తిరంగాతో భారత్‌కు పాక్‌ విషెస్‌.. హాకీ ఆటగాళ్లలా కాదు! | Chess Olympiad 2024: Pakistan Team India Flag Gesture Goes Viral | Sakshi
Sakshi News home page

త్రివర్ణ పతాకంతో భారత్‌కు పాక్‌ విషెస్‌.. హాకీ ఆటగాళ్లలా కాదు!

Published Fri, Sep 27 2024 12:42 PM | Last Updated on Fri, Sep 27 2024 12:57 PM

Chess Olympiad 2024: Pakistan Team India Flag Gesture Goes Viral

చెస్‌ ఒలింపియాడ్‌-2024లో భారత్‌ విజయోత్సవాల సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి తొలిసారి పసిడి పతకాలు అందించిన అనంతరం భారత పురుషుల జట్టు సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ క్రీడాకారులుమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ క్రమంలో.. పాకిస్తాన్‌ టీమ్‌ సైతం త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ.. టీమిండియాను విష్‌ చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయన్న విషయం తెలిసిందే. 

 ప్రశంసలు, విమర్శలు
క్రికెట్‌, హాకీ, టెన్నిస్‌.. క్రీడ ఏదైనా మ్యాచ్‌ జరుగుతున్న వేళ అభిమానులు భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. మ్యాచ్‌ ఫలితం ఆధారంగా ఆయా జట్ల ఆటగాళ్లపై ప్రశంసలు, విమర్శలు కురుస్తాయి. ఇక ఇటీవల ఆసియా చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రూప్‌ స్టేజిలో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌.. సెమీ ఫైనల్‌కు చేరినా అక్కడ చైనా చేతిలో పరాజయం పాలైంది. 

పాక్‌ హాకీ ఆటగాళ్లు చైనా జెండాలతో
మూడోస్థానం కోసం పోటీపడి కాంస్యాన్ని దక్కించుకుంది. అయితే, ఫైనల్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు వ్యవహరించినతీరు విమర్శలకు తావిచ్చింది. భారత్‌- చైనా టైటిల్‌ కోసం పోటీపడుతున్న వేళ.. పాకిస్తాన్‌ హాకీ ప్లేయర్లు చైనా జెండాలు చేతబట్టి ఆ జట్టుకు తమ మద్దతు ప్రకటించారు. 

తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తి
ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో.. వారి ముఖాలు వాడిపోయాయి. అయితే, చెస్‌ ఒలింపియాడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించడం విశేషం. భారత జట్టుతో కలిసి పాక్‌ టీమ్‌ తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటింది.

స్వర్ణ చరిత్ర
ఇక భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా- పాక్‌ ప్లేయర్‌ అర్షద్‌ నదీం సైతం తమ స్నేహబంధంతో ఇరు దేశాల అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే.

బుడాపెస్ట్‌లో జరిగిన మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్‌ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్‌ సంతోష్‌ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్‌)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది.

మరోవైపు.. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్‌ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.

చదవండి: ‘యువతరానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement