నేటి నుంచి చెస్ ఒలింపియాడ్
ఓపెన్, మహిళల విభాగాల్లో ఫేవరెట్స్‌గా భారత జట్లు
బరిలో అర్జున్, హరికృష్ణ, హారిక
5 చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు లభించిన పతకాలు. ఓపెన్ విభాగంలో రెండు కాంస్యాలు (2014, 2022) ... మహిళల విభాగంలో ఒక కాంస్యం (2022) లభించింది. కరోనా సమయంలో 2020లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత జట్టు సంయుక్త విజేతగా నిలువగా... 2021లో కాంస్యం దక్కింది.
బుడాపెస్ట్ (హంగేరి): రెండేళ్ల క్రితం స్వదేశంలో తొలిసారి జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఓపెన్ విభాగంతోపాటు మహిళల విభాగంలోనూ భారత జట్లు కాంస్య పతకాలు గెల్చుకున్నాయి. నేటి నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే 45వ చెస్ ఒలింపియాడ్‌లో గతం కంటే ఘనమైన ప్రదర్శన ఇచ్చేందుకు భారత జట్లు సిద్ధమయ్యాయి. గత రెండేళ్ల కాలంలో భారత చెస్ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో మరింతగా రాటుదేలారు.
తమిళనాడు యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో నవంబర్‌లో తలపడనున్నాడు. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి, పెంటేల హరికృష్ణ కూడా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి భారత్ తరఫున మూడో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది.
జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ ర్యాంక్‌కు చేరుకోగా... సీనియర్ స్టార్ తానియా సచ్‌దేవ్, వంతిక అగర్వాల్ కూడా తమదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించగల సమర్థులే. ఈ నేపథ్యంలో చెస్ ఒలింపియాడ్‌లో భారత ఓపెన్, మహిళల జట్లు ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి.
ఓపెన్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్‌తోపాటు గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి, పెంటేల హరికృష్ణ... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్ భారత జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్ విభాగంలో 197 జట్లు... మహిళల విభాగంలో 184 జట్లు పోటీపడుతున్నాయి.
ఓపెన్ విభాగంలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, ఉజ్బెకిస్తాన్, నార్వే, నెదర్లాండ్స్ జట్లు... మహిళల విభాగంలో జార్జియా, పోలాండ్, ఉక్రెయిన్, బల్గేరియా జట్లు ఫేవరెట్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment