
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. కెనడాతో బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్ 3.5–0.5తో గెలుపొందింది. భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, శశికిరణ్ నెగ్గగా... విదిత్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ఆనంద్ 33 ఎత్తుల్లో ఎరిక్ హాన్సెన్‌పై, హరికృష్ణ 33 ఎత్తుల్లో రజ్వాన్ ప్రెటుపై, శశికిరణ్ 28 ఎత్తుల్లో అమన్ హంబిల్టన్‌పై గెలిచారు.
విదిత్, ఎవగెని బరీవ్ మధ్య గేమ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. మరోవైపు సెర్బియాతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులను ఓడించగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లకు పరాజయం ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment