చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జట్లకు ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు బోర్డులో ఎత్తు వేసినవారంతా విజేతలుగానే నిలిచారు. ఓపెన్‌లో మూడు, మహిళల్లో మరో మూడు... ఈ ఆరు జట్ల తరఫున బరిలోకి దిగిన 24 మంది ఆటగాళ్లు విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీలో ఇరిగైసి అర్జున్, విదిత్ సంతోష్ గుజరాతీ, నారాయణన్, శశికిరణ్ కృష్ణన్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 4–0తో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. విదిత్ సంతోష్... మకొటో రాడ్‌వెల్‌పై గెలుపొందగా, రెండో బోర్డులో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు అర్జున్, మనాంగో స్పెన్సర్‌ను ఓడించాడు.
32 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఎమరాల్డ్ ముషోర్‌పై ఎస్.ఎల్.నారాయణన్, జెంబా జెముసెపై శశికిరణ్ గెలుపొందారు. భారత ‘బి’ జట్టు 4–0తో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)పై నెగ్గింది. అల్ హొసానిపై గుకేశ్, ఇబ్రహీమ్‌పై శరీన్ నిహిల్, సయీద్‌పై ఆధిబన్, అబ్దుల్ రహమాన్‌పై రౌనక్ విజయం సాధించారు. భారత ‘సి’ జట్టు కూడా 4–0తో దక్షిణ సుడాన్‌పై నెగ్గింది. సైప్రియానోపై సేతురామన్, అజక్ మచ్ దువనీపై అభిజిత్ గుప్తా, గాంగ్ తోన్ గాంగ్‌పై మురళీ కార్తికేయన్, మజుర్ మన్యంగ్‌పై అభిమన్యు పీటర్ గెలుపొందారు.
మహిళల విభాగంలో కూడా ఆతిథ్య జట్లు శుభారంభం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్ర శ్రేణి గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, వైషాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలున్న భారత్ ‘ఎ’ 4–0తో తజికిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. నదెజ్దా అంటొనొవాపై హంపి 41 ఎత్తుల్లో అలవోక విజయం సాధించింది. సబ్రినాపై వైషాలీ, రుక్సోనా సైదొవాపై తానియా, ముత్రిబా హొతమిపై భక్తి గెలిచారు. భారత్ ‘సి’ అమ్మాయిల జట్టు 4–0తో హాంకాగ్‌పై నెగ్గింది. లామ్ క యాన్‌పై బొడ్డా ప్రత్యూష, సిగప్పి కన్నప్పన్‌పై ఇషా కరవాడే, డెంగ్ జింగ్ జిన్‌పై పీవీ నందిదా, లి జాయ్ చింగ్‌పై సాహితి వర్షిణి విజయం సాధించారు. ‘బి’ జట్టు కూడా 4–0తో వేల్స్‌పై గెలిచింది. స్మిత్ ఒలివియాపై వంతిక అగ్రావల్, చాంగ్ కింబెర్లీపై సౌమ్య స్వామినాథన్, 1–0తో హియా రేపై మేరి ఆన్ గోమ్స్, ఖుషీ బగ్గాపై దివ్య దేశ్‌ముఖ్ నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment