
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో భారత్ విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న భారత పురుషుల జట్టు అమెరికా చేతిలో ఓటమి పాలైంది. గురువారం జరిగిన నాలుగో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అమెరికా చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... 26 ఎత్తుల్లో కరువానా ఫాబియానో చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం వెస్లీతో జరిగిన గేమ్‌ను 32 ఎత్తుల్లో పెంటేల హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు.
నకముర హికారు – విదిత్ గుజరాతీ (35 ఎత్తులు), శాంక్‌లాండ్ శామ్యూల్ – శశికిరణ్ మధ్య (21 ఎత్తులు) జరిగిన గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మరోవైపు పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 3–1తో గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్ విజయం సాధించగా... మరో ఆంధ్ర గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఇషా కరవాడే తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. జొలాంటాపై 62 ఎత్తుల్లో హారిక, క్లాడియాపై 45 ఎత్తుల్లో తానియా గెలుపొందారు. మోనికతో గేమ్‌ను 52 ఎత్తుల్లో హంపి, వరకోమ్‌స్కాతో గేమ్‌ను 45 ఎత్తుల్లో ఇషా కరవాడే ‘డ్రా’ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment