
చెన్నై: ఇటీవలే ప్రపంచ చెస్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న భారత దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటానని చెప్పాడు. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ను శుక్రవారం ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు రాష్ట్ర చెస్ సంఘం (టీఎన్‌ఎస్‌సీఏ) ఘనంగా సత్కరించాయి. ఎంతో శ్రమ తర్వాత మళ్లీ వరల్డ్ చాంపియన్ టైటిల్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విషీ అన్నాడు. ‘చాలా కాలంగా ప్రపంచ చాంపియన్ అనే పిలుపుకు దూరమయ్యా. రెండేళ్లుగా నా ప్రదర్శన అనుకున్న రీతిలో లేదు. నేనాడిన చివరి రెండు ర్యాపిడ్ టోర్నీల్లోనూ రాణించలేకపోయాను. కానీ ఈసారి గెలుపు ఇచ్చిన ఆనందం వర్ణించలేనిది.
ఈ టైటిల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ టైటిల్‌తో నా పేరు కూడా మారిపోతుంది. ఇక చెస్ ఒలింపియాడ్‌లో కూడా ఆడతా’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు టీమ్ ఈవెంట్‌లలో పాల్గొనని ఆనంద్ ఒలింపియాడ్‌లో ఆడటంపై ఆసక్తి కనబరచడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు ఏఐసీఎఫ్ రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందజేయగా, టీఎస్‌ఎస్‌సీఏ వెండి ప్రతిమతో సత్కరించింది.