చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలి సారి పురుషుల విభాగంలో భారత జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలి సారి పురుషుల విభాగంలో భారత జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఆరో రౌండ్ పోటీల్లో భారత్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పోరులో భారత్ 2.5-1.5 పాయింట్ల తేడాతో నెదర్లాండ్‌సను ఓడించింది. ఆదిబన్ విజయం సాధించగా... హరికృష్ణ, విదిత్ గుజరాతీ, ఎస్పీ సేతురామన్ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు.
మహిళలు కూడా...
మహిళల విభాగంలోనూ భారత్ 2.5-1.5 తేడాతో లాత్వియాపై గెలుపొందింది. ద్రోణవల్లి హారిక 26 ఎత్తుల్లో డానా ఒజోలాపై... సౌమ్య స్వామినాథన్, ఇంగునాపై విజయం సాధించారు. బెర్జినా ఇల్జే చేతిలో తాన్యా సచ్‌దేవ్ పరాజయం పాలు కాగా... పద్మినీ రౌత్, లౌరా రోగులే మధ్య 140 ఎత్తుల పాటు హోరాహోరీగా సాగిన గేమ్ డ్రాగా ముగిసింది.