడుల ఆటకు వేళైంది.. ఎత్తుకు పైఎత్తు వేసేందుకు పోటీ దారులు సిద్ధమయ్యారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ చెస్ మహా సంగ్రామానికి చెన్నై నగరం సిద్ధమైంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి అతిరథ మహారథులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాల చెస్ క్రీడాకారులు, అధికారులు, భద్రతా సిబ్బంది రాకతో నగరం కొత్త కాంతులీనుతోంది. ఇక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం ఒలంపియాడ్ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ప్రత్యేక ఆడిటోరియం రూపొందించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ చెస్ పండుగకు రంగం సిద్ధమైంది. 44వ చెస్ ఒలంపియాడ్ పోటీల ప్రారంభోత్స కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కోలాహలంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అత్యధిక దేశాలు పాల్గొంటున్న టోర్నీగా.. దేశంలో తొలిసారిగా జరిగే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీల ఏర్పాట్లకు తమిళనాడు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. ‘తమిళతంబి’ పేరు న గుర్రం ముఖం రూపంలో ఓ చిహ్నాన్ని ఇందుకోసం ప్రత్యేక రూపొందించి నగరం నలుమూలలా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ఆడిటోరియం, క్రీడాకారులకు స్టార్ హోటళ్లలో బస, వందలాది కళాకారులతో స్వాగతం, చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం చెన్నైకు చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్వదేశీ, విదేశీ చెస్ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. క్రీడా ప్రాంగణం పరిసరాల్లో ఏడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యధిక దేశా లు పాల్గొంటున్న టోర్నీగా ఇది గుర్తింపు పొందింది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్న నెహ్రూ ఇండోర్ స్టేడియంను సీఎం స్టాలిన్ బుధవారం పరిశీలించారు. 28వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు చెస్‌పోటీలు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు 1,045 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన చెస్ ఒలంపియాడ్ టార్చ్ రిలే రన్ 39 రోజుల్లో 75 ముఖ్య నగరాలను చుట్టివచ్చి బుధవారం మహాబలిపురానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు ఆ టార్చ్‌ను అందుకున్నా రు. క్రీడాకారులను ప్రాంగణానికి చేర్చే ప్రత్యేక బస్సులకు సంబంధించిన ట్రయల్ రన్‌ను పోలీసులు బుధవారం నిర్వహించారు. ఈనెల 30, 31వ తేదీల్లో తిరువాన్మియూర్, తాంబరం నుంచి మహాబలిపురానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇక ప్రపంచ చెస్ ఒలంపియాడ్ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజేతలైన 100 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పిక్నిక్ ట్రిప్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లి తర్వాత తిరుగు ప్రయాణామయ్యారు. ప్రధాని మోదీపై ఫొటో లేకపోవడంపై.. చెస్ ఒలంపియాడ్ పోటీ ఆహ్వానాల్లో ప్రధాని మోదీ ఫొటో వేయకుండా వివక్ష చూపారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీడియా ప్రకటనలు, ఫ్లెక్సీల్లో ప్రపంచ స్థాయి పోటీలను ప్రారంభించే పీఎం ఫొటో లేకుండా చేయడం ఆశ్చర్యకరమని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చెస్ పోటీలను జయప్రదం చేసేందుకు బీజేపీ రాష్ట్రశాఖ సహకరిస్తున్నా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ పాటించక పోవడం బాధాకరమన్నారు. పీఎంపై తప్పుడు పోస్టులు పెడితే.. చెస్ పోటీలను ప్రారంభించేందుకు చెన్నైకి రానున్న ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ హెచ్చరించారు. బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒలంపియాడ్‌తో ప్రపంచ దేశాలన్నీ చెన్నై వైపు చూస్తున్నాయని, ఈ దశలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగిన వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. మహాబ లిపురం పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని, 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్లో పదోసారి చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘2000 నుంచి నేను చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఓపెన్ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్ హరికృష్ణ అన్నాడు. -
రోడ్డా.. చెస్ బోర్డా..?
చెన్నైలో చెస్ ఒలింపియాడ్ సందడి మొదలైంది. ఈ నెల 28నుంచి 10 ఆగస్టు వరకు టోర్నీ జరుగుతోంది. ప్రచారంలో భాగంగా నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కు అధికారులు ఇలా చదరంగ గళ్ల రూపు ఇచ్చారు. అయితే చెస్ ఆటగాళ్ల ప్రస్తావనే లేకుండా సిద్ధమైన టోర్నీ థీమ్ సాంగ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఆర్ రహమాన్ ప్రముఖంగా కనిపిస్తుండగా, కనీసం చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా లేకుండా వీడియో రూపొందింది. భారత్‌నుంచి ఇప్పటి వరకు 74 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు రాగా, అందులో 26 మంది తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. -
అలా... ఢిల్లీలో మొదలైంది
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కోసం ఒలింపిక్స్ మాదిరి ఈసారి భారత్‌లో శ్రీకారం చుట్టిన టార్చ్ రిలే దేశ రాజధానిలో ఘనంగా మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ జ్యోతి రిలేను ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కడి వోర్కోవిచ్ తొలి టార్చ్ బేరర్ కాగా... దీనిని అందుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత చెస్ సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు అందించారు. ► క్రీడా సమాఖ్య చీఫ్, ప్రధాని, చెస్ దిగ్గజం... ఇలా విభిన్న అతిరథుల మధ్య టార్చ్ రిలే వైభవంగా మొదలైంది. ఇక్కడి నుంచి ఇకపై 40 రోజుల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతావనిని ఈ జ్యోతి చుట్టి వస్తుంది. ► వివిధ రాష్ట్రాలకు చెందిన 75 నగరాల్లో టార్చ్ రిలే కార్యక్రమం జరుగుతుంది. లేహ్, శ్రీనగర్, జైపూర్, సూరత్, ముంబై, భోపాల్, పట్నా, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, కన్యాకుమారిల మీదుగా సాగే రిలే చివరకు ఆతిథ్య వేదిక అయిన తమిళనాడులోని మహాబలిపురంన కు చేరుకుంటుంది. ఏ రాష్ట్రానికి వెళితే అక్క డి గ్రాండ్‌మాస్టర్లు జ్యోతిని అందుకుంటారు. ► చెస్ ఒలింపియాడ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. శతవసంతాల సమయంలో తొలిసారి భారత్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. మొత్తం 188 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటారు. ► ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘చెస్ పురిటిగడ్డపై చెస్ ఒలింపియాడ్ ప్రప్రథమ టార్చ్ రిలేకు అంకురార్పణ జరగడం గర్వంగా ఉంది. చదరంగం పుట్టిన దేశంలో చెస్ ఒలింపియాడ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇలా జ్యోతి రిలే భారత్‌లో మొదలవడం దేశానికే కాదు... చెస్ క్రీడకే గౌరవం పెంచినట్లయింది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారత మహిళా తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం), ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితో మోదీ కాసేపు సరదాగా చెస్ గేమ్ ఆడారు. ► చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. భారత్ తరఫున ఓపెన్ విభాగంలో రెండు జట్లు, మహిళల విభాగంలో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2014లో ఓపెన్ విభాగంలో భారత జట్టు తొలిసారి కాంస్య పతకం సాధించింది. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలు గా నిలువగా... 2021లో మళ్లీ ఆన్‌లైన్‌ఒలింపియాడ్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. -
చెస్ ఒలింపియాడ్‌కు జట్లను ప్రకటించిన భారత్..
చెన్నై: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత జట్లను అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్’ హోదాలో మార్గనిర్దేశనం చేయనుండటం విశేషం. ‘గత కొంత కాలంగా నేను చాలా తక్కువ టోర్నీల్లోనే పాల్గొంటున్నాను. పైగా ఎన్నో ఒలింపియాడ్స్ ఆడాను కాబట్టి కొత్తతరం ఆటగాళ్లు బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లతో టీమ్ ‘ఎ’ను, వర్ధమాన ఆటగాళ్లతో టీమ్ ‘బి’ను ఎంపిక చేశారు. 2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్లైన్లో జరిగిన టోర్నీలో రష్యాతో భారత్ సంయుక్త విజేతగా (2020) నిలువగా... 2021లో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది. భారత జట్ల వివరాలు ఓపెన్: భారత్ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్ఎల్ నారాయణన్. భారత్ ‘బి’: నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని. మహిళలు: భారత్ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. భారత్ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్. -
చెన్నైలో చెస్ ఒలింపియాడ్
సాక్షి, చెన్నై: భారత చెస్ రాజధాని చెన్నై మరో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన ‘చెస్ ఒలింపియాడ్’ ఈ ఏడాది చెన్నైలో జరగనుంది. ఉక్రెయిన్‌పై అనైతిక యుద్ధం చేస్తోన్న రష్యాకు కట్టబెట్టిన ఆతిథ్య హక్కుల్ని ఇదివరకే రద్దు చేసిన ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తాజాగా కొత్త వేదికను ఖరారు చేసింది. అయితే తేదీలు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే మాస్కోలో జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టీమ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. చెన్నైలోనూ ఇదే షెడ్యూలులో నిర్వహిస్తారా లేదం టే కొత్త తేదీల్ని ప్రకటిస్తారనేదానిపై స్పష్టత రాలే దు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెన్నై లో మెగా టోర్నీ విషయాన్ని ప్రకటించారు. ‘భారత చెస్ క్యాపిటల్‌కు చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య భాగ్యం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇది తమిళనాడుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ప్రపంచంలోని చదరంగ రాజులు, రాణులకు (ప్లేయర్లు)కు చెన్నై స్వాగతం పలుకుతోంది’ అని తమిళ సీఎం స్టాలిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కూడా ఆతిథ్య వేదికగా చెన్నై ఖరారైందని వెల్లడించింది. ‘ఫిడే’ రష్యాను తప్పించగానే ఏఐసీఎఫ్ ఆతిథ్య హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. 10 మిలియన్ డార్లు (సుమారు రూ. 70 కోట్లు) గ్యారంటీ మనీగా డిపాజిట్ చేసింది. ఇది చెస్‌లో జరిగే పెద్ద టీమ్ ఈవెం ట్. ఇందులో దాదాపు 190 దేశాలకు చెందిన 2000 పైగా క్రీడాకారులు తలపడతారు. భారత్ నుంచి జగద్విఖ్యాత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, తెలుగు గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ, విదిత్ గుజరాతీలతో పాటు తెలంగాణ ఆటగాడు అర్జున్ ఎరిగైసి... మహిళల కేటగిరీలో హంపి, హారిక, వైశాలి తదితరులు పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే జట్లను మే 1న అధికారికంగా> ప్రకటిస్తారు. 2013లో విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై ఆతిథ్యమిచ్చింది. చెన్నై ఆతిథ్యంపై ఆనంద్ స్పందిస్తూ ‘ఇది భారత్‌కు, చెన్నై చెస్ సమాజానికి గర్వకారణం. చెస్‌కు చెన్నై సరిగ్గా సరిపోతుంది. ఈ దిశగా కృషి చేసిన ఏఐసీఎఫ్‌కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. మరో వైపు రష్యానుంచి వేదికను మార్చిన ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) అక్కడి ఆటగాళ్లను చెస్ ఒలింపియాడ్‌లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రష్యాతో పాటు యుద్ధోన్మాదానికి సహకరిస్తోన్న బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నామని, తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ‘ఫిడే’ ప్రకటించింది. -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్
చెన్నై: ఆన్లైన్ వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీపై, విశ్వనాథన్ ఆనంద్ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, నిహాల్ సరీన్ 70 ఎత్తుల్లో లియాంగ్ అవండర్లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్ చేతిలో, విదిత్ 46 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో, ఆనంద్ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్ 44 ఎత్తుల్లో లియాంగ్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో, ఆధిబన్ 33 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
ఒలింపియాడ్ సెమీస్‌లో భారత్
చెన్నై: ‘ఫిడే’ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 5–1తో నెగ్గింది. భారత విజయంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించింది. ఆమె ఆడిన మూడు గేముల్లోనూ నెగ్గింది. ముందుగా ఉక్రెయిన్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ 4–2తో గెలుపొంది....రెండో మ్యాచ్‌లో 2.5–3.5తో ఓడిపోయింది. దాంతో రెండు జట్ల స్కోరు సమమైంది. విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించగా భారత్ పైచేయి సాధించింది. టైబ్రేక్ గేముల్లో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, ఆధిబన్, నిహాల్ సరీన్, వైశాలి నెగ్గగా... కోనేరు హంపి, విదిత్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. హారిక 37 ఎత్తుల్లో నటాలియా బుక్సాను ఓడించగా... లులీజా ఉస్మాక్‌తో గేమ్‌ను హంపి 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకుముందు తొలి మ్యాచ్ గేమ్‌లో హారిక 36 ఎత్తుల్లో నటాలియా బుక్సాపై, రెండో మ్యాచ్ గేమ్‌లో 32 ఎత్తుల్లో జుకోవాపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అమెరికాతో భారత్ తలపడుతుంది. -
చెస్ ఒలింపియాడ్ ‘విజేత’పై విమర్శలు
మాస్కో: ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో సంయుక్త విజేతను ప్రకటించడంపై తాజాగా విమర్శలు మొదలయ్యాయి. ఎంతటి ప్రాధాన్యమైన టోర్నీ అయినా సరైన విజేత లేకుంటే అది విఫలమైన టోర్నీగానే మిగులుతుందని రష్యా జట్టు సభ్యుడు డానీల్ డుబోవ్ విమర్శించాడు. 2018 ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ అయిన డుబోవ్ ఇరు జట్లకు పసిడి పతకాన్ని అందించడం తనకు నచ్చలేదని పేర్కొన్నా డు. ఆటగాళ్లెవరినీ సంప్రదించకుండానే సంయుక్త విజేతలుగా ‘ఫిడే’ ప్రకటించడం తనకు నిరాశ కలిగించిందని అన్నాడు. చివరి రెండు గేములు మళ్లీ ఆడేందుకు ఆటగాళ్లంతా సుముఖంగానే ఉన్నారు. కానీ మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇలా గెలవాలని మేమెప్పుడూ అనుకోలేదు’ అని డుబోవ్ వ్యాఖ్యానించాడు. చదవండి: ఇకనైనా గుర్తించాలి సంయుక్త విజేతలుగా భారత్, రష్యా -
ఇకనైనా గుర్తించాలి
చెన్నై: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో మనోళ్లు అడుగుపెడితే పతకాలతోనే తిరిగి రావడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ చెస్ క్రీడాకారుల విజయాలను మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని క్రీడాధికారులు గుర్తించడం లేదు. అందుకే ఏడేళ్లుగా ఒక్క చెస్ ప్లేయర్‌కు ‘ఖేల్‌రత్న’గానీ, ‘అర్జున అవార్డు’గానీ, కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డుగానీ, చెస్ క్రీడాభివృద్ధికి పాటుపడిన వారికి ‘ధ్యాన్‌చంద్’ అవార్డుగానీ రాలేదు. అయితే ఆదివారం ముగిసిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో కనబరిచిన ప్రదర్శనతో వచ్చే ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్ ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయని భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల ముఖాముఖి టోర్నీలు లేకపోవడంతో ఆన్లైన్ ఒలింపియాడ్ నిర్వహించగా భారత్... రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ ఓ ఇంటర్వూ్యలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ► ఒలింపియాడ్ విజయంతో చెస్‌పట్ల అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. చెస్ ఆటగాళ్లకు ‘అర్జున’, కోచ్‌ల ‘ద్రోణాచార్య’ అవార్డులు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. కొన్నిసార్లు కొందరికి మన ఉనికిని చాటు చెప్పాల్సి ఉంటుంది. తాజా ఒలింపియాడ్ స్వర్ణంతో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నాను. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో చెస్ క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ అస్సలు గుర్తించడం లేదు. ► ఇక అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సమాఖ్య వారు ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలపై సుదీర్ఘ లేఖలు రాసే బదులు ఇలాంటి విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించాలి. ► ఈ టోర్నమెంట్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నిజానికి నేను జట్టును ముందుండి నడిపించాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ముఖాముఖిగా జరగాల్సిన రెగ్యులర్ చెస్ ఒలింపియాడ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాని బదులు ఆన్లైన్లో నిర్వహించడం నిజంగా అద్భుతం. ఈ 2020లో ముఖాముఖి టోర్నీలకైతే చోటే లేదు. దీంతో ఈ ఏడాది ఆసాంతం ఇక ఆన్లైన్ టోర్నీలే నిర్వహించాలి. ► భారత క్రీడాకారులంతా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. నేను ఆట మధ్యలో సహచరుల ఎత్తుల్ని గమనించాను. నిజంగా ప్రతి ఒక్కరు వేసిన ఎత్తులు నన్ను ఆశ్చర్యపరిచాయి. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. -
భారత జట్టుపై గవర్నర్ బిశ్వభూషణ్ ప్రశంసలు
సాక్షి, అమరావతి : చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ తదితరులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించారంటూ క్రీడాకారులపై ప్రశంసల జల్లు కురిపించారు. చదరంగంలో క్రీడాకారులు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఫైడ్ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి భారత జట్టు సంయుక్తంగా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 96 ఏళ్ల చరిత్ర కలిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారిగా భారత జట్టు స్వర్ణం సాధించింది. చక్కని విజయాలతో మొదటిసారి ఈ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బలమైన రష్యాను దీటుగా ఎదుర్కొంది. (సంయుక్త విజేతలుగా భారత్, రష్యా) -
సంయుక్త విజేతలుగా భారత్, రష్యా
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ వివాదాస్పద రీతిలో ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ ముగిసింది. భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3–3తో సమంగా నిలిచాయి. ఫైనల్లోని రెండో మ్యాచ్ సందర్భంగా ఇద్దరు భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం.... చివరకు సమయాభావం వల్ల వారు గేమ్‌లను వదులుకోవాల్సి జరిగింది. దాంతో రష్యా 4.5–1.5తో ఈ మ్యాచ్‌ను గెలిచింది. మ్యాచ్‌లో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’ అయితే చెరో పాయింట్ ఇస్తారు. ఫలితంగా రష్యా ఓవరాల్‌గా 3–1తో విజయం సాధించినట్లయింది. అయితే విజయావకాశాలు ఉన్నదశలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగానే తాము గేమ్‌లు కోల్పోవాల్సి వచ్చిందని ‘ఫిడే’ అప్పీల్ కమిటీకి భారత్ అప్పీల్ చేసింది. అప్పీల్‌ను విచారించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షడు అర్కాడీ ద్వోర్కోవిచ్ (రష్యా) అన్ని అంశాలను పరిశీలించి, భారత అప్పీల్ సరైనదేనని భావిస్తూ రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. టోర్నీ మొత్తంలో హంపి, హారిక నిలకడగా ఆడి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హంపి టైబ్రేక్ గేమ్‌లో గెలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు. రష్యాతో జరిగిన ఫైనల్ తొలి మ్యాచ్‌లో విదిత్–నెపోమ్నియాచి (37 ఎత్తులు); హరికృష్ణ–అర్తెమీవ్ (54 ఎత్తులు); హంపి–కాటరీనా లాగ్నో (48 ఎత్తులు); హారిక–అలెగ్జాండ్రా కొస్టెనిక్ (48 ఎత్తులు); ప్రజ్ఞానంద–అలెక్సీ సరానా (56 ఎత్తులు); దివ్య–షువలోవా (51 ఎత్తులు) గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. రెండో మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్–నెపోమ్నియాచి; విదిత్–దుబోవ్; హారిక–కొస్టెనిక్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియగా... హంపి 88 ఎత్తుల్లో గోర్యాచిక్నా చేతిలో; దివ్య 25 ఎత్తుల్లో షువలోవా చేతిలో; నిహాల్ సరీన్ 25 ఎత్తుల్లో ఎసిపెంకో చేతిలో ఓడిపోయారు. దివ్య గెలిచే స్థితిలో, నిహాల్ ‘డ్రా’ చేసుకునే స్థితిలో ఉన్నపుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం, ఇంటర్నెట్ పునరుద్ధరణ జరిగేసరికి గేమ్ నిర్ణీత సమయం అయిపోవడంతో వారిద్దరు ఓడిపోయినట్లు ప్రకటించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముఖాముఖిగా ఈ ఏడాదే రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 5 నుంచి 17 వరకు జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాని స్థానంలో ఆన్లైన్లో చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన... తొలిసారి నిర్వహించిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
చెస్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చెస్ ఆటగాళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. రష్యా వేదికగా జరిగిన ఫైడ్ ఆన్లైన్ చెస్ ఒలంపియాడ్లో తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించింది. కాగా చెస్ ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, దివ్య, నిహాల్, విదితలు ఫైనల్లో సరైన వ్యూహాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్తులో చెస్ ఆటగాళ్లు మరిన్ని విజయాలను అందుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా భారత్ చెస్ ఒలింపియాడ్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గతంలో వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణంతో సంచలనం సృష్టించింది. చదవండి: చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా చరిత్ర -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా చరిత్ర
చెన్నై: తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు నయా చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన . గతంలో వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణం వచ్చినట్లయ్యింది. భారత్ పైనల్‌కు చేరడంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. పోలాండ్ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ టైబ్రేక్‌లో 1–0తో గెలవడంతో ఫైనల్‌కు చేరింది. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాపై రష్యా గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్-రష్యా జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో పూర్తిగా జరగలేదు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఫైనల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్-రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అంతకుముందు చెస్ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 2014లో భారత్ కాంస్య పతకం సాధించగా, ఆరేళ్ల తర్వాత స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుని భారత్ నయా చరిత్ర సృష్టించింది. -
గెలిపించిన హంపి
చెన్నై: తొలి మ్యాచ్‌లో పరాజయంపాలై ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్... విజేతను నిర్ణయించే టైబ్రేక్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి అద్భుత ఆటతీరుతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. ‘అర్మగెడాన్’ పద్ధతిలో జరిగిన ఈ గేమ్‌లో హంపి 73 ఎత్తుల్లో మోనికా సోకో (పోలాండ్)ను ఓడించింది. దాంతో తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ టైబ్రేక్‌లో 1–0తో గెలిచింది. రెండు మ్యాచ్‌లతో కూడిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. విశ్వనాథన్ ఆనంద్, విదిత్, దివ్య దేశ్‌ముఖ్ ఓడిపోగా... నిహాల్ సరీన్ గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ఇక ఫైనల్ చేరాలనే ఆశ ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో భారత్ 4.5–1.5తో నెగ్గి స్కోరును సమం చేసింది. హంపి, హారిక, ఆనంద్, విదిత్ తమ గేముల్లో గెలుపొందగా... ప్రజ్ఞానంద ఓడిపోయాడు. వంతిక అగర్వాల్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇక విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌లో ‘అర్మగెడాన్’ గేమ్‌ను ఆడించారు. ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం టాస్ గెలిచిన వారికి తెల్లపావులు లేదంటే నల్లపావులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెల్లపావులతో ఆడే వారికి ఐదు నిమిషాలు, నల్లపావులతో ఆడే వారికి నాలుగు నిమిషాలు ఇస్తారు. తెల్లపావులతో ఆడే వారికి అదనంగా ఒక నిమిషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా గెలవాలి. మరోవైపు నల్లపావులతో ఆడేవారికి ఒక నిమిషం తక్కువ ఉంటుంది కాబట్టి వారు ‘డ్రా’ చేసుకున్నా చాలు వారినే విజేతగా ప్రకటిస్తారు. మోనికా సోకోతో జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో హంపి టాస్ గెలిచి నల్ల పావులను ఎంచుకుంది. ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే స్థితిలో హంపి చకచకా ఎత్తులు వేస్తూ, ప్రత్యర్థి వ్యూహాలు చిత్తు చేస్తూ 73 ఎత్తుల్లో ఏకంగా విజయాన్నే సొంతం చేసుకుంది. రష్యా, అమెరికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. చెస్ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం (2014లో). ఈసారి భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. -
వివాదాస్పద రీతిలో...
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కరోనా కారణంగా తొలిసారి ఆన్లైన్లో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ఆర్మేనియాను ఓడించింది. తొలి రౌండ్ పోరులో భారత్ 3.5–2.5 పాయింట్ల తేడాతో ఆర్మేనియాపై విజయం సాధించింది. భారత్ తరఫున విదిత్ గుజరాతీ, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్ విజయాలు సాధించగా...కోనేరు హంపి, వంతిక అగర్వాల్ తమ ఆటలో పరాజయం పాలయ్యారు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, ఆరోనియన్ లెవాన్ మధ్య పోరు ‘డ్రా’గా ముగిసింది. అనంతరం రెండో రౌండ్ పోరుకు భారత్ సన్నద్ధమైంది. అప్పీల్ తిరస్కరణ... అయితే భారత ఆటగాడు నిహాల్ సరీన్ చేతిలో ఆర్మేనియన్ మార్టిరోస్యాన్ హెయిక్ ఓడిన పోరు వివాదంగా మారింది. ఆట సాగుతున్న సమయంలో ఆన్లైన్ కనెక్షన్ పోయిందని ఆర్మేనియా జట్టు ‘ఫిడే’కు ఫిర్యాదు చేసింది. ఈ అప్పీల్‌పై సుదీర్ఘ సమయం పాటు విచారణ జరగగా... తమ వైపునుంచి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుందని, నిర్వాహకుల ద్వారా సాంకేతిక లోపమే పరాజయానికి కారణమని ఆర్మేనియా వాదించింది. అయితే ఆ జట్టు అప్పీల్‌ను తిరస్కరించిన అప్పీల్స్ కమిటీ ఫలితంలో మార్పు లేదని ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఆర్మేనియా తమ నిరసనను కొనసాగించింది. చివరకు తాము రెండో రౌండ్ ఆడమని, విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెబుతూ ‘డిఫాల్ట్’గా ప్రకటించింది. దాంతో భారత్ సెమీస్ చేరడం ఖాయమైంది. ఇదే టోర్నీలో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా కోనేరు హంపి, విదిత్ గుజరాతి మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో ఓటమిపాలయ్యారు. అయితే భారత జట్టు మాత్రం అప్పీల్‌కు వెళ్లకుండా ఫలితాన్ని స్వీకరించింది. శనివారం అజర్బైజాన్, పోలండ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో సెమీ ఫైనల్లో భారత్ తలపడుతుంది. -
చైనాకు భారత్ షాక్
చెన్నై: సీనియర్ గ్రాండ్‌మాస్టర్ల ప్రదర్శనకు తోడు యువ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఆర్.ప్రజ్ఞానంద, మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం) దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయాల కారణంగా ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు పటిష్టమైన చైనాకు 4–2తో షాక్ ఇచ్చింది. లీగ్ దశలో అజేయంగా నిలిచి పూల్ ‘ఎ’లో 17 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు నెగ్గడం విశేషం. తొలుత భారత్ ఏడో రౌండ్లో 4–2తో జార్జియాపై... ఎనిమిదో రౌండ్లో 4.5–1.5తో జర్మనీపై... తొమ్మిదో రౌండ్లో 4–2తో చైనాపై విజయం సాధించింది. (చదవండి: అజహర్ అలీ సెంచరీ: పాక్ 273 ) భారత్ క్వార్టర్ ఫైనల్ చేరడంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించారు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ 71 ఎత్తుల్లో జినెర్ జుపై; 15 ఏళ్ల ప్రజ్ఞానంద 66 ఎత్తుల్లో యాన్ లియుపై గెలుపొందారు. 32వ ర్యాంకర్ యాంగి యుతో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 63 ఎత్తుల్లో... మహిళల ప్రపంచ నంబర్‌వన్ యు ఇఫాన్‌తో జరిగిన గేమ్‌ను హంపి 42 ఎత్తుల్లో... ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ జూ వెన్జున్తో జరిగిన గేమ్‌ను హారిక 41 ఎత్తుల్లో... ప్రపంచ మూడో ర్యాంకర్ డింగ్ లిరెన్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈనెల 28న క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. (ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కలిస్, లీసా, జహీర్ అబ్బాస్) -
టైటిల్ వేటలో భారత్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటేందుకు స్టార్లతో కూడిన భారత జట్టు సన్నద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో నేటి నుంచి జరుగనున్న ఈ ఈవెంట్లో టీమిండియా టైటిల్‌పై దృష్టి సారించింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, అమెరికా జట్లు ఫేవరెట్లుగా ఈ టోర్నీ బరిలో నిలిచాయి. మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ ఎస్ గుజరాతీ (కెప్టెన్), కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, యువ ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ తదితరులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగనున్న భారత్ టాప్ డివిజన్ పూల్ ‘ఎ’లో చైనా, జార్జియా, వియత్నాం, జర్మనీ, ఇరాన్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, జింబాబ్వే జట్లతో కలిసి ఆడనుంది. లీగ్ దశ అనంతరం ప్రతీ పూల్‌లోనూ టాప్–3లో నిలిచిన జట్లు నాకౌట్ పోటీలకు అర్హత సాధిస్తాయి. పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం గం. 1:30కు జింబాబ్వేతో, రెండో మ్యాచ్‌లో వియత్నాం (గం. 2:30), మూడో మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్ (గం. 3:30)తో భారత్ తలపడుతుంది. మే నెలలో జరిగిన ఆన్లైన్ నేషన్స్ కప్‌లో రాణించలేకపోయిన భారత్ ఒలింపియాడ్‌లో సత్తా చాటుతుందని కెప్టెన్ విదిత్ గుజరాతీ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఆరు జట్లు పాల్గొన్న నేషన్స్ కప్‌లో భార™Œత్ ఐదో స్థానంతో ముగించింది. హరికృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. టోర్నీలో భారత్ గట్టి పోటీనిస్తుందని అన్నాడు. భారత జట్టు : పురుషులు: ఆనంద్, విదిత్ (కెప్టెన్). మహిళలు: హంపి,్ల హారిక. జూనియర్ బాలురు: నిహాల్ సరీన్. జూనియర్ బాలికలు: దివ్య దేశ్‌ముఖ్. రిజర్వ్ ప్లేయర్లు: పి. హరికృష్ణ, అరవింద్ చిదంబరం, భక్తి కులకర్ణి, ఆర్. వైశాలి. ఆర్. ప్రజ్ఞానంద, వంతిక అగర్వాల్. -
హరికృష్ణకు మూడో ‘డ్రా’
చెన్నై: బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో పెంటేల హరికృష్ణ తన ‘డ్రా’ల పరంపర కొనసాగిస్తున్నాడు. నోయెల్ స్టడర్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో సమ ఉజ్జీగా నిలిచిన హరికృష్ణ టోర్నీలో వరుసగా మూడో డ్రా నమోదు చేశాడు. 52 ఎత్తుల తర్వాత ఈ పోరు ముగిసింది. ప్రస్తుతం 13.5 పాయింట్లతో హరి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రేపటినుంచి చెస్ ఒలింపియాడ్ ఈ నెల 25న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఆన్లైన్లో జరిగే ఈ టోర్నమెంట్ పురుషుల, మహిళల విభాగాలతో పాటు జూనియర్ బాలుర, బాలికల విభాగాల్లో భారత్ పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగస్టు 30 వరకు జరుగుతుంది. పురుషుల జట్టులో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఉండగా... సారథిగా విదిత్ సంతోష్ గుజరాతి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో పురుషుల ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) పాల్గొనడం లేదు. ఇక మహిళల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. టాప్–8లో నిలిచిన జట్లు స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. -
చెస్ ఒలింపియాడ్‌కు హంపి, హారిక, ఆనంద్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారీ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టులోని మిగతా మూడు బెర్త్‌ల కోసం తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, ఆర్.వైశాలి రేసులో ఉన్నారు. అయితే మే 1వ తేదీన మిగతా ముగ్గురు క్రీడాకారిణుల పేర్లను ఖరారు చేస్తామని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేరు ఖరారైంది. ర్యాంకింగ్ ప్రకారం పెంటేల హరికృష్ణ, విదిత్ ఎంపిక కూడా లాంఛనమే. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం రేసులో ఉన్నారు. చెస్ ఒలింపియాడ్ ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 18 వరకు రష్యా రాజధాని మాస్కోలో జరుగుతుంది. మొత్తం 180 దేశాలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాయి. -
రజతం నెగ్గిన అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. టర్కీలో ఆదివారం ముగిసిన ప్రపంచ యూత్ అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. అర్జున్, ఇనియన్ పనీర్‌సెల్వం, సంకల్ప్ గుప్తా, కౌస్తవ్ చటర్జీ, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత జట్టు 14 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. భారత్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. స్లొవేనియా ‘ఎ’, టర్కీ, ఉక్రెయిన్, అర్మేనియా, రష్యా, అజర్బైజాన్, ఇరాన్‌లపై నెగ్గిన భారత బృందం... బెలారస్, ఉజ్బెకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకోగా... 13 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని పొందింది. వ్యక్తిగతంగా టాప్ బోర్డు–1లో ఆడిన 15 ఏళ్ల అర్జున్ తొమ్మిది గేమ్‌ల ద్వారా ఏడు పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. వరంగల్‌కు చెందిన అర్జున్ ఆడిన తొమ్మిది గేముల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. అలీరెజా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం, నికోలజ్ (జార్జియా) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
పురుషులు ‘ఆరు’... మహిళలు ‘ఎనిమిది’
బటూమి (జార్జియా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు చెస్ ఒలింపియాడ్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 16 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన 11వ రౌండ్లో పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆనంద్–జాన్ క్రిస్టోఫ్ డూడా గేమ్ 25 ఎత్తుల్లో... హరికృష్ణ–రాడోస్లా గేమ్ 30 ఎత్తుల్లో... విదిత్–కాక్పెర్ గేమ్ 48 ఎత్తుల్లో... ఆధిబన్–జాసెక్ టామ్జాక్ గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఓవరాల్‌గా భారత్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు మంగోలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 3–1తో గెలిచింది. హారిక–బతుయాగ్ మున్‌గున్‌తుల్ గేమ్ 72 ఎత్తుల్లో... ఇషా–ముంక్జుల్ గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... తానియా 60 ఎత్తుల్లో నోమిన్పై, పద్మిని 65 ఎత్తుల్లో దులామ్సెరెన్పై విజయం సాధించారు. ఓవరాల్‌గా భారత జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... హంగేరి చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో రౌండ్లో హంగేరి చేతిలో ఓటమి భారత జట్టు పతకావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో చైనా విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. పురుషుల విభాగంలో చైనా, అమెరికా, రష్యా 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు స్వర్ణం... అమెరికా ఖాతాలో రజతం చేరగా... రష్యా జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో చైనా, ఉక్రెయిన్ 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు పసిడి పతకం ఖాయమైంది. ఉక్రెయిన్‌కు రజతం, 17 పాయింట్లు సాధిం చిన జార్జియా జట్టుకు కాంస్యం లభించింది. -
భారత పురుషుల జట్టుకు చుక్కెదురు
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు పతకం గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. జార్జియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోగా... ఇటలీతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పురుషుల జట్టులో అరోనియన్‌తో ఆనంద్; సర్గిసియాన్‌తో హరికృష్ణ; మెల్కుమ్యాన్‌తో ఆధిబన్ ‘డ్రా’ చేసుకోగా... మర్టిరోసియాన్ చేతిలో శశికిరణ్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో జిమినా ఓల్గాతో కోనేరు హంపి; మోవిలెనుతో పద్మిని గేమ్‌లు ‘డ్రా’గా ముగించారు. సెడీనాపై హరిక గెలుపొందగా... బ్రునెలో చేతిలో తానియా ఓటమి చవిచూసింది. తొమ్మిదో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 15వ స్థానంలో... మహిళల జట్టు 16వ స్థానంలో ఉన్నాయి. -
భారత మహిళల జట్టుకు షాక్
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఊహించని రీతిలో తొలి పరాజయం ఎదురైంది. హంగేరి జట్టుతో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1–3 తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత బృందం పతకం నెగ్గే అవకాశాలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 50 ఎత్తుల్లో తన్ త్రాంగ్ హోంగ్ చేతిలో ఓడిపోగా... గారా అనీటాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో; జూలియానా తెర్బెతో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అయితే మరో గేమ్‌లో తానియా సచ్దేవ్ 56 ఎత్తుల్లో గారా టికియా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు 11 పాయింట్లతో 15వ స్థానంలో ఉంది. పురుషుల జట్టు విజయం... మరోవైపు భారత పురుషుల జట్టు ఆరో విజయం నమోదు చేసింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 2.5–1.5తో గెలిచింది. విశ్వనాథన్ ఆనంద్–డేవిడ్ నవారా గేమ్ 30 ఎత్తుల్లో; విదిత్–విక్టర్ లాజ్నికా గేమ్ 66 ఎత్తుల్లో; ఆధిబన్–జిబినెక్ గేమ్ 17 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... శశికిరణ్ 36 ఎత్తుల్లో జిరీ స్టోసెక్‌ను ఓడించి భారత్‌ను గెలిపించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 15 పాయింట్లతో అమెరికా తొలి స్థానంలో, 14 పాయింట్లతో పోలాండ్ రెండో స్థానంలో ఉన్నాయి. -
అమెరికాను నిలువరించిన భారత్
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లోని ఆరో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో రెండో సీడ్ రష్యా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో... మహిళల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌ల్లో ఫలితం తేలకపోగా... భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన నాలుగు గేముల్లోనూ ఫలితాలు రావడం విశేషం. ఆనంద్–నెపోమ్నియాట్చి గేమ్ 43 ఎత్తుల్లో... హరికృష్ణ–క్రామ్నిక్ గేమ్ 45 ఎత్తుల్లో... విదిత్–విటియుగోవ్ గేమ్ 31 ఎత్తుల్లో... ఆధిబన్–జావోవెంకో గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 35 ఎత్తుల్లో జటోన్‌స్కీపై; తానియా 31 ఎత్తుల్లో తతేవ్‌పై నెగ్గారు. అయితే ఏపీ గ్రాండ్‌మాస్టర్ హారిక 57 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో... ఇషా 55 ఎత్తుల్లో జెన్నిఫర్ చేతిలో ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 9 పాయింట్లతో 14వ స్థానంలో... భారత మహిళల జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. -
భారత జట్ల విజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
ఆనంద్ పరాజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో భారత్ విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న భారత పురుషుల జట్టు అమెరికా చేతిలో ఓటమి పాలైంది. గురువారం జరిగిన నాలుగో రౌండ్లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అమెరికా చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... 26 ఎత్తుల్లో కరువానా ఫాబియానో చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం వెస్లీతో జరిగిన గేమ్‌ను 32 ఎత్తుల్లో పెంటేల హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. నకముర హికారు – విదిత్ గుజరాతీ (35 ఎత్తులు), శాంక్లాండ్ శామ్యూల్ – శశికిరణ్ మధ్య (21 ఎత్తులు) జరిగిన గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మరోవైపు పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 3–1తో గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్ విజయం సాధించగా... మరో ఆంధ్ర గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఇషా కరవాడే తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. జొలాంటాపై 62 ఎత్తుల్లో హారిక, క్లాడియాపై 45 ఎత్తుల్లో తానియా గెలుపొందారు. మోనికతో గేమ్‌ను 52 ఎత్తుల్లో హంపి, వరకోమ్స్కాతో గేమ్‌ను 45 ఎత్తుల్లో ఇషా కరవాడే ‘డ్రా’ చేసుకున్నారు. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. కెనడాతో బుధవారం జరిగిన మూడో రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలుపొందింది. భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, శశికిరణ్ నెగ్గగా... విదిత్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ఆనంద్ 33 ఎత్తుల్లో ఎరిక్ హాన్సెన్‌పై, హరికృష్ణ 33 ఎత్తుల్లో రజ్వాన్ ప్రెటుపై, శశికిరణ్ 28 ఎత్తుల్లో అమన్ హంబిల్టన్‌పై గెలిచారు. విదిత్, ఎవగెని బరీవ్ మధ్య గేమ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. మరోవైపు సెర్బియాతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులను ఓడించగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లకు పరాజయం ఎదురైంది. -
మ్యాచ్‌కు ముందే పెళ్లి ప్రపోజల్
ప్రేమకు కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధం లేదని ,రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఓ భారత జర్నలిస్ట్.. కొలంబియన్ చెస్ ప్లేయర్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయడం చర్చనీయాంశమైంది. సరిగ్గా టీమ్‌మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. భారత జర్నలిస్ట్ నిక్లేష్ జైన్.. కొలంబియా చెస్ స్టార్ విమ్ ఎంజెలా లోపెజ్కు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిక్లేష్ మోకాళ్ల పై కూర్చోని మరి రింగ్‌ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్ చేయడం ఎంజెలాతో పాటు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. తన ప్రపోజల్‌కు ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ‘వాస్తవానికి ఆమెలా నేను ఓ చెస్ ప్లేయర్. గతంలోనే తనముందు పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాను. కానీ చెస్ ఒలింపియాడే సరైనదని భావించాను. ఈ టోర్నీలో 189 దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇది మా ఇద్దరికి దేవాలయం వంటిది. అందుకే ఇక్కడ ప్రపోజ్ చేయాలని నిర్ణియించుకొని.. తన చెల్లి సాయం తీసుకున్నాను. గతేడాదిన్నరగా మేం ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన సమస్య భాష. ఆమె స్పానిష్ తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేదు. మొబైల్ ట్రాన్స్లెట్ యాప్ సాయంతో మాట్లాడుకునేవాళ్లమని’ తెలిపాడు. అమెరికా చెస్ గ్రాండ్ మాస్టర్ సుసాన్ పొల్గర్... ‘అతను హిందీ మాట్లాడుతాడు(భారత్).. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది(కొలంబియా). వీరిద్దరని చెస్ లవ్‌లో పడేసింది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్‌కు ఆమె అంగీకరించింది. వారిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అభినందనలు.. ఇది ఒలంపియాడ్ లవ్’ అంటూ అద్భుత వ్యాఖ్యలతో వర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Olympiad LOVE! He speaks Hindi (India). She speaks Spanish (Colombia). But they found love through chess! He popped the question at @BatumiChess2018 playing hall before round 2. She said yes! ... And they are learning English, quick! 😂 Congratulations! @WOMChess @FIDE_chess pic.twitter.com/wtqmW26f6P — Susan Polgar (@SusanPolgar) September 25, 2018 -
మ్యాచ్‌కు ముందే లవ్ ప్రపోజల్
-
భారత జట్లకు వరుసగా రెండో విజయం
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. జార్జియాలో మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ద్రోణవల్లి హారిక, తానియా, ఇషా, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4–0తో వెనిజులాపై గెలిచింది. హారిక 52 ఎత్తుల్లో సరాయ్‌పై, తానియా 44 ఎత్తుల్లో అమెలియాపై, ఇషా 49 ఎత్తుల్లో రవీరాపై, పద్మిని 42 ఎత్తుల్లో పటినో గార్సియాపై నెగ్గారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్, ఆధిబన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఆస్ట్రియాను ఓడించింది. -
పతకాలతో తిరిగి రావాలని...
బటూమి (జార్జియా): గతంలో ఎన్నడూలేని విధంగా సన్నద్ధత... పదేళ్ల తర్వాత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం... రెండేళ్ల తర్వాత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి పునరాగమనం... వెరసి సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఐదో సీడ్... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టుకూ ఐదో సీడ్ లభించింది. పురుషుల విభాగంలో 185 దేశాలు... మహిళల విభాగంలో 155 దేశాలు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్లో 11 రౌండ్లు జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. పురుషుల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1927లో... మహిళల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1957లో జరిగింది. ఆనంద్, హరికృష్ణ లేకుండానే... పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్ కృష్ణన్, ఆధిబన్, లలిత్ బాబు సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 2014లో కాంస్యం సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 2012లో హారిక, ఇషా కరవాడే, తానియా, మేరీఆన్ గోమ్స్, సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా ఉన్న భారత మహిళల జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆనంద్, హరికృష్ణలతోపాటు హంపి కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండటం... టోర్నీకి శిక్షణ శిబిరాలు నిర్వహించడం... టోర్నీ సందర్భంగా సన్నాహాల కోసం భారత జట్లకు తొలిసారి సెకండ్స్ (సహాయకులు)ను ఏర్పాటు చేయడంతో రెండు జట్లూ పతకాలతో తిరిగి వస్తాయని భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో అమెరికా, రష్యా, చైనా, అజర్బైజాన్... మహిళల విభాగంలో చైనా, రష్యా, ఉక్రెయిన్, జార్జియా జట్లతో భారత్‌కు గట్టిపోటీ లభించే అవకాశముంది. -
12 ఏళ్ల తర్వాత...
చెన్నై: సుదీర్ఘ విరామం అనంతరం భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్నాడు. అతడు 2006 లో చివరిసారిగా ఈ మెగా టోర్నీలో ఆడాడు. ఈసారి తాను ఒలింపియాడ్‌లో ఆడేందుకు సిద్ధం గా ఉన్నట్లు సూచించడంతో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆనంద్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచ చెస్ ఒలింపియాడ్ కోసం ఏఐసీఎఫ్ బుధవారం ఐదుగురు చొప్పున సభ్యులున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. పురుషుల జట్టుకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ప్రస్తుత 14వ ర్యాంకర్ విశ్వనాథన్ ఆనంద్ సార థ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, బి.అధిబన్, శశికిరణ్ ఉన్నారు. భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇషా కరవాడే, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్ ఉన్నారు. ఈ మెగా టోర్నీకి రామ్‌కో గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఏఐసీఎఫ్ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి. పురుషుల్లో 2,650 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న వారికి రూ. 2 లక్షలు, 2,600 రేటింగ్ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 1.50 లక్షలు... మహిళల్లో 2,400 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 1 లక్ష, 2,000 రేటింగ్ పాయింట్లు దాటిన వారికి రూ. 80 వేలు లభించనున్నాయి. ఇవికాక టోర్నీలో జట్టు స్వర్ణం నెగ్గితే రూ. 3 లక్షలు, రజతం నెగ్గితే రూ. 1.50 లక్షలు, కాంస్యం నెగ్గితే రూ. 75 వేలు ఏఐసీఎఫ్ తరఫున ఇవ్వనున్నారు. ఈ టోర్నీకి ముందు క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు చౌహాన్ తెలిపారు. -
టాప్–6లో నిలుస్తాం
ముంబై: త్వరలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చే అవకాశం ఉందని వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ‘చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలిచే అవకాశముంది. రేటింగ్ పాయింట్లలో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఒలింపియాడ్‌లో ఉండే ఫార్మాట్ ప్రకారం చూస్తే మనం స్వర్ణం గెలిచే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. అయితే ఇతర జట్లూ బలంగా ఉన్నాయి. ఒలింపియాడ్‌లో నేను కూడా పాల్గొనాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
ఒలింపియాడ్‌కూ సిద్ధం
చెన్నై: ఇటీవలే ప్రపంచ చెస్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న భారత దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటానని చెప్పాడు. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ను శుక్రవారం ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు రాష్ట్ర చెస్ సంఘం (టీఎన్‌ఎస్‌సీఏ) ఘనంగా సత్కరించాయి. ఎంతో శ్రమ తర్వాత మళ్లీ వరల్డ్ చాంపియన్ టైటిల్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విషీ అన్నాడు. ‘చాలా కాలంగా ప్రపంచ చాంపియన్ అనే పిలుపుకు దూరమయ్యా. రెండేళ్లుగా నా ప్రదర్శన అనుకున్న రీతిలో లేదు. నేనాడిన చివరి రెండు ర్యాపిడ్ టోర్నీల్లోనూ రాణించలేకపోయాను. కానీ ఈసారి గెలుపు ఇచ్చిన ఆనందం వర్ణించలేనిది. ఈ టైటిల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ టైటిల్‌తో నా పేరు కూడా మారిపోతుంది. ఇక చెస్ ఒలింపియాడ్‌లో కూడా ఆడతా’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు టీమ్ ఈవెంట్లలో పాల్గొనని ఆనంద్ ఒలింపియాడ్‌లో ఆడటంపై ఆసక్తి కనబరచడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు ఏఐసీఎఫ్ రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందజేయగా, టీఎస్‌ఎస్‌సీఏ వెండి ప్రతిమతో సత్కరించింది. -
అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు
ముగిసిన చెస్ ఒలింపియాడ్ * హరికృష్ణ, విదిత్, తానియాలకు చేజారిన కాంస్యాలు * ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌కు అమ్మాయిల జట్టు అర్హత బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. అయితే మూడు కాంస్య పతకాలు గెల్చుకునే అవకాశాన్ని భారత క్రీడాకారులు త్రుటిలో చేజార్చుకున్నారు. పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ, ఆధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, మురళీ కార్తికేయన్‌లతో కూడిన భారత జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది. ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, బొడ్డ ప్రత్యూషలతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో నిలిచినందున భారత మహిళల జట్టు వచ్చే ఏడాది మేలో రష్యాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. 2014లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది. కార్ల్‌సన్‌ను నిలువరించిన హరికృష్ణ నార్వే జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌ను హైదరాబాద్ ప్లేయర్ హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడం విశేషం. హ్యామర్‌తో జరిగిన గేమ్‌ను ఆధిబన్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించగా... విదిత్ 45 ఎత్తుల్లో ఆర్యన్ తారిని ఓడించాడు. అయితే ఫ్రోడ్ ఉర్కెడాల్‌తో జరిగిన గేమ్‌లో సేతురామన్ 25 ఎత్తుల్లో ఓడిపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవరాల్‌గా భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. ‘డ్రా’తో ముగించిన అమ్మాయిలు అమెరికా జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఇరీనా క్రుష్‌తో జరిగిన గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో... కాటరీనా నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను సౌమ్య 94 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. తానియా 78 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీని ఓడించగా... పద్మిని రౌత్ 40 ఎత్తుల్లో నాజి పైకిడ్‌జి చేతిలో ఓడిపోవడంతో భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, అజర్బైజాన్ చేతిలో మాత్రమే ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. చేరువై... దూరమై... ఇక వ్యక్తిగత విభాగాల ప్రదర్శను పరిగణనలోకి తీసుకుంటే... పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ బోర్డు-1పై 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, బోర్డు-3పై విదిత్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో... మహిళల విభాగంలో తానియా బోర్డు-3పై 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను త్రుటిలో కోల్పోయారు. టాప్-3లో నిలిచినవారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. అమెరికా, చైనాలకు స్వర్ణాలు పురుషుల విభాగంలో అమెరికా జట్టు 20 పాయింట్లతో స్వర్ణం సాధించగా...ఉక్రెయిన్, రష్యా, రజత కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. మహిళల విభాగంలో చైనా 20 పాయింట్లతో పసిడి పతకాన్ని కై వసం చేసుకోగా... పోలాండ్, ఉక్రెయిన్ రజత, కాంస్య పతకాలను సంపాదించాయి. 2018 చెస్ ఒలింపియాడ్‌కు జార్జియా ఆతిథ్యం ఇస్తుంది. -
భారత జట్లకు ‘డ్రా’
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు ‘డ్రా’ ఎదురైంది. సోమవారం జరిగిన పదో రౌండ్లో భారత పురుషుల జట్టు 2-2తో రష్యాతో... మహిళల జట్టు 2-2తో ఉక్రెయిన్‌తో ‘డ్రా’ చేసుకున్నాయి. పురుషుల విభాగంలో సెర్గీ కర్జాకిన్‌పై హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందగా... సేతురామన్-గ్రిషుక్; విదిత్-నెపోమ్నియాచిల మధ్య గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. క్రామ్నిక్ చేతిలో ఆధిబన్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో హారిక-అనా ముజిచుక్; పద్మిని-మరియా ముజిచుక్ల మధ్య గేమ్‌లు ‘డ్రా’ అయ్యారుు. జుకోవాపై తానియా సచ్దేవ్ నెగ్గగా... ఉషెనినా చేతిలో సౌమ్య ఓడిపోయింది. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొమ్మిదో రౌండ్లో భారత మహిళల జట్టు 3-1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా... పురుషుల జట్టు 1.5-2.5తో ఉక్రెయిన్ చేతిలో ఓడిపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 30 ఎత్తుల్లో పెంగ్ జావోకిన్‌పై, పద్మిని రౌత్ 62 ఎత్తుల్లో ఆనీ హాస్ట్‌పై, తానియా సచ్దేవ్ 38 ఎత్తుల్లో అనా మజా కజారియన్‌పై నెగ్గగా... సౌమ్య 40 ఎత్తుల్లో మైకి కిట్‌మాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ 62 ఎత్తుల్లో కారోబోవ్ చేతిలో ఓడిపోయాడు. -
భారత జట్ల గెలుపు
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాలు సాధించాయి. శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో పురుషుల జట్టు 2.5-1.5తో ఇంగ్లం డ్‌పై, మహిళల జట్టు 2.5-1.5తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచాయి. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తమ గేమ్ లను ‘డ్రా’ చేసుకోగా... నెజైల్ షార్ట్‌పై సేతురామన్ 41 ఎత్తుల్లో గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. మహిళల విభాగంలో హారిక 37 ఎత్తు ల్లో నఫీసాపై గెలుపొందగా... పద్మిని, సౌమ్య, బొడ్డ ప్రత్యూష తమ ప్రత్యర్థులతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేశారు. -
భారత జట్లకు తొలి ఓటమి
బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు తొలి పరాజయం ఎదురైంది. ఏడో రౌండ్లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 0.5-3.5తో ఓడిపోగా... మహిళల జట్టు 1.5-2.5తో అజర్బైజాన్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో ఫాబియానో కరువానాతో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 46 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నకముర చేతిలో ఆధిబన్, సో వెస్లీ చేతిలో విదిత్, శంక్‌లాండ్ చేతిలో సేతురామన్ ఓడిపోయారు. మహిళల విభాగంలో జైనబ్‌తో జరిగిన గేమ్‌ను హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... సౌమ్య స్వామినాథన్ 63 ఎత్తుల్లో అయ్‌దాన్‌పై గెలిచింది. పద్మిని రౌత్ 59 ఎత్తుల్లో గునెయ్ చేతిలో, తానియా 36 ఎత్తుల్లో గుల్నార్ చేతిలో ఓటమి చవిచూశారు. -
అగ్రస్థానంలోకి భారత్
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలి సారి పురుషుల విభాగంలో భారత జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఆరో రౌండ్ పోటీల్లో భారత్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పోరులో భారత్ 2.5-1.5 పాయింట్ల తేడాతో నెదర్లాండ్సను ఓడించింది. ఆదిబన్ విజయం సాధించగా... హరికృష్ణ, విదిత్ గుజరాతీ, ఎస్పీ సేతురామన్ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. మహిళలు కూడా... మహిళల విభాగంలోనూ భారత్ 2.5-1.5 తేడాతో లాత్వియాపై గెలుపొందింది. ద్రోణవల్లి హారిక 26 ఎత్తుల్లో డానా ఒజోలాపై... సౌమ్య స్వామినాథన్, ఇంగునాపై విజయం సాధించారు. బెర్జినా ఇల్జే చేతిలో తాన్యా సచ్దేవ్ పరాజయం పాలు కాగా... పద్మినీ రౌత్, లౌరా రోగులే మధ్య 140 ఎత్తుల పాటు హోరాహోరీగా సాగిన గేమ్ డ్రాగా ముగిసింది.