స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదనుకున్నానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. జావెలిన్ పట్టుకుంటే వంద శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెడతానని.. అది ఎంత దూరం వెళ్తుందనే దాన్ని పట్టించుకోనని నీరజ్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన నీరజ్.. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఎక్కువ ఆలోచించడం లేదని.. అది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉందో అప్పుడే జరుగుతుందని పేర్కొన్నాడు.
2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచి.. అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున తొలి పసిడి గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన నీరజ్.. తాజాగా ‘పారిస్’ క్రీడల్లో గాయంతోనే రజతం గెలిచి అదుర్స్ అనిపించుకున్నాడు. విశ్వ క్రీడల అనంతరం స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్న నీరజ్‌చోప్రా.. శనివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘మెరుగైన ప్రదర్శన చేసే విధంగా సిద్ధం కావడమే నా చేతిలో ఉంది. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఇప్పటికే ఎక్కువ చర్చ జరిగింది. ఇకపై దాని గురించి ఆలోచించొద్దని అనుకుంటున్నా.
రాబోయే రెండు మూడు టోరీ్నల్లో వంద శాతం ప్రయత్నిస్తా.. ఫలితం ఎలా వస్తుందో చూస్తా. పారిస్ పోటీల్లో నదీమ్ విసిరిన దూరాన్ని అందుకోలేనని ఒక్క శాతం కూడా అనిపించలేదు’ అని 26 ఏళ్ల నీరజ్ అన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్ నుంచి గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నీరజ్.. వచ్చే నెల బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ అనంతరం చికిత్స చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పారిస్ క్రీడల్లో గాయంతోనే బరిలోకి దిగిన నీరజ్.. ఆ ప్రభావం కూడా తన ప్రదర్శనపై పడిందని అన్నాడు.
‘జావెలిన్‌ను మరింత దూరం విసరగలనని అనుకున్నా. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్, ఫైనల్లో నేను వేసిన రెండు త్రోలు నా కెరీర్‌లో రెండో, మూడో అత్యుత్తమ త్రోలు. అందులో ఒకటి సీజన్ బెస్ట్ కూడా. వంద శాతం కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అయితే గాయం భయంతో పూర్తి ఎఫర్ట్ పెట్టనట్లు అనిపించింది. త్రో చేయడానికి ముందు జావెలిన్‌తో పరిగెడుతున్నప్పుడు గజ్జల్లో ఇబ్బందిగా ఉంది.
దీంతో పాటు జావెలిన్ వదిలే కోణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. దేశంలో క్రీడల ప్రాముఖ్యత పెరగాలి. ప్రత్యేకంగా ఒక ఆట అని కాకుండా.. అన్నింటిలో ఎదిగితేనే స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా మారగలం. క్రికెట్‌లో మెరుగైన స్థితిలో ఉన్నాం. వచ్చే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించడంతో పాటు.. ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించే దిశగా అడుగులు వేయాలి’ అని నీరజ్ వివరించాడు.
లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్
ఈ నెల 22 నుంచి లుసానే వేదికగా జరగనున్న డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నట్లు నీరజ్ చోప్రా ప్రకటించాడు. సెప్టెంబర్‌లో జరగనున్న బ్రస్సెల్స్ డైమండ్ లీగ్‌తో సీజన్ ముగియనుండగా.. ఆ తర్వాతే గాయానికి చికిత్స తీసుకోవాలని నీరజ్ భావిస్తున్నాడు. ‘లుసానే లీగ్‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నా.
మరో నెల రోజుల్లో సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాతే చికిత్సపై దృష్టి పెడతా. డైమండ్ లీగ్‌కు ముందు శిక్షణ కోసం స్విట్జర్లాండ్‌కు వచ్చా. వైద్యుల పర్యవేక్షణలో ట్రైనింగ్ సాగుతుంది. ఒకసారి పోటీలు ముగిసిన తర్వాత గాయం గురించి ఆలోచిస్తా’ అని నీరజ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment