అర్జున్ ఇరిగేశి, యూత్ ఇండియా గోల్డ్ మెడల్‌తో..
పుష్కర కాలం క్రితం ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు చెస్ క్రీడపై ఆసక్తి చూపించాడు.. స్కూల్‌లో టీచర్ అతనిలోని ప్రతిభను మొదటిసారి గుర్తించగా.. తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేశారు. తొలి ఎత్తు వేసిన దగ్గరినుంచి అతను ఆ 64 గళ్లే ప్రపంచంలా బతికాడు. మరో ఆలోచన లేకుండా 24 గంటలూ ఆటపైనే దృష్టి పెట్టి∙సాధన చేశాడు.
సహజంగానే అతని కష్టానికి తగిన ప్రతిఫలాలు వచ్చాయి. స్కూల్ దశ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు వేర్వేరు దశల్లో అనేక సంచలనాలు, పెద్ద సంఖ్యలో విజయాలు సాధించి అతను తన స్థాయిని పెంచుకున్నాడు. భారత చెస్‌కు దిక్సూచి, మన దేశంలో చదరంగానికి దారి చూపించిన మార్గదర్శి విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి ఇటీవలే అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 38 ఏళ్ల కాలంలో ఇలా ఆనంద్‌ను వెనక్కి తోసి దూసుకుపోగలగడం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. వారిలో ఒకరు ఈ కుర్రాడు.
ఒక అరుదైన ఘనత మాత్రమే కాకుండా.. ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మైలురాయి ఇది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు అందుకునేందుకు కావాల్సిన ప్రేరణను ఇచ్చే క్షణం ఇది. ఈ రికార్డును సాధించిన కుర్రాడే తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి. ప్రొఫెషనల్ చెస్‌లో అడుగుడిన నాటినుంచి ఎన్నో విజయాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు.
రెండేళ్ల క్రితం నేదర్లండ్స్‌లో విక్ ఆన్ జీ టోర్నమెంట్‌లో అర్జున్ విజేతగా నిలిచాడు. దాంతో 2659.5 ఎలో రేటింగ్‌తో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి చేరుకున్నాడు. ఆ గెలుపు తర్వాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను కలిసే అవకాశం వచ్చింది. అతనితో అర్జున్ ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన కార్ల్‌సన్.. అర్జున్ విజయాలను ప్రస్తావించి అభినందనలు తెలిపాడు.
కుటుంబంతో
సాంకేతికంగా మంచి పట్టున్న ఆటగాడని, వేగంగా శైలి మార్చుకోగలడని ప్రశంసిస్తూ త్వరలోనే 2700 రేటింగ్ దాటగల సత్తా ఉన్న కుర్రాడు అంటూ భవిష్యవాణి చెప్పాడు. ఆ ఆశీర్వాదం నిజమైంది. అదే ఏడాది అర్జున్ 2700 రేటింగ్ అందుకున్నాడు. అంతేకాదు కార్ల్‌సన్‌పైనా సంచలన విజయాన్ని సాధించాడు. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ టోర్నీలో మాగ్నస్‌ను ఓడించడంతో అందరి దృష్టీ అర్జున్‌పై పడింది. కొన్నాళ్ల క్రితం జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్‌సన్ చేతిలో ఓడినా.. ఆ టోర్నీలో అరోనియన్, నీమన్, ఇవాన్ చుక్‌లాంటి స్టార్లను ఓడించి ముందంజ వేయడం అర్జున్ స్థాయిని పెంచింది.
వేగంగా దూసుకెళ్లి..
2003లో పుట్టిన అర్జున్ చెస్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. వైద్యుడైన తండ్రి అండదండల కారణంగా ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అతని సహజ ప్రతిభకు తోడు సరైన శిక్షణతో ఆటపై పట్టు పెరిగింది. వరంగల్‌లో చెస్ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆటపై మరింతగా దృష్టి పెట్టేందుకు అర్జున్ హైదరాబాద్‌కు మారాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో లోకం లేకుండా అతను చదరంగం పావులతోనే గడిపాడు.
మొదటినుంచి మితభాషి అయిన అర్జున్ సన్నిహితులు, కుటుంబసభ్యులను కలిసినా చెస్ గురించి, తన ఎత్తుల గురించి తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. ‘ఇంటికి కూడా రాకుండా పగలు, రాత్రి చెస్ కోచింగ్ సెంటర్‌లోనే ఉండిపోయేందుకు అర్జున్ సిద్ధమయ్యవాడు. ఒక దశలో ఇది మాలో కాస్త ఆందోళననూ పెంచింది. అందుకే అక్కడినుంచి తప్పించి బలవంతంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పాడు అర్జున్ తండ్రి శ్రీనివాసరావు. రాష్ట్రస్థాయి మొదలు జాతీయ స్థాయిలో వివిధ వయో విభాగాల్లో అర్జున్ మంచి విజయాలు సాధించాడు.
ఈ సానుకూల ఫలితాల కారణంగా మరో ఆలోచన లేకుండా మరింత పెద్ద లక్ష్యాలపై గురి పెట్టాడు. అండర్–14 జాతీయ స్థాయి చాంపియన్‌గా నిలవడంతో 13 ఏళ్ల అర్జున్‌కు వెంటనే ఒక మంచి అవకాశం దక్కింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌కు అతను అర్హత సాధించడంలో సఫలమయ్యాడు. అయితే ఆ అర్హతతో ఆగిపోకుండా ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం కూడా సాధించాడు.
గ్రాండ్‌మాస్టర్ వేటలో..
ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకోవడంలో కూడా అర్జున్ ఎదుగుదల వేగంగా సాగింది. 2018 ఏడాది ఆరంభమయ్యే సమయానికి అతను ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) కూడా కాదు. జనవరిలో కోల్‌కతాలో తొలి ఐఎం నార్మ్ సాధించడంతో పాటు మొదటిసారి 2500 రేటింగ్‌ను అతను దాటాడు. తర్వాతి రెండు నెలల్లో మరో రెండు ఐఎం నార్మ్‌లు అతని ఖాతాలో చేరాయి. ఐఎం సాధించిన తర్వాత అర్జున్ వరుసగా విదేశీ టోర్నీల్లో ఆడాడు.
నేషనల్ టైటిల్‌తో, విశ్వనాథన్ ఆనంద్‌తో
అదే ఏడాది అక్టోబర్‌కు వచ్చే సరికి గ్రాండ్‌మాస్టర్‌గా మారడం విశేషం. ఆర్మేనియా, సెర్బియా, హంగరీ, స్విట్జర్లండ్‌లలో ఆడి తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. అబుదాబిలో అతనికి మూడో జీఎం నార్మ్ దక్కింది. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల్లో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున 32వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన అర్జున్.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడం విశేషం. ఈ మైలురాయి తర్వాత కొద్ది రోజులకే టర్కీలో జరిగిన అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు.
వరుస విజయాలతో..
ఏ క్రీడలోనైనా జూనియర్ స్థాయిలో వరుస విజయాలు సాధించి, ప్రత్యేక గుర్తింపుతో సీనియర్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు పెరిగిపోతాయి. వాటితో పాటు తీవ్రమైన పోటీ, బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు పెద్ద స్థాయిలో భిన్నమైన ఫలితాలు కూడా వస్తాయి. కానీ అలాంటి ప్రతికూలతలను దాటి ముందుకు వెళ్లినప్పుడే ఆటగాడి సత్తా ఏమిటో తెలుస్తుంది.
చెస్‌లో అర్జున్ కూడా అలాంటి అంచనాలను పెంచడమే కాదు వాటిని అందుకోవడంలోనూ సఫలమయ్యాడు. బాలమేధావి అనే పేరుతోనే సరిపెట్టుకోకుండా దిగ్గజ ఆటగాళ్లతో తలపడి పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ ఈతరం భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో చాంపియన్స్ చెస్ టూర్‌లో, లిండార్స్ బ్లిజ్ టోర్నమెంట్‌లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలవడం అర్జున్ కెరీర్‌లో కీలక మలుపు. తర్వాతి ఏడాది కూడా అతను టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నమెంట్‌ను గెలుచుకు న్నాడు. 2022లో జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ మరో పెద్ద టోర్నీలో ఢిల్లీ ఓపెన్‌లో కూడా టైటిల్ గెలుచుకున్నాడు. అబూధాబీ ఇంటర్నేషనల్ చెస్ గెలిచిన తర్వాత మరోసారి టాటా స్టీల్ బ్లిట్జ్‌లో అతను చాంపియన్‌గా నిలిచాడు.
అటు క్లాసిక్‌తో పాటు ఇటు ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో కూడా అదే స్థాయిలో అర్జున్ మంచి ప్రదర్శన కనబరు స్తుండటం చెప్పుకోదగ్గ అంశం. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అర్జున్ ప్రస్తుతం 2756 ఎలో రేటింగ్‌తో ఆనంద్ (2751)ను అధిగమించి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచాడు. మున్ముందు 2800 రేటింగ్‌ను దాటడంతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలవడాన్ని అతను దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అర్జున్ ప్రతిభ, ఇటీవలి ప్రదర్శనను చూస్తే ఎంతటి పెద్ద విజయమైనా అసాధ్యం కాదనిపిస్తుంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment