Arjun Erigaisi
-
అర్జున్ మూడు గేమ్‌లు ‘డ్రా’
టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి రోజు ఆడిన మూడు గేమ్‌లనూ ‘డ్రా’ చేసుకున్నాడు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్–నిహాల్ సరీన్ (భారత్) తొలి గేమ్ 44 ఎత్తుల్లో... అర్జున్–విదిత్ (భారత్) రెండో గేమ్ 35 ఎత్తుల్లో... అర్జున్–నారాయణన్ (భారత్) మూడో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా ’గా ముగిశాయి. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య కూడా తమ తొలి మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. -
Arjun Erigaisi: ప్రపంచ రెండో ర్యాంకర్‌గా..
సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్‌లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్‌కూ మారుతుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్‌నే ప్లేయర్ తుది ర్యాంక్‌గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్‌లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్లో, ఏడో రౌండ్లో అర్జున్ తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది. నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2799 రేటింగ్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్‌లో నిలుస్తాడు. -
తిరంగాతో భారత్‌కు పాక్ విషెస్.. హాకీ ఆటగాళ్లలా కాదు!
చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ విజయోత్సవాల సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి తొలిసారి పసిడి పతకాలు అందించిన అనంతరం భారత పురుషుల జట్టు సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ క్రీడాకారులుమ సంతోషాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలో.. పాకిస్తాన్ టీమ్ సైతం త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ.. టీమిండియాను విష్ చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రశంసలు, విమర్శలుక్రికెట్, హాకీ, టెన్నిస్.. క్రీడ ఏదైనా మ్యాచ్ జరుగుతున్న వేళ అభిమానులు భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. మ్యాచ్ ఫలితం ఆధారంగా ఆయా జట్ల ఆటగాళ్లపై ప్రశంసలు, విమర్శలు కురుస్తాయి. ఇక ఇటీవల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ స్టేజిలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. సెమీ ఫైనల్‌కు చేరినా అక్కడ చైనా చేతిలో పరాజయం పాలైంది. పాక్ హాకీ ఆటగాళ్లు చైనా జెండాలతోమూడోస్థానం కోసం పోటీపడి కాంస్యాన్ని దక్కించుకుంది. అయితే, ఫైనల్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు వ్యవహరించినతీరు విమర్శలకు తావిచ్చింది. భారత్- చైనా టైటిల్ కోసం పోటీపడుతున్న వేళ.. పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు చైనా జెండాలు చేతబట్టి ఆ జట్టుకు తమ మద్దతు ప్రకటించారు. తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో.. వారి ముఖాలు వాడిపోయాయి. అయితే, చెస్ ఒలింపియాడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించడం విశేషం. భారత జట్టుతో కలిసి పాక్ టీమ్ తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటింది.స్వర్ణ చరిత్రఇక భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా- పాక్ ప్లేయర్ అర్షద్ నదీం సైతం తమ స్నేహబంధంతో ఇరు దేశాల అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే.బుడాపెస్ట్‌లో జరిగిన మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది.మరోవైపు.. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.చదవండి: ‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’Pakistani Chess Team with the Champions of Chess Olympiad 2024 - Team India!#chess #chessbaseindia #ChessOlympiad2024 #india pic.twitter.com/LHEveDvEOt— ChessBase India (@ChessbaseIndia) September 26, 2024 -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్‌లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్‌కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
ప్రతిష్టాత్మక చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న అర్జున్ ఎరిగైసి
భారత టాప్ రేటెడ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ నంబర్ 4 అర్జున్ ఎరిగైసి ప్రతిష్టాత్మక స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మేనియాలోని జెర్ముక్లో జరిగిన ఈ టోర్నీని అర్జున్ మరో రౌండ్ మిగిలుండగానే గెలుచుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అర్జున్.. రష్యాకు చెందిన వోలోడర్ ముర్జిన్ను 63 ఎత్తులో చిత్తు చేశాడు. తద్వారా ఐదో స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మొత్తం 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో అర్జున్ ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు 4.5 పాయింట్లు సాధించారు. నామమాత్రపు చివరి రౌండ్లో అర్జున్ లోకల్ బాయ్ మాన్యుయల్ పెట్రోస్యాన్‌తో తలపడతాడు.ఈ టోర్నీలో అర్జున్ నాలుగు విజయాలు, నాలుగు డ్రాలతో తొమ్మిది ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, ఓవరాల్‌గా తన రేటింగ్ పాయింట్ల సంఖ్యను 2779.9కు పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్ (2831.8), హకారు నకమురా (2801.6), ఫాబియానో కరువానా (2795.6) టాప్-3లో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఫాబియానోకు అర్జున్‌కు కేవలం 16 రేటింగ్ పాయింట్లే తేడా ఉన్నాయి. -
అర్జున్‌కు తొమ్మిదో స్థానం..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బర్దియా దానేశ్వర్ (ఇరాన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను అర్జున్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.అర్జున్‌తోపాటు మరో ఏడుగురు 6 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. అర్జున్‌కు తొమ్మిదో స్థానం ఖరారైంది. షంక్‌లాండ్ (అమెరికా), వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బర్దియా, ముర్జిన్ (రష్యా) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.ఇవి చదవండి: వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్.. -
Sports: ఈ కుర్రాడు.. చదరంగంలో 'అర్జును'డు!
పుష్కర కాలం క్రితం ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు చెస్ క్రీడపై ఆసక్తి చూపించాడు.. స్కూల్లో టీచర్ అతనిలోని ప్రతిభను మొదటిసారి గుర్తించగా.. తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేశారు. తొలి ఎత్తు వేసిన దగ్గరినుంచి అతను ఆ 64 గళ్లే ప్రపంచంలా బతికాడు. మరో ఆలోచన లేకుండా 24 గంటలూ ఆటపైనే దృష్టి పెట్టి∙సాధన చేశాడు. సహజంగానే అతని కష్టానికి తగిన ప్రతిఫలాలు వచ్చాయి. స్కూల్ దశ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు వేర్వేరు దశల్లో అనేక సంచలనాలు, పెద్ద సంఖ్యలో విజయాలు సాధించి అతను తన స్థాయిని పెంచుకున్నాడు. భారత చెస్‌కు దిక్సూచి, మన దేశంలో చదరంగానికి దారి చూపించిన మార్గదర్శి విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి ఇటీవలే అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 38 ఏళ్ల కాలంలో ఇలా ఆనంద్‌ను వెనక్కి తోసి దూసుకుపోగలగడం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. వారిలో ఒకరు ఈ కుర్రాడు. ఒక అరుదైన ఘనత మాత్రమే కాకుండా.. ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మైలురాయి ఇది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు అందుకునేందుకు కావాల్సిన ప్రేరణను ఇచ్చే క్షణం ఇది. ఈ రికార్డును సాధించిన కుర్రాడే తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి. ప్రొఫెషనల్ చెస్‌లో అడుగుడిన నాటినుంచి ఎన్నో విజయాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం నేదర్లండ్స్లో విక్ ఆన్ జీ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు. దాంతో 2659.5 ఎలో రేటింగ్‌తో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి చేరుకున్నాడు. ఆ గెలుపు తర్వాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను కలిసే అవకాశం వచ్చింది. అతనితో అర్జున్ ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన కార్ల్సన్.. అర్జున్ విజయాలను ప్రస్తావించి అభినందనలు తెలిపాడు. కుటుంబంతో సాంకేతికంగా మంచి పట్టున్న ఆటగాడని, వేగంగా శైలి మార్చుకోగలడని ప్రశంసిస్తూ త్వరలోనే 2700 రేటింగ్ దాటగల సత్తా ఉన్న కుర్రాడు అంటూ భవిష్యవాణి చెప్పాడు. ఆ ఆశీర్వాదం నిజమైంది. అదే ఏడాది అర్జున్ 2700 రేటింగ్ అందుకున్నాడు. అంతేకాదు కార్ల్సన్పైనా సంచలన విజయాన్ని సాధించాడు. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో మాగ్నస్‌ను ఓడించడంతో అందరి దృష్టీ అర్జున్‌పై పడింది. కొన్నాళ్ల క్రితం జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడినా.. ఆ టోర్నీలో అరోనియన్, నీమన్, ఇవాన్ చుక్లాంటి స్టార్లను ఓడించి ముందంజ వేయడం అర్జున్ స్థాయిని పెంచింది. వేగంగా దూసుకెళ్లి.. 2003లో పుట్టిన అర్జున్ చెస్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. వైద్యుడైన తండ్రి అండదండల కారణంగా ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అతని సహజ ప్రతిభకు తోడు సరైన శిక్షణతో ఆటపై పట్టు పెరిగింది. వరంగల్‌లో చెస్ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆటపై మరింతగా దృష్టి పెట్టేందుకు అర్జున్ హైదరాబాద్‌కు మారాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో లోకం లేకుండా అతను చదరంగం పావులతోనే గడిపాడు. మొదటినుంచి మితభాషి అయిన అర్జున్ సన్నిహితులు, కుటుంబసభ్యులను కలిసినా చెస్ గురించి, తన ఎత్తుల గురించి తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. ‘ఇంటికి కూడా రాకుండా పగలు, రాత్రి చెస్ కోచింగ్ సెంటర్లోనే ఉండిపోయేందుకు అర్జున్ సిద్ధమయ్యవాడు. ఒక దశలో ఇది మాలో కాస్త ఆందోళననూ పెంచింది. అందుకే అక్కడినుంచి తప్పించి బలవంతంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పాడు అర్జున్ తండ్రి శ్రీనివాసరావు. రాష్ట్రస్థాయి మొదలు జాతీయ స్థాయిలో వివిధ వయో విభాగాల్లో అర్జున్ మంచి విజయాలు సాధించాడు. ఈ సానుకూల ఫలితాల కారణంగా మరో ఆలోచన లేకుండా మరింత పెద్ద లక్ష్యాలపై గురి పెట్టాడు. అండర్–14 జాతీయ స్థాయి చాంపియన్‌గా నిలవడంతో 13 ఏళ్ల అర్జున్‌కు వెంటనే ఒక మంచి అవకాశం దక్కింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌కు అతను అర్హత సాధించడంలో సఫలమయ్యాడు. అయితే ఆ అర్హతతో ఆగిపోకుండా ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం కూడా సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ వేటలో.. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకోవడంలో కూడా అర్జున్ ఎదుగుదల వేగంగా సాగింది. 2018 ఏడాది ఆరంభమయ్యే సమయానికి అతను ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) కూడా కాదు. జనవరిలో కోల్‌కతాలో తొలి ఐఎం నార్మ్ సాధించడంతో పాటు మొదటిసారి 2500 రేటింగ్‌ను అతను దాటాడు. తర్వాతి రెండు నెలల్లో మరో రెండు ఐఎం నార్మ్‌లు అతని ఖాతాలో చేరాయి. ఐఎం సాధించిన తర్వాత అర్జున్ వరుసగా విదేశీ టోర్నీల్లో ఆడాడు. నేషనల్ టైటిల్‌తో, విశ్వనాథన్ ఆనంద్‌తో అదే ఏడాది అక్టోబర్‌కు వచ్చే సరికి గ్రాండ్‌మాస్టర్‌గా మారడం విశేషం. ఆర్మేనియా, సెర్బియా, హంగరీ, స్విట్జర్లండ్లలో ఆడి తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. అబుదాబిలో అతనికి మూడో జీఎం నార్మ్ దక్కింది. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల్లో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున 32వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన అర్జున్.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడం విశేషం. ఈ మైలురాయి తర్వాత కొద్ది రోజులకే టర్కీలో జరిగిన అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. వరుస విజయాలతో.. ఏ క్రీడలోనైనా జూనియర్ స్థాయిలో వరుస విజయాలు సాధించి, ప్రత్యేక గుర్తింపుతో సీనియర్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు పెరిగిపోతాయి. వాటితో పాటు తీవ్రమైన పోటీ, బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు పెద్ద స్థాయిలో భిన్నమైన ఫలితాలు కూడా వస్తాయి. కానీ అలాంటి ప్రతికూలతలను దాటి ముందుకు వెళ్లినప్పుడే ఆటగాడి సత్తా ఏమిటో తెలుస్తుంది. చెస్‌లో అర్జున్ కూడా అలాంటి అంచనాలను పెంచడమే కాదు వాటిని అందుకోవడంలోనూ సఫలమయ్యాడు. బాలమేధావి అనే పేరుతోనే సరిపెట్టుకోకుండా దిగ్గజ ఆటగాళ్లతో తలపడి పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ ఈతరం భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో చాంపియన్స్ చెస్ టూర్లో, లిండార్స్ బ్లిజ్ టోర్నమెంట్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలవడం అర్జున్ కెరీర్లో కీలక మలుపు. తర్వాతి ఏడాది కూడా అతను టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నమెంట్‌ను గెలుచుకు న్నాడు. 2022లో జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ మరో పెద్ద టోర్నీలో ఢిల్లీ ఓపెన్‌లో కూడా టైటిల్ గెలుచుకున్నాడు. అబూధాబీ ఇంటర్నేషనల్ చెస్ గెలిచిన తర్వాత మరోసారి టాటా స్టీల్ బ్లిట్జ్‌లో అతను చాంపియన్‌గా నిలిచాడు. అటు క్లాసిక్‌తో పాటు ఇటు ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో కూడా అదే స్థాయిలో అర్జున్ మంచి ప్రదర్శన కనబరు స్తుండటం చెప్పుకోదగ్గ అంశం. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అర్జున్ ప్రస్తుతం 2756 ఎలో రేటింగ్‌తో ఆనంద్ (2751)ను అధిగమించి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచాడు. మున్ముందు 2800 రేటింగ్‌ను దాటడంతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలవడాన్ని అతను దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అర్జున్ ప్రతిభ, ఇటీవలి ప్రదర్శనను చూస్తే ఎంతటి పెద్ద విజయమైనా అసాధ్యం కాదనిపిస్తుంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: హై హై హెట్‌మైర్... -
FIDE Grand Swiss: అర్జున్‌కు మూడో గెలుపు
గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రినాత్ జుమాబయేవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఐదో రౌండ్ తర్వాత అర్జున్ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
ప్రపంచకప్‌లో అదుర్స్.. ఇదో చారిత్రక ఘట్టం: భారత చెస్ దిగ్గజం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్ చేరతాడు. తొలి గేమ్‌లు డ్రా మరో క్వార్టర్స్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 48 ఎత్తులో గుకేశ్ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్ ఫైనల్ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విదిత్ గుజరాతీ (భారత్), నిజాత్ అబసోవ్ (అజర్ బైజాన్) మధ్య గేమ్ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్ డొమినెగ్వెజ్ పెరెజ్ (అమెరికా) మధ్య గేమ్ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి. ఇదో చారిత్రక ఘట్టం మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ప్రిక్వార్టర్స్‌లో అర్జున్
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అర్జున్‌తోపాటు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. నాలుగో రౌండ్లో అర్జున్ 1.5–0.5తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విదిత్ 1.5–0.5తో ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స్) పై గెలుపొందారు. సిందరోవ్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ గురువారం జరిగిన రెండో గేమ్‌లో 60 ఎత్తుల్లో నెగ్గాడు. బాక్రోట్తో బుధవారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన విదిత్ గురువారం జరిగిన రెండో గేమ్‌ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్లో రెండు గేమ్‌లు ముగిశాక గుకేశ్ (భారత్)–ఎసిపెంకో (రష్యా); ప్రజ్ఞానంద (భారత్)–నకముర (అమెరికా); నిహాల్ (భారత్) –నెపోమ్నిశి (రష్యా) 1–1తో సమంగా ఉండటంతో వీరి మధ్య నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు. బెలా ఖొటె నాష్విలి (జార్జియా)తో తొలి గేమ్‌లో ఓడిన హంపి గురువారం జరిగిన రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. హారిక, ఎలైన్ రోబర్స్ (నెదర్లాండ్స్) మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 1–1తో సమంగా ఉన్నారు. -
షార్జా మాస్టర్స్ విజేత అర్జున్
ఆరంభ రౌండ్లలో తడబడ్డా... చివర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రౌండ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 27 ఎత్తుల్లో నోదిర్బెక్ యాకుబోయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత మరో ఏడుగురితో కలిసి అర్జున్ సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు. అయితే తొమ్మిదో రౌండ్లో అర్జున్ గెలుపొందగా... మిగతా ఆరుగురు ప్లేయర్లు తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అర్జున్‌కు టైటిల్ ఖరారైంది. భారత్‌కే చెందిన దొమ్మరాజు గుకేశ్ ఆరు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా గుకేశ్‌కు రెండో ర్యాంక్ లభించింది. విజేతగా నిలిచిన అర్జున్‌కు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
అర్జున్ శుభారంభం; హారిక గేమ్ ‘డ్రా’
షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన ఈ టోర్నీలో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ కాస్పెర్ పియోరన్తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 32 ఎత్తుల్లో గెలుపొందాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేశ్ కూడా తొలి రౌండ్లో గెలిచాడు. వెస్కోవి (బ్రెజిల్)తో జరిగిన గేమ్‌లో గుకేశ్ 33 ఎత్తుల్లో విజయం సాధించాడు. హారిక గేమ్ ‘డ్రా’ నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది. జర్మనీ ప్లేయర్ దినారా వాగ్నర్‌తో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
Tepe Sigeman And Co 2023 R4: అర్జున్‌కు మూడో పరాజయం
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో పరాజయం చవిచూశాడు. స్వీడన్లో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
మూడో స్థానంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్
సాటీ జుల్డిజ్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నీలో 11 రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 7 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్జున్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయాడు. సిందరోవ్, హు ఇఫాన్, బిబిసారా, గెల్ఫాండ్, క్రామ్నిక్, కాటరీనా లాగ్నోలపై అర్జున్ నెగ్గాడు. నేడు జరిగే మరో 11 రౌండ్లతో టోర్నీ ముగుస్తుంది. -
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్న అర్జున్ ఇరిగేశి.. ఐదేళ్లకు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి తన ప్రొఫెషనల్ కెరీర్లో తొలిసారి స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పని చేస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘క్వాంట్‌బాక్స్’తో అర్జున్ చేతులు కలిపాడు. ఐదేళ్ల కాలానికిగాను ఈ స్పాన్సర్షిప్ విలువ 15 లక్షల డాలర్లు (సుమారు రూ.12 కోట్ల 41 లక్షలు) కావడం విశేషం. అంటే ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల 50 లక్షలుగా ఈ డీల్ ఉంటుంది. భారత చెస్ చరిత్రలో దీనిని అత్యుత్తమ ఒప్పందంగా భావిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ‘క్వాంట్‌బాక్స్’ వ్యవస్థాపకుడు, మాజీ చెస్ ఆటగాడైన ప్రశాంత్ సింగ్ ఈ ఒప్పందం వివరాలను వెల్లడించారు. 2022లో అర్జున్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది టాటా స్టీల్ చాలెంజర్స్, జాతీయ చాంపియన్‌షిప్, ఢిల్లీ ఓపెన్, అబుదాబి మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన అర్జున్ ప్రస్తుతం 2722 ఎలో రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానంలో ఉన్నాడు. -
‘బ్లిట్జ్’ చాంపియన్ అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ ఈవెం ట్లో అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్ ఈవెంట్లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్ ఈవెంట్లో టైటిల్ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
రెండో స్థానంలో హంపి, హారిక, అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలి రోజు మూడో రౌండ్ గేమ్‌లు ముగిశాక మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తొలి రౌండ్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై 30 ఎత్తుల్లో నెగ్గిన హంపి... అనా ఉషెనినా (ఉక్రెయిన్), మరియా (ఉక్రెయిన్)లతో జరిగిన తదుపరి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వైశాలితో తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... రెండో గేమ్‌లో ఒలివియా (పోలాండ్)పై గెలిచి, మూడో గేమ్‌ను ఉషెనినాతో ‘డ్రా’గా ముగించింది. అర్జున్ తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి, విదిత్, గుకేశ్ (భారత్)లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. బుధవారం మరో మూడు రౌండ్లు, గురువారం మరో మూడు రౌండ్లు జరుగుతాయి. తొలిసారి ఈ టోర్నీలో ఓపెన్, మహిళల విభాగాల్లో సమాన ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. -
Meltwater Champions Tour Finals: అర్జున్ ఖాతాలో తొలి విజయం
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 3–1తో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, రెండో గేమ్‌లో 58 ఎత్తుల్లో నెగ్గాడు. మూడో గేమ్‌ను 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన అర్జున్ చివరిదైన నాలుగో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమి చవిచూశాడు. ప్రజ్ఞానంద 1–2తో వెస్లీ సో (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎనిమిది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో, అర్జున్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
Champions Tour Finals Chess Tourney: తొలి రౌండ్లోనే ఓడిన అర్జున్, ప్రజ్ఞానంద
చాంపియన్స్ టూర్ ఫైనల్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద తొలి రౌండ్లో ఓడిపోయారు. అమెరికాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 0.5–2.5తో క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) చేతిలో... ప్రజ్ఞానంద 1.5–2.5తో షఖిర్యార్ (అజర్బైజాన్) చేతిలో ఓడారు. -
వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత గ్రాండ్ మాస్టర్
ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ ఛాంపియన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు. ఈ పోరులో అర్జున్ 54 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించి, గత నెలలో జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్లైన్ టోర్నీలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్సన్ నాలుగు సార్లు భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోయాడు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా.. తాజాగా అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌కు చుక్కలు చూపించాడు. -
Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్
న్యూయార్క్: జూలియస్ బేర్ జనరేషన్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ జోరు కొనసాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లియెమ్ క్వాంగ్ లీ (వియత్నాం)తో జరిగిన సెమీఫైనల్లో అర్జున్ 4–2తో గెలిచాడు. నిర్ణీత నాలుగు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలువడంతో రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. రెండు టైబ్రేక్ గేముల్లో అర్జున్ విజయం సాధించాడు. టైటిల్ కోసం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్ (నార్వే)తో అర్జున్ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండు రోజులపాటు నాలుగు గేమ్‌లతో కూడిన రెండు ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Julius Baer Generation Cup: సెమీఫైనల్లో అర్జున్ ఇరిగేశి
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్‌ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్‌లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్‌ను ఓడి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్‌లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్పై కార్ల్సన్, నీమన్‌పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్‌లో కార్ల్సన్తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు. -
అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్‌మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం.