దశాబ్ద కాలంలోనే భారత్‌లో యాభై మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు అవతరించారు. చెస్ ఒలింపియాడ్‌లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. చెస్‌కు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. అయితే దేశంలో చదరంగ విప్లవానికి ఇది నాంది మాత్రమే. మున్ముందు జరగాల్సింది చాలా మిగిలి ఉంది. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఇంకో భారతీయుడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడా? ఏమైనా, భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందని మాత్రం తప్పక చెప్పవచ్చు.
బిందువు బిందువు సింధువైనట్లు...
ముందు కొంతమంది యువ ప్రతిభావంతులు చెస్ గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగారు. ఆ తరువాత పరిపక్వత లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. చెస్ ఒలింపియాడ్‌లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. భారతీయ చదరంగ చరిత్రలో డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద నేతృత్వంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. వీరితోపాటు ఎంతోమంది యువ కులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులను అధిరోహిస్తున్నారు.
గత ఏడాది చెస్ ఒలింపియాడ్ సందర్భంగా భారతీయ క్రీడా కారుల ఆటతీరును గమనించినప్పుడు ఇలాంటిది ఏదో జరగాలని మనం ఆశించాము. ఆ పోటీల్లో ఇండియా–బి బృందం ఓపెన్ కేటగి రిలో కాంస్య పతకం సాధించింది. మహిళా క్రీడాకారులు కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. అయితే ఫైడ్ చెస్ ర్యాంకింగ్‌లో గుకేశ్ టాప్–10లో ఒకడిగా ఎదగడంతో మిగిలిన వారు కూడా ఇప్పుడు మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదరంగంలో అతితక్కువ కాలంలో వచ్చిన ఈ గుణాత్మక మార్పునకు కారణాలు ఎన్నో. చెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. ఆటగాళ్లకూ, ఆటకూ ఎక్స్ పోజర్ కూడా బాగుంది. అత్యున్నతస్థాయి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యానికి కొరతే లేదు. దేశంలో చదరంగం మరింత ఎదిగేందుకు ఈ నైపుణ్యమే కీలకం.
విస్తృతస్థాయిలో నైపుణ్యం ఉండటం పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కాస్తా ఆటగాళ్లు మరింత రాటుదేలేందుకు ఉపయోగ పడుతుంది. భారత్ తరఫున ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లేదా వరల్‌కప్ పోటీల్లో పాల్గొనాలంటే అత్యున్నత స్థాయి ఆట ఆడాల్సి ఉంటుంది. మనకేం ఫర్వాలేదు అనుకునే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. అందరూ ముంగాళ్లపై నుంచోవాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే.
ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూంటారు. మంచి మిత్రులే కానీ, ఆట విషయానికి వస్తే మాత్రం ఎవరి గుట్లు వారి వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆ రహస్యాలే వారికి ఏదో ఒక రోజు విజయాన్ని సంపాదించి పెట్టవచ్చు. ఇక్కడ చాలామంది టాప్ ర్యాంకింగ్ ఆటగాళ్లను మాత్రమే చూస్తున్నారు. కానీ కింది స్థాయిలోనూ చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.
నేను భారతదేశంలో నంబర్ వన్ (1986 జూలై ఒకటవ తేదీన 2405 ఎలో రేటింగ్‌తో ప్రవీణ్ థిప్సే కంటే ముందుకు వెళ్లినప్పుడు)గా మారినప్పుడు దరిదాపుల్లో ఇంకో ఆటగాడు కనిపించలేదు. 1988లో ఇరవై ఏళ్ల వయసులో నేను గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు పోటీల గురించి కాకుండా, రానున్న మూడేళ్లలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎలా అని ఆలోచించాను.
నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి! 1988లో నేను గ్రాండ్ మాస్టర్‌గా అవతరిస్తే, మూడేళ్ల తరువాత 1991లో దివ్యేందు బారువా ఆ ఘనత సాధించాడు. ప్రవీణ్ థిప్సే 1997 నాటికి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు పరిస్థితిలో చాలామార్పు వచ్చింది. 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు 50 మంది గ్రాండ్‌మాస్టర్లుగా ఎదిగారు. ఎలో రేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉన్న భారతీయ గ్రాండ్ మాస్టర్లు (పాక్షికంగా రిటైరైన నాతో కలిపి) ఆరుగురు ఉన్నారిప్పుడు.
గ్రాండ్ మాస్టర్ కావడం చాలా గొప్పవిషయమే అయినప్పటికీ ప్రస్తుతం సాధారణమైపోయింది. మారుతున్న కాలానికి నిదర్శనం ఇది. ఈ తరానికి ఇంకో సానుకూల అంశమూ ఉంది. నాకున్న దశాబ్దాల అనుభవంపై వారు ఆధారపడవచ్చు. అలాగే ఎందరో చెస్ గురు వుల ప్రస్థానాల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చాలా కీలకం. కానీ మాలాంటివాళ్లం ఈ తరం ఆటగాళ్లకు మార్గ దర్శనం మాత్రమే చేయించగలం.
టాప్ లెవల్ ఆటగాళ్లందరికీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి ఆటగాళ్లను వేరు చేసే అంశాలు వారి ప్రవర్తన, నిత్యం ఉన్నతస్థాయి ఆటను కొనసాగించగలగడం, శారీరక దారుఢ్యం, ఒత్తిడికి లోనుకాకపోవడం. అంతేకాదు... ఆట విషయంలో సమగ్రత కూడా చాలా అవసరం. ప్రత్యర్థి ఎప్పుడు ఏ రకమైన సవాలు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండటం అవసరం.
కొంతమంది ప్రత్యర్థులు మీరు తయారైన దానికంటే భిన్నమైన రీతిలో దాడికి దిగవచ్చు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? దేనిపై ఆధారపడతారు? మీ లెక్కకు చిక్కని విషయమని భావిస్తారా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే బాగా శ్రమించడం అన్నదానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎలో రేటింగ్ 2700కు చేరుకోవడం కూడా ఈ శ్రమలో భాగమే.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. భారతీయ చదరంగం కేవలం పురుషులకు మాత్రమే చెందింది కాదు. దేశంలో చదరంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే మహిళా క్రీడాకారులు కూడా బాగా రాణించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్యలో చాలా అంతరం ఉంది. భారత్‌లోనే కాదు... ప్రపంచం మొత్తమ్మీద ఇదే పరిస్థితి.
ఈ అంత రాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాడమీ ఏర్పాటు ద్వారా మేమీ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తామన్న నమ్మ కమూ ఉంది. కోనేరు హంపి, డి.హారిక, ఇతరుల స్థాయుల మధ్య చాలా అంతరం ఉంది. ఉన్నత స్థానంలో ఏళ్ల తరబడి కొనసాగేందుకు తగిన జ్ఞానం హారిక, హంపికి ఉంది. అయితే మిగిలిన వారు సమీప భవిష్యత్తులోనే వీరికి సవాలు విసరగలరని ఆశిస్తున్నా. ఒకే ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు కదా! అసలైన విప్లవం అందరినీ తోడుతీసుకునే మొదలవుతుంది.
గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ చదరంగంలో మారుతున్న తరానికి ప్రతినిధులు. నా అనుభవం వారికి ఉపయోగపడుతుంది కానీ, వారు తమ సొంత మార్గంలో మరింత దూరం ప్రయాణించడం అలవర్చు కోవాలి. తమ సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. కొత్త హోదా, హంగు ఆర్భాటాలకు వారిప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. ఎదురుదెబ్బలూ వారికి ఎదురు కావచ్చు. ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కాకపోతే వీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం సరైందనే చెప్పాలి. మిగిలినవి ఎలా ఉన్నా ఇది చాలా ముఖ్యం.
ప్రస్తుతం భారత దేశ చదరంగం ఒక్కో అడుగే ముందుకేయాలి. ఎదుగుతున్నప్పటికీ అందుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. విçస్తృతమైన, లోతైన వ్యవస్థ అక్కరకొచ్చే అంశం. కాలం గడుస్తున్న కొద్దీ ఒకదానికి ఒకటి పూరకంగా వ్యవహరిస్తాయి. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారా? ఇంకో భారతీ యుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఒకే మాట చెప్పవచ్చు. భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందీ అని!
విశ్వనాథన్ ఆనంద్
వ్యాసకర్త ప్రపంచ ఛాంపియన్ షిప్ ఐదుసార్లు నెగ్గిన చదరంగ క్రీడాకారుడు
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment