భారత చెస్‌పై విశ్వనాథన్ ఆనంద్ ప్రత్యేక ముద్ర
తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అందరికీ స్ఫూర్తి
అకాడమీ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం
ఒలింపియాడ్‌లో భారత జట్ల మెరుగైన ప్రదర్శనకు కృషి
‘చదరంగపు సంస్కృతి కనిపించని దేశం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రపంచ చాంపియన్ కావడమే కాదు, ఆటపై ఆసక్తి పెంచుకొని దానిని ముందుకు తీసుకెళ్లగలిగేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా నమ్మలేని విషయం, అసాధారణం.
ఆ దిగ్గజమే విశ్వనాథన్ ఆనంద్’... భారత జట్టు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన తర్వాత టాప్ చెస్ ప్లేయర్, ప్రపంచ 2వ ర్యాంకర్ నకముర ఆనంద్ గురించి చేసిన ప్రశంస ఇది. భారత చెస్ గురించి తెలిసిన వారెవరైనా ఈ మాటలను కాదనలేరు. ఆటగాడిగా మన చదరంగంపై ఆనంద్ వేసిన ముద్ర అలాంటిది.
చెస్ క్రీడను పెద్దగా పట్టించుకోని సమయంలో 19 ఏళ్ల వయసులో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన ఆనంద్... ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్త తరానికి బ్యాటన్‌ను అందించి సగర్వంగా నిలిచాడు. ఆనంద్ జీఎంగా మారిన తర్వాత ఈ 36 ఏళ్ల కాలంలో మన దేశం నుంచి మరో 84 మంది గ్రాండ్‌మాస్టర్లుగా మారగా... ఇందులో 30 మంది తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం.
‘వాకా’తో విజయాలు...
నాలుగేళ్ల క్రితం ఆనంద్ తన కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మెల్లగా తాను ఆడే టోర్నీల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయమది. తన ఆట ముగిసిపోయాక భవిష్యత్తులో ప్రపంచ చెస్‌లో భారత్ స్థాయిని కొనసాగించేలా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భావించాడు. ఈ క్రమంలో వచ్చి0దే చెస్ అకాడమీ ఏర్పాటు ఆలోచన. చెన్నైలో వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)ని అతను నెలకొల్పాడు.
ఇక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అద్భుత ఫలితాలను అందించి ఆనంద్ కలలకు కొత్త బాట వేసింది. దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి ఇందులో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి కూడా ఇక్కడ శిక్షణ పొందాడు. ‘విషీ సర్ లేకపోతే ఇవాళ మేం ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదు’... గుకేశ్, ప్రజ్ఞానంద తరచుగా చెబుతూ రావడం వారి కెరీర్ ఎదుగుదలలో ఆనంద్ పాత్ర ఏమిటో చెబుతుంది.
యువ చెస్ ఆటగాళ్ల కెరీర్ దూసుకుపోవడంలో తల్లిదండ్రులు, ఆరంభంలో కోచింగ్ ఇచ్చిన వారి పాత్రను ఎక్కడా తక్కువ చేయకుండా వారిపైనే ప్రశంసలు కురిపించిన ఆనంద్ ‘వాకా’తో తాను ఎలా సరైన మార్గ నిర్దేశనం చేశాడో ఒలింపియాడ్ విజయానంతరం వెల్లడించాడు.
జూనియర్ దశను దాటుతూ...
యువ ఆటగాళ్లను విజయాల వైపు సరైన దిశలో నడిపించడం అకాడమీ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమని అతను చెప్పాడు. తన కెరీర్ ప్రారంభంలో సోవియట్ యూనియన్‌లో ఉన్న చెస్ సంస్కృతిని చూసి అకాడమీ ఆలోచన వచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నాడు. అక్కడ దిగువ స్థాయికి పెద్ద ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఈ అకాడమీలు సంధానకర్తలుగా వ్యవహరిస్తాయని అతను వెల్లడించాడు. ‘భారత ఆటగాళ్లు ర్యాంకింగ్‌పరంగా తరచుగా టాప్–200లోకి దూసుకొస్తున్నారు.
కానీ టాప్–100లోకి మాత్రం రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతిభావంతులను ఆ దిశగా సాధన చేయించడం ముఖ్యమని భావించా. వారి విజయాల్లో మా పాత్రను పోషించడం సంతృప్తినిచ్చే విషయం’ అని ఆనంద్ తన అకాడమీ ప్రాధాన్యతను గురించి పేర్కొన్నాడు. 14 ఏళ్ల కంటే ముందే గ్రాండ్‌మాస్టర్లుగా మారిన ఆటగాళ్లను ఆనంద్ తన అకాడమీలోకి తీసుకున్నాడు.
జూనియర్ స్థాయిలో సంచలనాలు సాధించి సీనియర్‌కు వచ్చేసరికి ఎక్కడా కనిపించకపోయిన ప్లేయర్లు చాలా మంది ఉంటారు. అలాంటిది జరగకుండా జూనియర్ స్థాయి విజయాలను సీనియర్‌లోనూ కొనసాగిస్తూ పెద్ద విజయాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని ఆనంద్ చెప్పుకున్నాడు.
అనూహ్య వేగంతో...
‘నా తొలి గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లంతా గొప్పగా రాణిస్తున్నారు. నిజానికి వీరు తొందరగా శిఖరానికి చేరతారని నేనూ ఊహించలేదు. వారు మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నా గానీ అదీ ఇంత వేగంగా, నమ్మశక్యం కానట్లుగా జరిగింది’ అంటూ యువ ఆటగాళ్లపై ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. తనకు నచ్చిన, ఎంపిక చేసిన టోర్నీల్లోనూ అతను ఇంకా ఆడుతూనే ఉన్నాడు.
కొన్ని నెలల క్రితం స్పెయిన్‌లో జరిగిన లియోన్ మాస్టర్స్‌లో అతను విజేతగా కూడా నిలిచాడు. ఒకవైపు ప్లేయర్‌గా కొనసాగుతూ మరో వైపు యువ ప్లేయర్లకు అతను మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా భారత జట్టుకు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచే సత్తా ఉందంటే అది ఈ జట్టుతోనే సాధ్యం అని ఒలింపియాడ్‌కు వెళ్లే ముందే ఆనంద్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించాడు. టీమ్‌లోని ఆటగాళ్లపై అతను చూపిన విశ్వాసం అది.
దానిని వారంతా నిజం చేసి చూపించారు. ‘భారత చెస్‌లో అద్భుత సమయం నడుస్తోంది. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మనం కచ్చితంగా మంచి విజయాలు ఆశిస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే వారు మనందరి అంచనాలకు మించి రాణించారు. మున్ముందు ఇవి కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ఆనంద్ భావోద్వేగంతో అన్నాడు.
ఒలింపియాడ్ బహుమతి ప్రదానోత్సవంలో ఆనంద్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. అతడిని వేదికపైకి ఆహా్వనిస్తూ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆనంద్‌ను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ చెస్ బూమ్’ అంటూ ప్రశంసలు కురిపించడం అతని విలువను చాటి చెప్పింది.
ప్రధానమంత్రి ప్రశంస
చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణాలు సాధించిన పురుషుల, మహిళల జట్ల ఘనతను ఆయన కొనియాడారు. ‘45వ చెస్ ఒలింపియాడ్‌లో అటు ఓపెన్, ఇటు మహిళల విభాగాల్లో టైటిల్స్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ రెండు టీమ్‌లకు కూడా నా అభినందనలు. భారత క్రీడల్లో ఇదో సరికొత్త అధ్యాయం. చెస్‌లో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉన్న ఉత్సాహవంతులకు కొన్ని తరాల పాటు ఈ ఘనత స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment