చెస్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..! | PM Narendra Modi Inaugurated 44th Chess Olympiad In Chennai | Sakshi
Sakshi News home page

చెస్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..!

Published Thu, Jul 28 2022 9:51 PM | Last Updated on Fri, Jul 29 2022 7:36 AM

PM Narendra Modi Inaugurated 44th Chess Olympiad In Chennai - Sakshi

‘విశ్వ’ వేడుకకు భారత్‌ వేదికైంది. అంబరాన్నంటే సంబరాలు.. ఆహుతులను మంత్రముగ్ధులను చేసే లేజర్‌ షోలు, చూపరులను కట్టిపడేసే    సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల ప్రారంభోత్సవం గురువారం  రాత్రి నభూతో నభవిష్యతీ అన్న రీతిలో సాగింది. అత్యంత వైభవంగా ముస్తాబైన.. చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తమ  దేశ జెండాలు, ప్లకార్డులను చేతబూని సభా ప్రాంగణంలో వివిధ దేశాల క్రీడాకారులు ర్యాలీ చేశారు. జనగణమన.. తమిళ్‌తాయ్‌ వాళ్తు    గీతాలను గాయకులు ఆలపించారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ప్రపంచ స్థాయి పోటీలకు భారత్‌ వేదిక కావడం చారిత్రాత్మకం అని.. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.  

సాక్షి , చెన్నై: చెన్నై వేదికగా ప్రపంచ చెస్‌ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పరాజితులు ఉండరు.. విజేతలు, భావి విజేతలు మాత్రమే ఉంటారని ఉద్బోధించారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాలను ఆలపించారు.     సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.  

విశ్వనాథన్‌ ఆనంద్‌ తీసుకురాగా.. 
చెస్‌ ఒలంపియాడ్‌ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్‌ అందుకున్నారు. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్‌ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, మరో మంత్రి ఎల్‌. మురుగన్‌ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకమైన చెస్‌ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయని, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవాలు జరుపుతున్న వేళ చెస్‌ పోటీలు జరగడం చారిత్రాత్మకమన్నారు.. ‘‘చాలా తక్కువ వ్యవధిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి అతిథి దేవో భవ అని నిరూపించారు. చెస్‌ క్రీడకు భారత్‌లో ప్రత్యేక స్థానం ఉంది. చెన్నైలో జరుగుతున్న ఈ పోటీ లు చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. చెస్‌ ఒలంపియాడ్‌ సందర్భంగా దేశంలో పర్యటించిన టార్చ్‌ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎందరో క్రీడాకారులను ఉత్తేజ పరిచింది. ఇందుకు ప్రతి భారతీయునికి వందనాలు సమర్పిస్తున్నాను.

చెస్‌తో తమిళనాడుకు చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. తమిళనాడు నుంచి ఎందరో చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌లు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతున్నారు. చెస్‌ క్రీడలు స్ఫూర్తే కాదు, ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తుంది. పోస్ట్‌ కోవిడ్‌తో భారత్‌ మానసికంగా, శారీరకంగా.. చాలా దృఢంగా మారింది అనేందుకు ఈ క్రీడలే నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను నిర్వహించి క్రీడావృద్ధి చెందడం తథ్యం. యువత మన దేశానికి ఒక పెద్ద శక్తి. ఇక్కడి మహిళల్లోనిS నాయకత్వ లక్షణాలు భారత్‌కు తలమానికం. చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు భారత్‌ ఘన స్వాVýæతం పలుకుతోంది’’ అని ఆయన అన్నారు. 

తమిళ ఖ్యాతి ఇనుమడించేలా.. 
ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ, ఈ చెస్‌ పోటీలు ప్రపంచం మన వైపు చూసేలా చేశాయని, తమిళనాడు ఖ్యాతిని మరింత పెరిగేలా మార్చాయని అభిప్రాయపడ్డారు.. ‘‘కఠోర శ్రమ తోనే ఇది సాధ్యమైంది. ప్రపంచ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌లలో ఇండియా అగ్రశ్రేణిలో ఉంది. అందులో 36 శాతం గ్రాండ్‌మాస్టర్‌లు తమిళనాడుకు చెందిన వారే. చెస్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా తమిళనాడు విరాజిల్లుతోంది. చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. ఇది దేశానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. చారిత్రాత్మకమైన ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడం ఆనందదాయకం.

మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న కాలంలో 20 వేల మంది క్రీడాకారులతో చెస్‌ పోటీలను నిర్వహించి చెస్‌పై ఆయనకున్న మక్కువను ఆనాడే చాటారు. ఇక ఈ పోటీలకు ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లాలని భావించాను. అయితే కరోనా సోకడం వల్ల వీలుకాలేదు. ఈ సమయంలో ప్రధాన మోదీ నాకు ఫోన్‌ చేసి మీరు విశ్రాంతి తీసుకోండి.. నేను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఈ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు రష్యాలో జరగాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల అక్కడ నిర్వహించలేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు.

ఈ సమయంలో భారత్‌లో జరపాలని భావించడం ఇందు కు తమిళనాడు సిద్ధం కావడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలను విజయవంతం చేసేందుకు 18 ఉప సంఘాలను నియమించాను. కేవలం నాలుగు నెలలలోనే అద్భుతంగా ఏర్పాట్లు చేసిన వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. అంతేకాక పాఠశాల స్థాయిలోనే చెస్‌ క్రీడను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదృష్టంపై ఆధారపడి కాదు, మేధస్సు, తెలివితేటలు ఏకాగ్రతతో ఇది ముడిపడి ఉంటుంది.’’అని ఆయన వివరించారు. 

చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్‌..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement