‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’ | Star javelin thrower Neeraj Chopras grief | Sakshi
Sakshi News home page

‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’

Published Sat, Apr 26 2025 3:29 AM | Last Updated on Sat, Apr 26 2025 3:29 AM

Star javelin thrower Neeraj Chopras grief

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఆవేదన

అర్షద్‌ నదీమ్‌ను భారత్‌లోటోర్నీకి ఆహ్వానించడమే కారణం

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు కూడా దేశంలోని దురభిమానుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాను నిర్వహించబోయే ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ టోర్నీ కి పాకిస్తాన్‌ ఆటగాడు, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత అర్షద్‌ నదీమ్‌ను అతను ఆహ్వానించడమే అందుకు కారణం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తానీయులపై భారత అభిమానులు సహజంగానే ఆగ్రహంతో ఉన్నారు. 

దానిని ఇప్పుడు నీరజ్‌పై చూపిస్తున్నారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే నదీమ్‌ను నీరజ్‌ ఆహ్వానించాడు. టోర్నీ జరిగే సమయంలో తాను గతంలోనే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం విదేశాల్లో ఉంటున్నానని, అందుకు హాజరు కాలేనని కూడా నదీమ్‌ స్పష్టం చేసేశాడు. ‘సహచర భారతీయుల్లాగే నేను కూడా కశీ్మర్‌ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను. దానిపై చాలా ఆగ్రహంగా కూడా ఉన్నాను. అయితే నాపై కొందరు చూపిస్తున్న విద్వేషం ఊహించలేనిది. వారి మాటల్లో ఎన్నో తిట్లు కనిపిస్తున్నాయి. 

నేను సాధారణంగా ఇలాంటివి పట్టించుకోను. కానీ దానిని బలహీనతగా భావించవద్దు. పైగా దేశం పట్ల నా అంకితభావాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను. అర్షద్‌కు ఆహ్వానం పంపడం ఒక క్రీడాకారుడి కోణంలోనే చూడాలి. నా ఈవెంట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేశాను. అయతే పహల్గాం ఘటనకు ముందే అందరినీ ఆహ్వానించాం’ అని నీరజ్‌ గుర్తు చేశాడు.  

మా కుటుంబాన్ని వదిలేయండి! 
కశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన తర్వాత కొందరు వ్యక్తులు తన తల్లిని కూడా వదలడం లేదని, ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయిస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో అర్షద్‌ స్వర్ణం, నీరజ్‌ రజతం గెలిచిన సమయంలో ‘అర్షద్‌ కూడా నా కొడుకులాంటివాడే’ అని నీరజ్‌ తల్లి సరోజ్‌ చెప్పింది. ‘జనాలు తమ అభిప్రాయాలు వేగంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు కనిపిస్తోంది. 

ఏడాది క్రితం మా అమ్మ ఏదో నిరాడంబరత్వం, భోళాతనంతో ఒక మాట అంది. అప్పుడు ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడేమో ఆ మాటను పట్టుకొని అమ్మను తిట్టడం బాధగా ఉంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకోవడం, నేను వివరణలు ఇచ్చుకోవడం చాలా బాధగా ఉంది. నా గురించి తప్పుడు మాటలు ప్రచారం చేయకండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి’ అని ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌ మేజర్‌ హోదాలో ఉన్న నీరజ్‌ చోప్రా విజ్ఞప్తి చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement