
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
గురువారం పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్ చర్యలను ప్రకటించింది.
భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్ ప్రభుత్వం.. భారత్ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.